ఆధార్ ఉంటేనే ఫేస్ బుక్..?

  0

  సోష‌ల్ మీడియా ఖాతాల‌ను కూడా ఆధార్ తో అనుసంధానం చేయాల్సిందేన‌నే వాద‌న ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఫేస్ బుక్ యాజ‌మాన్యం సుప్రీంకోర్ట్ ని ఆశ్ర‌యించ‌డం, అక్క‌డి నుంచి గూగుల్,ట్విట్ట‌ర్ , యూ ట్యూబ్ కి కూడా నోటీసులు వెళ్ల‌డం చ‌ర్చ‌కు దారితీస్తోంది.

  ఇప్ప‌టికే దేశంలో అన్నింటికీ ఆధారంగా మారిపోయింది. ప్ర‌తీ దానికి అనుసంధానం జ‌రిగిపోయింది. అదే స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల ప్ర‌భావం కూడా ప్ర‌బ‌లంగా ఉంది. పెద్ద స్థాయిలో ప‌క్క‌దారి ప‌ట్టిస్తూ, ఫేక్ న్యూస్ పుట్టిస్తున్న ఖాతాలు స‌మ‌స్య‌గా మారుతున్నాయి. అంద‌రినీ ప‌క్క‌దారి ప‌ట్టించేలా, పెద్ద స్థాయిలో స‌మ‌స్య‌లు సృష్టించేలా ఉన్న ఈ ధోర‌ణికి అడ్డుక‌ట్ట వేయాల్సిన అవ‌స‌రం స్ప‌ష్టంగా ఉంది. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌య‌మే ఈ వివాదానికి కార‌ణం.

  ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా విద్వేష ప్ర‌చారం సాగుతున్న తీరుకి వ్య‌తిరేకంగా ప‌లు న్యాయ‌స్థానాల‌లో కేసులు న‌మోద‌య్యాయి. ఆధార్ అనుసంధానం జ‌ర‌గాల్సిందేన‌ని ప‌లువురు కోరుతున్నారు. ఈ నేప‌థ్యంలో దానికి త‌మిళ‌నాడు సుముఖత వ్య‌క్తం చేయ‌డం విశేషంగా మారింది. దానిని స‌వాల్ చేస్తూ ఫేస్ బుక్ సుప్రీంకోర్ట్ ని ఆశ్ర‌యించ‌డంతో కొత్త మ‌లుపు తిరిగింది.

  సోష‌ల్ మీడియా ఆకౌంట్ల‌ను ఆధార్ కి అనుసంధానం చేయ‌డం వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు భంగం క‌లుగుతుంద‌ని ఫేస్ బుక్ చెబుతోంది.
  అవ‌స‌రం అయితే మొబైల్, ఈ మెయిళ్లు తీసుకోవాలే గానీ ఆధార్ అనుసంధానం స‌రికాద‌ని ఫేస్ బుక్ త‌రుపున న్యాయ‌వాదులు వాదిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్ట్ త‌దుప‌రి విచార‌ణ‌ను వచ్చేనెల 13కి వాయిదా వేసింది. కేంద్రంతో పాటుగా ఇత‌ర సోష‌ల్ మీడియా వేదిక‌లకు కూడా నోటీసులు జారీ చేసింది. దాంతో అనుసంధానం జ‌రుగుతుందా లేదా అనే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌ల‌య్యింది. సుప్రీంకోర్ట్ ఎలా స్పందిస్తుందో అనే విష‌యంపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here