బీజేపీకి బాబు ప్ర‌స‌న్నాస్త్రం..!

0

బాబు కొత్త అస్త్రం సంధించారు. బీజేపీని ప్ర‌స‌న్నం చేసుకునే ల‌క్ష్యంతో లేఖాస్త్రం విసిరారు. నేరుగా అమిత్ షాకి టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు రాసిన లేఖ విశేషంగా మారింది. గ‌డిచిన కొన్ని నెల‌లుగా ఆయ‌న బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. అందుకు అమ‌రావ‌తి రూపంలో ల‌భించిన అవ‌కాశాన్ని వినియోగించుకున్నారు. ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని భార‌త‌దేశ మ్యాప్ లో ప్ర‌స్తావిస్తూ విడుద‌ల చేసిన కొత్త మ్యాపుల‌కు గానూ కేంద్ర హోం మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలుపుతూ చంద్ర‌బాబు రాసిన లేఖ రాజ‌కీయంగా చ‌ర్చనీయాంశం అవుతోంది. ఈ లేఖ‌లో అమిత్ షాని చంద్ర‌బాబు కొనియాడిన తీరు విశేషంగా క‌నిపిస్తోంది.

స‌రిగ్గా ఏడాది గ‌డ‌వ‌క‌ముందే చంద్ర‌బాబు అమిత్ షా విష‌యంలో కూడా యూట‌ర్న్ తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. గ‌తంలో ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేస్తూ అమిత్ షాని తిరుప‌తిలో టీడీపీ కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు. ఆ సంద‌ర్భంగా కొంద‌రు అమిత్ షా కారుపై రాళ్లు కూడా విసిర‌న‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి.అ ప్ప‌టి బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న అమిత్ షా త‌న‌కు జ‌రిగిన అవ‌మానం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దానికి ప్ర‌తిఫ‌లంగా ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు కి అడ్డుక‌ట్ట వేసేందుకు జ‌గ‌న్ కి ప‌రోక్షంగా స‌హ‌కరించిన‌ట్టుగా ప‌లువురు భావించారు.

కానీ ఇప్పుడు ఏపీలో తామే సొంతంగా బ‌ల‌ప‌డే అవ‌కాశం వ‌చ్చింద‌ని బీజేపీ భావిస్తోంది. దానికి బాబుని అడ్డంకిగా చూస్తోంది. అడ్డు తొల‌గాలంటూ ఇప్ప‌టికే ఆయ‌న రాయ‌బారాలు పంపించిన‌ట్టు పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. కానీ చంద్ర‌బాబు మాత్రం తాను వైదొలిగేది లేద‌ని, మ‌ళ్లీ క‌లిసి సాగుదామ‌ని సందేశం పంపించిన‌ట్టు ప్ర‌చారంలో ఉంది. న‌ల్ల‌వ‌స్త్రాలు వేసుకుని చేసిన నిర‌స‌న‌లు, మోడీ కుటుంబం పై చేసిన విమ‌ర్శ‌లు అన్నీ మ‌ర‌చిపోయి, మళ్లీ వేదిక పంచుకుందామంటూ బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు బీజేపీ నేత‌లు ఇంత‌వ‌ర‌కూ స్పందించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఇరు పార్టీల మ‌ధ్య వార‌ధిగా జ‌న‌సేన ఉంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. దానికి త‌గ్గ‌ట్టుగా బీజేపీ నేత‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకుని, తిరిగి మ‌ళ్లీ పాత స్నేహం చిగురింప‌జేసుకోవాల‌ని ఆశిస్తున్న చంద్ర‌బాబు లేఖ‌కి బీజేపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి. ఏమ‌యినా ఏపీలో బ‌ల‌ప‌డాల‌ని ఒక‌రు , తిరిగి బ‌లం సంపాదించాల‌ని కోరుకుంటున్న మ‌రొక‌రు క‌లుస్తారా లేదా అన్న‌ది కాల‌మే స‌మాధానం చెబుతుంది. కానీ ఈలోగా లేఖ‌లు మాత్రం ఆస‌క్తిక‌ర‌మే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here