రాజ‌ధాని అంటే వాళ్లు మాత్ర‌మే కాదు, ఇటు చూడు జ‌గ‌న్!

0

రాజ‌న్న రాజ్యం స్థాపిస్తామ‌ని వైఎస్ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు. వైఎస్సార్ త‌ర‌హాలో రైతుల సంక్షేమానికి పాటుప‌డ‌తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం అమ‌రావ‌తిలో రైతుల రోడ్డెక్కి ఆందోళ‌న చేస్తుంటే క‌నీసం వాటి ప‌ట్ల స్పందించ‌క‌పోగా, చిన్న‌బుచ్చే ప్ర‌యత్నం చేయ‌డం విస్మ‌య‌క‌రంగా క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుతం రాజ‌ధాని అంశంలో న‌ష్ట‌పోతున్న రైతుల్లో అత్య‌ధికులు తెలుగుదేశం పార్టీ వారే కావ‌చ్చు. పైగా వారంతా ఒకే సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు అత్య‌ధికులుగా ఉండ‌వ‌చ్చు. అయినా ప్ర‌భుత్వం వారి విష‌యంలో స్పందించాల్సి ఉంటుంది. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు చొర‌వ‌చూపాల్సి ఉంటుంది. ప్ర‌భుత్వం కొన్ని ప్ర‌తిపాద‌న‌ల‌తో రైతుల‌కు ధీమా క‌లిగించాల్సి ఉంటుంది.

ఆందోళ‌న‌ల సంద‌ర్భంగా కొంద‌రు అతిగా వ్య‌వ‌హ‌రించ‌డం, రియ‌ల్ ఎస్టేట్ లాభాల‌తో క‌న్నూమిన్నూ కాన‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్న వారు అధిక ప్ర‌సంగాలు చేస్తుండ‌డంతో ప్ర‌భుత్వానికి, వారి అనునాయుల‌కు గిట్ట‌క‌పోవ‌చ్చు. కానీ న‌ష్ట‌పోతున్న సామాన్య రైతులు కూడా చాలామందే ఉన్నారు. భూములు వెన‌క్కి ఇచ్చేస్తామ‌ని ప‌దే ప‌దే ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్న మంత్రులు ఎలా ఇస్తారు,, ఎప్పుడిస్తారు.. ఇప్ప‌టికే రోడ్లు , నిర్మాణాల కోసం చ‌దును చేసేసిన నేల మ‌ళ్లీ సాగులోకి ఎలా తీసుకువ‌స్తార‌న్న‌ది చెప్ప‌డం లేదు. దాంతో ప‌ది, ప‌దిహేను ఎక‌రాల రైతుల‌కు క‌లిగే న‌ష్టం పెద్ద‌గా ఉండ‌క‌పోవ‌చ్చు గానీ ఈ అనిచ్ఛితి మూలంగా ఎక‌రం, అరెక‌రం రైతులు క‌ల‌వ‌ర‌పడుతున్నారు.

అందులో అన్ని సామాజిక‌వ‌ర్గాల ప్ర‌జ‌లూ ఉన్నార‌న్న‌ది ప్ర‌భుత్వం మ‌ర‌చిపోకూడ‌దు. రైతుల విష‌యంలో చొర‌వ చూపాల్సి ఉంది. 20వేల మంది రైతుల ప్ర‌యోజ‌నాల‌తో ముడిప‌డిన అంశంలో క‌నీసం 10వేల మందికి పైగా రైతులు తీవ్రంగా ఆందోళ‌న‌లో ఉన్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీలను చూసి, టీడీపీ పెద్ద‌ల‌ను చూసి ఈ రైతుల‌ను విస్మ‌రించ‌డం స‌మంజ‌సం కాదు. త‌న పాల‌న‌లో అన్ని వ‌ర్గాల‌ను స‌మానంగా చూడాల్సిన స‌మ‌యంలో రాజ‌ధాని మీద గంపెడాశ‌తో ఉన్న వారి ఆశ‌లు నెర‌వేర్చే అవ‌కాశం లేన‌ప్పుడు మ‌రో రీతిలో వారికి న్యాయం జ‌ర‌గాలి. అప్ప‌ట్లో భూములు ఇవ్వ‌మ‌ని మొత్తుకున్నా, భ‌యానా, న‌యానా లాక్కున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మాదిరే ఇప్పుడు మా భూములు మాకొద్దు అంటూ వ‌దిలించుకునే ప్ర‌య‌త్నం చేస్తే జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించ‌డం మ‌రింత ఆందోళ‌న‌క‌రం.

రైతుల స‌మ‌స్య ప‌రిష్కారం కోసం త‌క్ష‌ణం ప్ర‌భుత్వం చొర‌వ ప్ర‌ద‌ర్శించాలి. స‌మంజ‌స‌మైన రీతిలో వారి భూముల విష‌యంలో స‌మ‌గ్ర విధానం పాటించాలి. సామాన్యులు న‌ష్ట‌పోకూండా తీసుకునే చ‌ర్చ‌ల‌ను తాత్సార్యం చేయ‌కుండా ప్ర‌క‌టించాలి. లేదంటే న్యాయం ఆల‌శ్యం చేయ‌డం కూడా అన్యాయ‌మే అవుతుంద‌నే విష‌యం ప్ర‌భుత్వం మ‌రిచోయిన‌ట్ట‌వుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here