హైకోర్ట్ అక్క‌డే పెట్టాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యం!

0

ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క అడుగులు వేస్తోంది. రాజ‌ధాని విష‌యంలో స్ప‌ష్ట‌త‌నిచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అమ‌రావ‌తి అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెబుతూనే వికేంద్రీక‌ర‌ణ వైపు మొగ్గు చూపుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందులో భాగంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం మొద‌ల‌య్యింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ తాత్కాలిక హైకోర్ట్ భ‌వ‌నం అమ‌రావ‌తి ప్రాంతంలో నిర్మించారు. విశాలమైన భ‌వ‌నంలో ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ విజ‌య‌వాడ‌కు అత్యంత దూరంగా ఉండ‌డం, హైకోర్ట్ ప్రాంతంలో ఎటువంటి స‌దుపాయాలు అందుబాటులో లేక‌పోవ‌డంతో న్యాయ‌నిపుణులు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో రాజ‌ధాని అమ‌రావ‌తిపై క‌స‌ర‌త్త‌లు చేస్తున్న జ‌గ‌న్ హైకోర్ట్ విష‌యంలో త‌న ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా ఆయ‌న రాయ‌ల‌సీమ వైపు చూస్తున్న‌ట్టు చెబుతున్నారు. క‌ర్నూలులో హైకోర్ట్ ఏర్పాటు చేయ‌డంతో పాటుగా ఉత్త‌రాంధ్ర‌లో హైకోర్ట్ బెంచ్ ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేసిన‌ట్టు క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

క‌ర్నూలులో హైకోర్ట్ ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా, విశాఖ‌లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయ‌డం ద్వారా అన్ని ప్రాంతాల‌కు స‌మాన న్యాయం చేస్తున్న‌ట్టు క‌నిపించేందుకు ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తున్న‌ట్టుగా చెబుతున్నారు. ప‌రిపాల‌నా రాజ‌ధానిగా అమ‌రావ‌తి ప్రాంతం ఉంచి, మిగిలిన వ్య‌వ‌హారాలు మాత్రం మ‌ళ్లించే అవ‌కాశాలున్నాయ‌న్న వాద‌న‌కు హైకోర్ట్ త‌ర‌లింపు ప్ర‌తిపాద‌న ఊత‌మిస్తోంది.

ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల‌లో హైకోర్ట్ రాజ‌ధానిలో కాకుండా ఇత‌ర న‌గ‌రాల్లో ఉన్నాయి. కేర‌ళ హైకోర్ట్ కొచ్చి, యూపీ హైకోర్ట్ అల‌హాబాద్ వంటి ప్రాంతాల్లో కొన‌సాగుతున్న త‌రుణంలో ఏపీ హైకోర్ట్ కూడా క‌ర్నూలులో ఏర్పాటు చేయ‌డం స‌ముచిత‌మ‌నే అభిప్రాయం వినిపిస్తోంది. త‌ద్వారా అభివృద్ది ఫ‌లాలు అంద‌రికీ ద‌క్కే అవ‌కాశాలుంటాయ‌ని, శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీతో పాటుగా ప‌లువురు నిపుణుల సూచ‌న‌లు అమ‌లు చేసిన‌ట్ట‌వుతుంద‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు భావిస్తున్న‌ట్టుగా ప్ర‌చారం సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here