వంశీని వారించ‌క‌పోతే..ఎవ‌రికైనా న‌ష్ట‌మే..!

0

వ‌ల్ల‌భ‌నేని వంశీ. ప‌రిటాల ర‌వీంద్ర అనుచ‌రుడిగా తెర‌మీద‌కు వ‌చ్చి, జూనియ‌ర్ ఎన్టీఆర్ స్నేహితుడిగా అంద‌రికీ చిర‌ప‌రిచితుడిగా మారి, విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో త‌న‌దైన మార్క్ చూపించిన నాయ‌కుడు. ఎంపీగా ఓట‌మి పాల‌యిన‌ప్ప‌టికీ వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన వంశీకి పార్టీల‌కు అతీతంగా ప‌లువురు అభిమానులున్నారంటే అతిశ‌యోక్తి కాదు. గ‌న్న‌వ‌రం గ‌డ్డ మీద త‌న హ‌వా చాటుతూ జ‌గ‌న్ గాలిలో కూడా టీడీపీ జెండా నిల‌బెట్ట‌గ‌లిగారంటే వంశీకి ఉన్న ఫాలోయింగ్ అర్థ‌మ‌వుతుంది.

అయితే ఎన్నిక‌ల్లో త‌న పార్టీ అధికారం కోల్పోయిన ఆరు నెల‌ల్లోగాన వంశీ తీరు మారిపోయింది. క‌డుపుకి అన్నం తినేవాడెవ‌రూ చేర‌ర‌ని చెప్పిన వైసీపీ వైపు ఆయ‌న చూపు సారించారు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో ఫిరాయింపులు పెద్ద స‌మ‌స్య కాదు కాబ‌ట్టి, ఆయ‌న్ని వేలెత్తి చూపించే అర్హ‌త చాలామంది నాయ‌కులకు లేదు. రాజ‌కీయంగా అనేక ఉద్దాన ప‌త‌నాలు అనుభ‌వించిన వంశీకి ఇప్పుడు మ‌రో కొత్త అనుభ‌వం ఎదుర‌వుతుందంతే అని స‌రిపెట్టుకోవ‌చ్చు.

కానీ త‌న రాజ‌కీయ భ‌విత‌వ్యం వెల్ల‌డించ‌డం కోసం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలోనూ, ఆత‌ర్వాత టీవీ చానెల్ చ‌ర్చ‌ల్లోనూ వంశీ వ్య‌వ‌హారం చాలామందికి మింగుడుప‌డ‌డం లేదు. హ‌ద్దులు మీరి మాట్లాడిన‌ట్టుగా క‌నిపిస్తోంది. రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు వ‌దిలేసి, వ్య‌క్తిగ‌తంగా బాబూ రాజేంద్ర ప్ర‌సాద్ ని టార్గెట్ చేసిన తీరు చాలామందికి ఇబ్బందిగా క‌నిపించింది. కాకి, ఒంటిక‌న్ను స‌హా అన్ని ర‌కాల అస‌భ్య‌క‌ర ప‌దజాలం ప్ర‌యోగించ‌డం అభ్యంత‌ర‌క‌ర‌మ‌నే అభిప్రాయం వినిపిస్తోంది. బాబూ రాజేంద్ర‌ప్ర‌సాద్ అంటే చీద‌రించుకునే ప‌లువురికి ఇది పూర్తిగా తృప్తినిస్తుంది. టీడీపీ, చంద్ర‌బాబు, నారా లోకేశ్ అంటే గిట్ట‌నివారికి ఆనందాన్నిస్తోంది. వంశీ అభిమానుల‌కు సంతృప్తి క‌లిగిస్తుంది. కానీ సామాన్య ప్ర‌జ‌ల్లో మాత్రం ఈ భాష‌, వ్య‌వ‌హార ధోర‌ణి గ‌మ‌నిస్తుంటే రాజ‌కీయ నేత‌ల దిగజారుడు ఏదశ‌కు చేరిందో అర్థ‌మ‌వుతోందనే నిర్ణ‌యానికి రావ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఇలాంటి అతి ప్ర‌వ‌ర్త‌న‌కు అడ్డుక‌ట్ట వేయాల్సి ఉంది. మీడియాలో ప్ర‌సారం చేయ‌డం ద్వారా రేటింగ్స్ పెంచుకునే ప్ర‌య‌త్నాల‌ను ఇప్ప‌టికే ప‌లువురు త‌ప్పుబ‌డుతున్నారు. అదేస‌మ‌యంలో పార్టీల అధినేత‌లు కూడా క‌ట్ట‌డి చేయ‌క‌పోతే ఆ త‌ర్వాత మ‌ళ్లీ పార్టీ మారే ప‌రిస్థితి వ‌చ్చిన‌ప్పుడు వారికే క‌ష్టం త‌ప్ప‌ద‌నే స‌ల‌హాలు కూడా వినిపిస్తున్నాయి. విమ‌ర్శ‌లు చేయాలి, త‌ప్పులు చెప్పాలి, త‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించాలి, త‌న దారి తాను చూసుకోవాలి. కానీ నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ‌డం మాత్రం స‌మంజసం కాద‌ని గ్ర‌హించ‌డం అంద‌రికీ అవ‌స‌రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here