రెంటికీ చెడ్డ రేవ‌డిలా ప‌వ‌న్ భ‌విత‌వ్యం..?

  0

  అన్న‌య్య కూతురి ప్రేమ విష‌యంలో పిస్తోలు చేత‌బ‌ట్టి రోడ్డు మీద‌కు వ‌స్తే ఇంకా యువ ఆవేశం ఏమో అనుకున్నారు. య‌వ‌రాజ్యం అధ్య‌క్షుడి హోదాలో ప్ర‌జారాజ్యం కోసం ప్ర‌చారం చేస్తూ పంచెలూడ‌గొట్టండి అని పిలుపునిస్తే ఇంకా ప‌రిప‌క్వ‌త రాలేదేమో అనుకున్నారు. చేగువేరా బొమ్మ పెట్టుకుని బీజేపీతో చేతులు క‌లిపితే రాజ‌కీయ అవ‌స‌రాల కోసం అని స‌రిపెట్టుకున్నారు. పాచిపోయిన ల‌డ్డూలంటూ క‌మ‌ల‌నాధుల‌పై కాలుదువ్వితే నిజంగానే పోరుప‌థంలో సాగుతాడ‌ని ఎదురుచూశారు. తొలుత సీపీఎం మ‌ధు, ఆత‌ర్వాత మాయావ‌తి కాళ్ల‌కు మొక్కితే పెద్ద‌రికానికి అందించిన గౌర‌వం అనుకున్నారు. ఎన్నిక‌ల్లో లెఫ్ట్ తో సాగిన నాయ‌కుడు ఓట‌మి త‌ర్వాత క‌నీసం మ‌ర్యాద‌పూర్వ‌కంగానైనా వారితో క‌లిసేందుకు సిద్ధం కాక‌పోవ‌డంతో స‌హ‌జ‌ధోర‌ణి అనుకున్నారు. కానీ ఇప్పుడు అమిత్ షా లాంటి నాయ‌క‌త్వ‌మే దేశానికి కావాల‌న‌డం, తానెప్పుడూ బీజేపీకి దూరం కాలేద‌ని చెప్ప‌డం ద్వారా గాలివాటం ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్టుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. రాజ‌కీయంగా త‌న ఇమేజ్ ని చెరిపేసుకోవ‌డానికే ఈ ఛేష్ట‌లే దోహ‌దం చేస్తాయ‌నే అభిప్రాయం వినిపిస్తోంది.

  అంబేద్క‌ర్ ఆశ‌యాల కోసం ప‌నిచేస్తాన‌ని చెబుతూ తాను సనాత‌న హిందూధ‌ర్మం కోసం నిల‌బ‌డ‌తానంటున్నారు. హిందీ భాష‌ను దేశ‌మంతా రుద్దాల‌ని చూస్తున్న వారు అవ‌స‌రం అని చెబుతూ ఇంగ్లీష్ భాష వ‌ల్ల మ‌త‌మార్పిడి జ‌రుగుతోంద‌ని వాపోతున్నారు. క‌మ్యూనిజం త‌న ఒంట్లో ఉంద‌ని చెబుతూ కాషాయ కూట‌మిలో చేరుతున్న సంకేతాలిస్తున్నారు. ల‌క్ష‌ల పుస్త‌కాలు చ‌దివేసాన‌ని చెబుతూ భ‌గ‌త్ సింగ్ ఆత్మ‌హ‌త్య అంటూ అయోమ‌యం చాటుకుంటారు. మ‌తం మారితే కులం ఎందుకు మార్చుకోలేదంటూ ప్ర‌శ్నిస్తూ కుల‌,మ‌తాలు త‌ప్ప ఇత‌ర స‌మ‌స్య‌లు లేవ‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎన్నిక‌ల్లో త‌న‌ను కూడా ఓడించిన జ‌నాల‌ను గుర్తించ‌కుండా త‌న వ‌ల్లే వైసీపీకి అధికారం అంటుంటారు. క‌నీసం తాను పోటీ చేసిన రెండు సీట్ల‌లో ఓట్లేసిన జ‌నాల‌కు కృత‌జ్ఞ‌త‌లు కూడా చెప్ప‌కుండా, ఏపీని ఉద్ద‌రిస్తున్న‌ట్టు చెప్పుకుంటారు. త‌న పార్టీ బ‌ల‌మేంటో బోధ‌ప‌డిన త‌ర్వాత బ‌ల‌ప‌ర్చుకుందామ‌నే ఆలోచ‌న మానుకుని బీజేపీతో భేటీ కోసం ఢిల్లీ యాత్ర‌లు చేస్తారు. త‌న‌కు మోడీ ఎంతో గౌర‌విస్తార‌ని చెప్పుకుంటూ, ఢిల్లీలో రెండురోజులు కాప‌లా కాసినా క‌నీసం అపాయింట్ మెంట్ కూడా దొర‌క‌లేద‌నే విష‌యాన్ని విస్మ‌రిస్తారు. బీజేపీతో మ‌ళ్లీ చేతులు క‌లుపుతున్న‌ట్టు చెప్పేసి, విలీనం విష‌యం మాత్రం దాస్తూ ఉంటారు. ఇలా త‌న మాట‌ల‌కు, త‌న చేత‌ల‌కు తానే క‌ట్టుబ‌డ‌కుండా అంతా అయోమ‌యం, గంద‌ర‌గోళంతో సాగుతున్న ప‌వ‌న్ రాజ‌కీయ భ‌విత‌వ్యంపై స‌ర్వ‌త్రా సందేహాలు వినిపిస్తున్నాయి.

  ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని అభిమానించే వారిలో యువ‌త ఎక్కువ‌. అందులో ఓట్లు లేని వారు కూడా పెద్ద సంఖ్య‌లో ఉన్న‌ట్టు మొన్న‌టి ఫ‌లితాలు సైతం స్ప‌ష్టం చేశాయి. ఆయన స‌భ‌ల‌కు వ‌చ్చినంత మంది జ‌నం కూడా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట్లు ద‌క్క‌లేదనే విష‌యం గ్ర‌హిస్తే ఈ విష‌యం తేట‌తెల్లం అవుతోంది. అందులోనూ మార్పు కోరుకునే వారు ప‌లువురు ప‌వ‌న్ ప‌ట్ల మొగ్గు చూపుతారు. చేగువేరా బొమ్మ‌, అంబేద్క‌ర్ ఆద‌ర్శం అంటూ వ‌ల్లించే మాట‌ల‌తో అనేక మంది జ‌న‌సేన ప‌ట్ల ఆస‌క్తి చూపుతుంటారు. కానీ రాజ‌కీయంగా మార్పు సాధించే బ‌దులుగా మూస‌ధోర‌ణిలో సాగుతూ, అధికారం చుట్టూ ప్ర‌దిక్ష‌ణ‌లు చేసేందుకు త‌గ్గ‌ట్టుగా ప‌వ‌న్ వ్య‌వ‌హారం ఉండ‌డంతో అనేక‌మంది పున‌రాలోచ‌న‌లో ప‌డుతున్నారు. తాను ధైర్య‌వంతుడిన‌ని, ఎలాంటి పోరాట‌మ‌యినా చేయ‌డానికి సిద్ధ‌మ‌ని చెప్పుకునే ప‌వ‌న్ చివ‌ర‌కు విప‌క్షంలో ఉండి పోరాడాల్సిన స‌మ‌యంలో కేంద్రంలో అధికార పార్టీకి దాసోహం అవుతున్న‌ట్టు సంకేతాలు ఇవ్వ‌డం చూస్తుంటే అత‌ని అస‌లు రంగు అర్థ‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు. పాతికేళ్ళ రాజ‌కీయాలు అంటూ చెప్పుకుని నిండా ఆరు నెల‌లు కూడా ప్ర‌తిప‌క్షంలో ఉండ‌లేక‌పోవ‌డం ప‌వ‌న్ రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌నంగా ఉంది.

  ఈ ప‌రిణామాల‌తో జ‌న‌సేన‌కు వివిధ రాజ‌కీయ కార‌ణాల‌తో దూర‌మ‌వుతున్న వారికి తోడుగా ఆయ‌న మీద ఇన్నాళ్లుగా న‌మ్మ‌కం ఉంచిన వారు కూడా దూర‌మ‌య్యే ప్ర‌మాదం దాపురించింది. జ‌న‌సేన ఓ రాజ‌కీయ ప్ర‌త్యామ్నాయం అవుతుంద‌ని ఆశించిన వారి ఆశ‌లు వ‌మ్ము చేస్తున్న ద‌శ‌లో వారంతా పార్టీని వీడ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో రాజ‌కీయంగా ప‌వ‌న్ వెంట న‌డిచిన వారిలో కూడా ఇలా ప‌దే ప‌దే మాట మారుస్తున్న తీరు కార‌ణంగా విశ్వాసం కోల్పోయే ప్ర‌మాదం ఉంది. దానికితోడుగా హిందూధ‌ర్మం, యోగాభ్యాసం అంటూ ఎంత‌గా గొంతు చించుకున్నా ఇప్ప‌టికే ప‌వ‌న్ చేసిన కామెంట్స్ తో కాక‌మీదున్న ఆర్ఎస్ఎస్ శ్రేణుల‌ను కూడా సంతృప్తి ప‌ర‌చ‌డం అంత సుల‌భం కాదు. ఏతావాతా రెండు త‌ర‌గ‌తుల‌కు దూర‌మ‌య్యే ప్ర‌మాదాన్ని జ‌న‌సేనాని కొనితెచ్చుకున్నారు. త‌ద్వారా త‌న రాజ‌కీయ భ‌విత‌వ్యాన్ని చేజేతులా నాశనం చేసుకునే దిశ‌లో సాగుతున్నారు. ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌త్యామ్నాయంగా ఎదిగేందుకు అవ‌స‌ర‌మైన ఫ్యాన్స్, సామాజిక నేప‌థ్యం ఉన్న‌ప్ప‌టికీ అవ‌గాహ‌న లేని ఎత్తుగ‌డలు, త‌గిన ప్ర‌ణాళికా లోపంతో జ‌న‌సేనాని త‌న గొయ్యి తానే త‌వ్వుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో మార్పు కోసం నిన‌దించి, మ‌ళ్లీ మూక పార్టీలోకి మారుతున్న వేళ రాజ‌కీయాల్లో హ‌త్య‌లుండ‌వు..ఆత్మ‌హ‌త్య‌లే ఉంటాయ‌నే నానుడి మ‌రోసారి రుజువ‌వుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో కూడా ప‌వ‌న్ ని అబిమానించే ఓ సెక్ష‌న్ లో అభిమానం కొన‌సాగ‌వ‌చ్చు గానీ, రాజ‌కీయంగా కెరీర్ సంపూర్ణంగా నాశ‌నం చేసుకోవ‌డ‌మే అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. రెంటికీ చెడ్డ రేవ‌డిలా మారే సూచ‌న‌లు బ‌ల‌ప‌డుతున్నాయి.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here