‘తూర్పు’ తిరిగి ద‌ణ్ణం పెట్టిన దేవినేని

0

రాజ‌కీయాల్లో ఎవ‌రు, ఎప్పుడు, ఎక్క‌డ ఉంటారో చెప్ప‌లేని సందిగ్ధం వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో క‌నిపిస్తోంది. అందుకు తాజాగా ఉదాహ‌ర‌ణ తెలుగుయువ‌త నాయ‌కుడిగా నిన్న‌టి వ‌ర‌కూ ఉన్న దేవినేని అవినాష్ తీరు. ఉద‌యం టీడీపీకి రాజీనామా చేసిన అవినాష్, సాయంత్రానికి వైసీపీ గూటిలో వాలిపోయారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రుపున గుడివాడ నుంచి బ‌రిలో దిగిన అవినాష్ కొడాలి నాని చేతిలో ఓట‌మి పాల‌య్యారు. అంత‌కుముందు ఆయ‌న కాంగ్రెస్ త‌రుపున విజ‌య‌వాడ పార్ల‌మెంట్ స్థానానికి పోటీ చేసి ప‌రాజ‌యం చెందారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న భ‌విత‌వ్యం కోస‌మే ఆయ‌న టీడీపీని వీడిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా విజ‌య‌వాడ తూర్పు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ బ‌ల‌మైన అభ్య‌ర్థి కోసం చూస్తోంది. గ‌తంలో వంగ‌వీటి రాధా కోసం చివ‌రి వ‌ర‌కూ ఎదురుచూసిన వైఎస్ జ‌గ‌న్ ఆఖ‌రిలో ఆయ‌న ఝ‌ల‌క్ ఇవ్వ‌డంతో బొప్ప‌న భ‌వ‌కుమార్ ని తెర‌మీద‌కు తీసుకొచ్చారు. య‌ల‌మంచ‌లి ర‌వి వంటి వారూ ఉన్న‌ప్ప‌టికీ భ‌వ కుమార్ కి టికెట్ కేటాయించ‌డంలో జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అయినా జ‌గ‌న్ ఆశ‌లు నెర‌వేర‌లేదు. తూర్పులో టీడీపీని ఓడించ‌డం వైసీపీ హోరుగాలిలో కూడా సాధ్యం కాలేదు.

ప్ర‌స్తుతం టీడీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ ని ఢీకొట్ట‌గ‌ల స‌మ‌ర్థుడైన క‌మ్మ సామాజిక‌వ‌ర్గ నేత కోసం ఎదురుచూస్తున్న వైసీపీ చాలాకాలంగా దేవినేనిఅవినాష్ ని ఆహ్వానిస్తోంది. అయినా తాను ప్రాణం ఉన్నంత వ‌ర‌కూ టీడీపీలోనే కొన‌సాగుతానంటూ ప‌క్షం రోజుల క్రితం ప్ర‌క‌టించిన అవినాష్ అంత‌లోనే మ‌న‌సు మార్చుకుని, ఇప్పుడు వైసీపీ త‌రుపున తూర్పులో పాగా వేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. సీఎం చేత‌ల మీదుగా కండువా క‌ప్పుకున్నారు. ఇక వైసీపీ కూడా క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి వ్య‌తిరేకం అంటూ క‌థ‌నాలు వ‌స్తున్న త‌రుణంలో ఆ సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డం ద్వారా ఆ ప్ర‌చారాన్ని తిప్పికొట్టే వ్యూహంలో వైసీపీ తీవ్రంగా శ్ర‌మిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here