టీవీ9 ఎత్తులు- వీ6కి త‌ల‌నొప్పులు

0

ఇటీవ‌లి కాలంలో న్యూస్ ఛానెళ్ల‌లో సిరి.. కొత్త ఒర‌వ‌డి తీసుకొచ్చిన ఛానెల్ ఏదైనా ఉందంటే.. (సిరి.. కొత్త మీరు చ‌దివింది క‌రెక్టే) అది వీసిక్స్ మాత్ర‌మే. వీసిక్స్ ప్ర‌స్తుతం పెద్ద పెద్ద టీవీనైన్, ఎన్టీవీ, టీవీ ఫైవ్ వంటి ఛానెళ్ల‌తో పోటీప‌డే స్థాయికి చేరింది. కేవ‌లం తెలంగాణ మార్కెట్ మాత్ర‌మే చాల‌నుకుని ముందుకు దూకిన వీసిక్స్ ఆ దిశ‌గా దూసుకెళ్తోంది.. రెండు రాష్ట్రాల్లో తాము చూపించ‌లేని ప్ర‌భావం సింగిల్ స్టేట్ లో కూర్చుని వీసిక్స్ చ‌క్రం తిప్పేస్తుండ‌టం చూసి పిచ్చెక్కిపోతున్నాయి.. ఇత‌ర‌ న్యూస్ ఛానెళ్ల యాజ‌మాన్యాలు.

నిజం చెప్పాలంటే.. వీసిక్స్ ను మ‌రే ఇత‌ర ఛానెళ్ల‌లో వార్త‌ల కోసం చూడ‌రు. కార‌ణం వీసిక్స్ ఏ వార్త‌నూ బ్రేక్ చేయ‌దు. ఏ సంచ‌ల‌న క‌థ‌నాల‌ను వండి వార్చ‌దు. సాఫ్ట్ జ‌ర్న‌లిజం, సెటైరిక‌ల్ జ‌ర్న‌లిజం మాత్ర‌మే చేసి చూపి స‌త్తా చాటింది. మ‌రీ ముఖ్యంగా సెటైరిక‌ల్ జ‌ర్న‌లిజంలో వీసిక్స్ ఏకంగా ఒక ట్రెండ్ క్రియేట్ చేసింద‌ని చెప్పాలి.

మొద‌ట మొద‌ట జ‌జ్జెన‌క‌రి జ‌నారే వంటి అరుదైన ప‌బ్లిక్ ఓరియెంటెడ్ ఇన్ఫోటైన్మెంట్ తో మొద‌లు పెట్టి.. తీన్మార్ వార్త‌ల‌తో విశ్వ‌రూపం చూపించింది.

మొద‌ట్లో ఈ వార్త‌ల శైలిని చొప్ప‌దండి వార్త‌లుగా కొట్టి పారేసిన మీడియా దిగ్గ‌జాలు.. త‌ర్వాతి కాలంలో.. త‌మ ఛానెళ్ల‌లోనూ ఇదే వార్తా శైలిని జొప్పించాల్సి వ‌చ్చింది. బ‌య‌ట ఏదైనా వార్త‌ల వ్య‌వ‌హార‌శైలిని వెంట‌నే పసిగ‌ట్టి.. త‌మ ఛానెల్ కి అడాప్ట్ చేసే టీవీ నైన్ అయితే ఈ ఉచ్చులో ఎంత‌గా చిక్కిందంటే.. పాచిక‌ల్లు వార్త‌ల ప్ర‌సారంతో.. అసెంబ్లీకెక్కి.. అక్క‌డి నుంచి స‌ర్వ తెలంగాణ జ‌న ఆమోద‌యోగ్యంతో నిషేధాన్ని ఎదుర్కుంది. ఛానెల్ చ‌రిత్ర‌లోనే క‌నీ వినీ ఎరుగ‌ని విప‌రీత ప‌రిణామ‌మిది. దీనంత‌టికీ ఒక ర‌కంగా చెప్పాలంటే ప‌రోక్షంగా వీసిక్స్ వార్తా శైలే కార‌ణం. ఆ ఛానెల్లో ప‌ని చేసిన సెటైరిక‌ల్ జ‌ర్న‌లిస్టిక్ వ‌ర్గ‌మే.. ఈ ప్రొగ్రాంకి కూడా ప‌ని చేసింది కాబ‌ట్టి.. దీన్ని మ‌నం గుర్తించాలి.

క‌ట్ చేస్తే.. మ‌ల్ల‌న్న వ్య‌వ‌హారం. మ‌ల్ల‌న్న అనే ఈ పాత్ర‌ను పాపుల‌ర్ చేసిన ఇత‌డు.. ఎన్టీవీలో స్క్రోలింగ్ డిపార్ట్ మెంట్లో ప‌ని చేసేవాడు. ఎప్పుడైతే ఇత‌డు త‌న‌దైన టాలెంట్ కు త‌గిన గుర్తింపు దొరుకుతుంద‌ని గుర్తించి వీసిక్స్ మెట్లు ఎక్కాడో.. విప‌రీత‌మైన ఫాలోయింగ్ తెచ్చేసుకున్నాడు. త‌ర్వాత కాలంలో ఇత‌డు వీసిక్స్ లోని ఆరు మెట్లూ ఎక్కేసి.. ఏడో మెట్టు కోసం ఎదురు చూసే వ‌ర‌కూ వ‌చ్చేశాడు. ఇత‌డేకంగా.. ఎమ్మెల్సీగా పోటీ చేసే స్థాయికి చేరి పోయాడు. తృటిలో ప‌ద‌వి త‌ప్పింది. కానీ లేకుంటే ఇత‌డు శాస‌న మండ‌లిలో అధ్య‌క్ష అనాల్సి ఉండేవాడు.

ఒక‌ప‌క్క వీసిక్స్ స్థాప‌క య‌జ‌మాని జీవివేక్ వెంక‌ట స్వామి.. ఎంపీ స్థాయి నుంచి దిగ‌జారి మాజీకి చేరిపోతే.. ఆయ‌న స్థాపించిన వీసిక్స్ నుంచి ఏకంగా ఒక నేత‌గా ఎదిగిపోయాడు మ‌ల్ల‌న్న పాత్ర‌ధారి. త‌ర్వాత మ‌ల్ల‌న్న ఆరు మెట్లు దిగి త‌న దారి తాను చూసుకోగా.. ఈ దారిలోకి వ‌చ్చిన వాడే.. బిత్తిరి స‌త్తి.

బిత్తిరి స‌త్తి.. ఒక అనామ‌కుడిగా వీసిక్స్ లో ప్ర‌వేశించి.. ఈ రోజు సీఈవోతో స‌మాన‌మైన జీతం.. ప్ల‌స్ బౌన్స‌ర్ల‌ను అడిగే స్టేజ్ కి చేరాడు. స‌త్తి చేసేది ఐదు నిమిషాల నిడివిగ‌ల కార్య‌క్ర‌మ‌మే అయినా.. అందులో పేలే సెటైరిక‌ల్ పంచ్ లు రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఎంద‌రో ప్ర‌ముఖుల‌కు త‌గులుతుంటాయి. వాళ్ల వాళ్ల అభిమాన గ‌ణానికి మ‌నో భావాలు దెబ్బ త‌గులుతుంటాయి. ఈ ప‌రిస్థితుల్లో వీళ్లు.. స‌త్తిపై.. భౌతిక‌ దాడులు చేసే వ‌ర‌కూ రావ‌డంతో.. అత‌డు ఇటీవ‌లి కాలంలో పెట్టిన అరుదైన ష‌ర‌తుల్లో బౌన్స‌ర్ల డిమాండ్ కూడా ఒక‌టిగా మారింద‌ని స‌మాచారం.

మ‌రో క‌ట్ చేస్తే.. స‌త్తి షోకు.. వ్యాఖ్యానం చేసే సావిత్రి అలియాస్ శివ‌జ్యోతి.. ఇప్పుడేకంగా బిగ్ బాస్ 15 సెల‌బ్రిటీల్లో ఒక‌రిగా జాయినైన స‌రికొత్త తార‌క‌.

ఇప్పుడు సీన్ ఎలా మారిందంటే.. ఏ ఇన్ఫోటైన్మెంట్ అయితే తాను త‌యారు చేశాడో. అదే వినోద‌వార్తా వ్య‌వ‌హార‌శైలి.. త‌న‌నే వెక్కిరిస్తోందే అన్న ఆందోళ‌న‌లో ప‌డిపోయాడు.. వీట‌న్నిటికీ రూప‌క‌ర్త అయిన అంకం ర‌వి.

ఇప్పుడు తాజా వార్త‌ల ప్ర‌కారం.. బిత్తిరి స‌త్తి ఆరు మెట్లు దిగేస్తుండ‌టంతో.. ఇత‌డ్ని హైర్ చేసుకోడానికి మేమంటే మేం అంటూ తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్ర‌ధాన వార్తా సంస్థ‌లైన టీవీనైన్, ఎన్టీవీ పోటీ పడుతున్నట్టు స‌మాచారం. సీఈవోల‌క‌న్నా మించిన రెమ్యున‌రేష‌న్ తో బిత్తిరి స‌త్తిని ఓన్ చేసుకోడానికి ఈ రెండు దిగ్గ‌జ సంస్థ‌లు పోటీ ప‌డుతున్నాయంటే.. ఇన్ఫోటైన్ మెంట్ ప్ర‌స్తుత సిట్యువేష‌నేంటో అర్ధం చేసుకోవ‌చ్చు…

ఒక ఐదు నిమిషాల నిడివిగ‌ల వీడియోకు కార‌ణ‌భూతుడైన స‌త్తి మార్కెట్ అంత‌గా విస్త‌రించింది మ‌రి. ఇత‌డి వీడియోలు యూ ట్యూబుల్లో మిలియ‌న్ల వ్యూస్ సాధిస్తుండ‌టం ఇందుకు కార‌ణం.. వీటి ద్వారా నెల‌కు ల‌క్ష‌లాది రూపాయ‌ల ఆదాయం వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. త‌న వీడియోల ద్వారానే ఛానెళ్ల‌కు నెల‌కు ప‌ది లక్ష‌ల రూపాయ‌ల మేర ఆదాయం సాధించి పెడుతున్నాడ‌ట బిత్తిరి స‌త్తి.

ఇక స‌త్తి చేసిన షో తీన్మార్ అయితే.. జీఆర్పీ రేటింగ్స్ లోనే టాప్ ప్టేస్ లో ఉంది.. దీని కార‌ణంగా.. ఈ స్లాట్ లో ఒక్కో ప్ర‌క‌ట‌న 2 వేల రూపాయ‌ల ధ‌ర ప‌లుకుతోంద‌ట‌. ఇదీ స‌త్తి చుట్టూ అల్లుకున్న మార్కెట్ ప‌రిధి. దీంతో ఇత‌డి మార్కెట్ ను ఎలాగైనా ఒడిసి ప‌ట్టుకోవాల‌ని దిగ్గజ సంస్థ‌లు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక యూట్యూబ్ లో కేవ‌లం బూతులు మాట్లాడుతూ.. సినిమా రివ్యూలు చెప్పే షోలు సైతం మొద‌ల‌య్యాయి. వీటికి వ్యాఖ్యానం చేస్తున్న లేడీ యాంక‌ర‌మ్మ ఏకంగా నెల‌కు ల‌క్ష రూపాయ‌లు ఎగ‌రేసుకుపోతున్న‌ట్టు తెలుస్తోంది. అంటే ఇన్ఫోటైన్మెంట్ కు గ‌తంలో ఎన్న‌డూ లేనంత పెద్ద మార్కెట్ రూపుదిద్దుకుంద‌న్న‌మాట‌.

ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క అర్న‌బ్ గోస్వామి మాత్ర‌మే బుల్లితెర రికార్డుల‌ను త‌న పేరిట రాసుకుని ఉన్నాడు. అత‌డి త‌ర్వాత బ‌ర్ఖాద‌త్, రాజ్ దీప్ స‌ర్దేశాయ్, త‌దిత‌ర హేమాహేమీలు.. న్యూస్ మీడియా మార్కెట్లో త‌మ త‌డాఖా చూపి ల‌క్ష‌లాది రూపాయ‌లు త‌మ ఖాతాలో వేసుకుంటున్నారు. కానీ క‌పిల్ త‌దిత‌రులు కామెడీ పంట పండించి.. కోట్లు కూడేసుకోవ‌డం బుల్లితెర‌పై అవుట్ ఆఫ్ న్యూస్ మార్కెట్ విస్తృతి ఎంత‌గా పెరిగిందో తెలియ చేస్తోంది.

స‌రిగ్గా ఇదే సిట్యువేష‌న్లోకి.. మ‌న తెలుగు మీడియా మార్కెట్ ప‌రిధి కూడా విస్త‌రించ‌డం.. ఒక ర‌కంగా శుభ‌ప‌రిణామం. ఎందుకంటే.. 2019 ఎన్నిక‌ల త‌ర్వాత మీడియా మార్కెట్ ఎక్క‌డ వెన‌క‌డుగు వేస్తుందో అని భ‌య‌ప‌డ్డ జ‌నానికి.. స‌రికొత్త పంథాలో త‌న‌దైన మార్కెట్ విస్త‌ర‌ణ చేస్తుండ‌టం.. మంచి విష‌య‌మే.. ఒక్క బిత్తిరి స‌త్తి ఒక ఛానెల్ నిల‌బెట్ట‌డం అంటే.. ఆ ఛానెల్లో ఉన్న ఇత‌ర ఉద్యోగుల ఉద్యోగాలు కూడా నిల‌బెట్ట‌డంతో స‌మానం. కాబ‌ట్టి.. అత‌డో వైతాళికుడు. ఈ వైతాళికుడ్ని త‌యారు చేసిన అంకం ర‌వి కూడా ఒక‌ర‌కంగా వైతాళిక కేట‌గిరి కింద‌కు వ‌చ్చేవాడే.. ఏమంటారు?!

Credits: S ఆదినారాయ‌ణ‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here