వైసీపీ వాళ్ల‌కు ఎంత క‌ష్ట‌మొచ్చిందో…!

  0

  ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఒంటికాలిపై లేస్తూ ఎంతో క్రియేటివిటీతో ఆక‌ట్టుకున్న వైసీపీ శ్రేణుల‌కు ఇప్పుడు ఊపిరిస‌ల‌ప‌డం లేదు. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో చెల‌రేగిన వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ఇప్పుడు క‌ష్ట‌కాలం దాపురిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితుల్లోకి నెట్ట‌బ‌డిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

  జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను స‌మ‌ర్థించ‌లేక వారంతా స‌త‌మ‌తం అవుతున్నారు. గ‌తంలో చేసిన త‌ప్పిదాల‌నే జ‌గ‌న్ ప్ర‌భుత్వం కూడా నెత్తిన పెట్టుకోవ‌డం స‌మ‌స్య‌కు కార‌ణంగా క‌నిపిస్తోంది. తాజాగా టీటీడీ బోర్డ్ వ్య‌వ‌హారంలో శేఖ‌ర్ రెడ్డి నియామ‌కం అందుకు ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. గ‌తంలో శేఖ‌ర్ రెడ్డి లాంటి అవినీతిప‌రుడిని నియామ‌కం కోసం లోకేశ్ 100 కోట్లు తీసుకున్నారంటూ వైసీపీ విమ‌ర్శించింది. అంతేగాకుండా ఆయ‌న వ్య‌వ‌హారాన్ని వైర‌ల్ చేసి టీడీపీని బ‌ద్నాం చేసింది.

  కానీ ఇప్పుడు అదే శేఖ‌ర్ రెడ్డి ప్ర‌త్యేక ఆహ్వానితుడి హోదాలో మ‌ళ్లీ టీటీడీ తెర‌మీద‌కు వ‌చ్చారు. దానికి కార‌ణాలు ఇవంటూ వైసీపీ నేత‌లు ఎంత స‌ర్థుకున్నా జ‌నానికి రుచించే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. దాంతో వైసీపీ సోష‌ల్ మీడియా వింగ్ కి ఏం చేయాల‌న్న‌ది మింగుడుప‌డ‌ని విష‌యంగా మారింది. అంతేగాకుండా నిత్యం ఆంద్ర‌ప్ర‌దేశ్ మీద బుర‌ద జ‌ల్లే న‌మ‌స్తే తెలంగాణా య‌జ‌మానికి కూడా కేటీఆర్ సిఫార్సుతో టీటీడీలో ప‌ద‌వి ద‌క్కింది. ఇక బీజేపీ కీల‌క‌నేత‌గా వ్య‌వ‌హ‌రించిన కాలంలో చంద్ర‌బాబుకి అన్నిర‌కాలుగానూ చేదోడుగా ఉన్నారంటూ విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు స‌మీప బంధువు ముప్ప‌వ‌ర‌పు నిశిత కూడా టీటీడీలో అవ‌కాశం ద‌క్కించుకున్నారు.

  ఇలాంటి అనేక మందికి ఛాన్స్ ఇచ్చిన జ‌గ‌న్ పట్ల ప్ర‌జ‌ల్లో అపోహ‌లు పెరుగుతున్నాయి. ఇన్నాళ్లుగా క‌ష్ట‌ప‌డి నిర్మించుకున్న అభిమానం నీరుగారిపోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో వాటిని ఎలా స‌మ‌ర్థించుకోవాలో తెలియ‌ని వైసీపీ కార్య‌క‌ర్త‌లు కొంత గంద‌ర‌గోళంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఎక్క‌డా లేనంత క‌ష్టం ఎదుర్కోవాల్సి వ‌స్తోంది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here