జ‌గ‌న్ క‌న్నా ముందే ప్ర‌తిప‌క్షం..!

0

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అనూహ్య విజ‌యంతో అధికారం చేప‌ట్టిన వైసీపీ ఇంకా విజ‌యం నాటి హ్యాంగోవ‌ర్ ని వీడిన‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. అదే స‌మ‌యంలో విప‌క్షాలు ఓట‌మి నైరాశ్యం నుంచి క్యాడ‌ర్ ను కాపాడుకునే ప్ర‌య‌త్నాల్లో ప‌డుతున్నాయి. ప్ర‌జాక్షేత్రంలో అడుగుపెట్టేందుకు వైసీపీ ఇంకా ఆలోచ‌న‌లు చేస్తోంది. చివ‌ర‌కు ముఖ్య‌మంత్రిగా ఉన్న పార్టీ అధినేత కూడా జ‌నంబాట ప‌ట్ట‌డం లేదు. అదే స‌మ‌యంలో విపక్ష టీడీపీ, జ‌న‌సేన అధినేత‌లు మాత్రం కార్య‌క్షేత్రంలో అడుగుపెట్టేశారు.

టీడీపీ అధినేత ఇప్ప‌టికే వ‌ర‌ద బాధితుల ప‌రామ‌ర్శ‌, దానికి ముందు పార్టీ నేత‌ల‌ను ప‌రామ‌ర్శించే పేరుతో యాత్ర‌లు చేశారు. ఇక పార్టీని మ‌ళ్లీ తాటి మీద‌కు తీసుకొచ్చేందుకు స‌మీక్ష‌ల‌కు పూనుకుంటున్నారు. తూర్పు గోదావ‌రి జిల్లాతో సెంటిమెంట్ రీత్యా ఈ ప్ర‌క్రియ ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేసుకున్నారు. రెండు రోజుల పాటు కాకినాడ‌లో ప‌ర్య‌ట‌న‌కు చంద్ర‌బాబు స‌న్న‌ద్ద‌మ‌వుతున్నారు. ఆయ‌న క‌న్నా ముందుగానే నారా లోకేశ్ ఏకంగా ఇసుక స‌మ‌స్య‌పై ఆందోళ‌న‌ల‌తో రంగంలో దిగారు. తాజాగా విశాఖ జిల్లా న‌ర్సీప‌ట్నంలో ప‌ర్య‌టిస్తున్నారు.

జ‌న‌సేన అధినేత కూడా అమ‌రావ‌తి విష‌యంలో వేలు పెట్టారు. ప్ర‌భుత్వ తీరుని నిర‌సిస్తూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అదే స‌మ‌యంలో పార్టీ ప‌రిస్థితిని పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ స‌మావేశాల‌కు కొంద‌రు కీల‌క నేత‌లు ఢుమ్మా కొట్టిన‌ప్ప‌టికీ తాజాగా పీఏసీ స‌మావేశాల‌కు సిద్ద‌మ‌య్యారు. రెండు రోజుల పాటు తూర్పు గోదావ‌రి జిల్లాలో జ‌న‌సేన ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాజోలు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోనే స‌మీక్షా స‌మావేశాలు నిర్వ‌హించ‌బోతున్నారు. పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల కమిటీ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది.

విప‌క్షాలు ఎవ‌రికి వారుగా కార్య‌క‌లాపాల్లో మునుగుతున్న‌ప్ప‌టికీ వైసీపీ మాత్రం ఇటీవ‌లే సొంతంగా రాష్ట్ర కార్యాల‌యం తాడేప‌ల్లిలో ప్రారంభించ‌డం, అనంత‌రం వైఎస్సార్ వ‌ర్థంతి కార్య‌క్ర‌మాలు మిన‌హా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ప్రాధాన్య‌త‌నివ్వ‌డం లేదు.క‌నీసం ఓట‌మి పాల‌యిన నియోజ‌క‌వ‌ర్గాల వారీగా సమీక్ష‌లు లేదా ఇత‌ర స‌మావేశాలు జ‌రిపి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపే ప్ర‌య‌త్నం కూడా జ‌ర‌గ‌డం లేదు. స్థానిక ఎన్నిక‌ల‌కు త‌గ్గ‌ట్టుగా పార్టీని న‌డిపించే య‌త్నాలు ఇంకా ప్రారంభం కాలేదు. పార్టీ వ్య‌వ‌హారాల విష‌యంలో వైసీపీ ఇంకా వెనుక‌బ‌డ‌డి ఉండ‌డం విశేషంగానే చెప్ప‌వ‌చ్చు. అధికారం ఉన్న‌ప్ప‌టికీ చొర‌వ కొర‌వ‌డింద‌నే అభిప్రాంయ వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here