జ‌గ‌న్ అక్క‌డ స‌క్సెస్..ఇక్క‌డే ఎందుకిలా!?

0

ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ పాల‌నలో ఆరు నెల‌లు గ‌డిచిపోయాయి. ఆరంభంలో ఆయ‌న అడుగులు ఎలా ఉన్నాయ‌న్న‌ది అర్థ‌మ‌యితే రాబోయే నాలుగున్న‌రేళ్ల పాటు ఆంధ్ర‌రాష్ట్ర భ‌విత‌వ్యం బోధ‌ప‌డుతుంది. న‌వ‌శ‌కం పేరుతో నిన‌దిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం సంక్షేమ రంగంలో దానికి అనుగుణంగా సాగుతోంది. ఆరు నెల‌ల కాలంలో అరుదైన ప‌థ‌కాలు ప్రారంభించింది. అనేక కొత్త రంగాలు, త‌ర‌గ‌తుల‌కు నేరుగా ప్ర‌యోజ‌నం క‌లిగించే ప్ర‌య‌త్నం చేసింది. దేశంలోనే ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్ట‌ని చ‌ర్య‌ల‌కు శ్రీకారం చుట్టింది. త‌ద్వారా ఆరు నెల‌ల్లో మంచి ముఖ్య‌మంత్రి అనిపించుకుంటాన‌ని ప్ర‌మాణ స్వీకారం నాడు చెప్పిన మాట‌ల‌కు అనుగుణంగా జ‌గ‌న్ ముంద‌డుగు వేశారు.

మోటార్ కార్మికుల నుంచి మ‌త్స్య‌కారుల వ‌ర‌కూ, జూనియ‌ర్ లాయ‌ర్ల నుంచి చేనేత కార్మికుల వ‌ర‌కూ అన్ని వ‌ర్గాల‌కు నేరుగా న‌గ‌దు స‌హాయం అందించే ప‌థ‌కాలు జ‌గ‌న్ ప్రారంభించారు. త‌ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని దాదాపు అన్ని వ‌ర్గాల‌కు ప్ర‌భుత్వ స‌హాయం అందించే దిశ‌గా సాగుతున్నారు. అదే స‌మ‌యంలో సంక్షేమంలో స‌క్సెస్ అయిన జ‌గ‌న్ స‌ర్కారు దానికి త‌గ్గ‌ట్టుగా అభివృద్ధి విష‌యంలో త‌గినంత శ్ర‌ద్ధ పెడుతుందా అన్న‌ది సందేహ‌మే. గ‌డిచిన ఆరు నెల‌ల కాలంలో కొత్త‌గా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు విష‌యంలో ప్ర‌భుత్వ నిర్ణ‌యాల ఫ‌లితాలు ఇంకా క‌నిపించ‌డం లేదు. కీల‌క‌మైన రాజ‌ధాని విష‌యంలో స్ప‌ష్ట‌త లేదు. పోల‌వ‌రం అడుగులు ఇంకా పూర్తిస్థాయిలో ముందుకు సాగ‌డం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో సంక్షేమాన్ని ప‌రుగులు పెట్టిస్తున్న జ‌గ‌న్, అభివృద్ధి ప‌నుల విష‌యంలో అందుకు అనుగుణంగా చొర‌వ చూప‌లేక‌పోవ‌డం విశేష‌మే.

ఇక వ‌చ్చే ఆరు నెల‌ల్లో వ‌రుస‌గా స్టీల్ ప్లాంట్ నిర్మాణం, అనంత‌లో బ‌స్సు ప‌రిశ్ర‌మ స‌హా వివిధ ప‌రిశ్ర‌మ‌ల‌కు ఇప్పుడిప్పుడే ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఇక నూత‌న జెట్టీలు, పోర్టుల నిర్మాణం కూడా మొద‌ల‌యితే అభివృద్ధి ప‌నుల‌కు ఆస్కారం క‌లుగుతుంది. ఉపాధి అవ‌కాశాలు మ‌రింత పెర‌గుతాయి. సంక్షేమ చ‌ర్య‌ల కోసం కావాల్సిన ప్ర‌భుత్వానికి నిధుల కొర‌త కూడా తీరుతుంది. ప్రస్తుతం కేంద్రం మొండిచేయి చూపుతుండ‌డంతో ఏపీ లో అప్పులు త‌ప్ప మ‌రో ఆస్కారం క‌నిపించ‌డం లేదు. అందుకే అభివృద్ధికి అనుగుణంగా అడుగులు వ‌డివ‌డిగా వేస్తేనే రాష్ట్రానికి దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాలు ద‌క్కుతాయి.

రాజ‌కీయాల్లో జ‌గ‌న్ ఇమేజ్..!

గ‌డిచిన ఆరు నెల‌ల్లో రాజ‌కీయంగా జ‌గ‌న్ మ‌రింత బ‌ల‌ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. 50శాతం ఓట్లు సాధించిన జ‌గ‌న్ ఇప్పుడు విప‌క్షాల‌ను మరింత బ‌ల‌హీనప‌రిచే దిశ‌గా సాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆరు నెల‌ల విప‌క్ష హోదాలో కూడా స‌మ‌ర్థ‌వంతంగా వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోవ‌డం జ‌గ‌న్ కి క‌లిసి వ‌చ్చింది. ఆదుర్ధా ప‌డుతూ ఆందోళ‌న‌ల‌కు పూనుకుంటున్న చంద్ర‌బాబుని జ‌నం విశ్వ‌సించే అవ‌కాశం క‌లగ‌పోవ‌డం, కొంద‌రు స్వ‌ప‌క్ష నేత‌లు కూడా నేరుగా బాబు మీద గురిపెట్ట‌డం జ‌గ‌న్ కి మ‌రింత ధీమా క‌ల్పిస్తోంది. ఈ నేప‌థ్యంలో తామే ప్ర‌తిప‌క్షం అంటూ బీజేపీ కుతూహ‌లం ప‌డుతున్న‌ప్ప‌టికీ ఏపీలో క‌మ‌లానికి అంత సీన్ లేద‌నే అభిప్రాయం ఇంకా కొన‌సాగుతోంది. ఇత‌ర పార్టీల నుంచి వెళ‌తార‌ని భావించిన నేత‌లు కూడా బీజేపీ అంటూ కొంత వెన‌క‌డుగు వేస్తున్నారు. అదే స‌మ‌యంలో జ‌న‌సేనాని పాఠాలు నేర్చుకున్న‌ట్టు లేదు. ఎన్నిక‌ల ముందు నాటి త‌ప్పిదాల‌నే పునరావృతం చేస్తూ టీడీపీ అడుగుల్లో న‌డ‌క‌లేస్తున్నందున సొంతంగా బ‌లం పెంచుకునేందుకు ఆయ‌న అవ‌కాశాలు నిష్ఫ‌లం అయిపోతున్నాయి. ఈ ప‌రిణామాల‌తో జ‌గ‌న్ రాజకీయంగా బ‌ల‌ప‌డే అవ‌కాశాలు మ‌రింత పెరిగాయి. విప‌క్షాల బల‌హీన‌త‌లు పాల‌క‌ప‌క్షానికి పెద్ద ప్ల‌స్ పాయింట్ అవుతున్నాయి.

సొంత పార్టీలో కొంద‌రి చ‌ర్య‌లు మాత్రం జ‌గ‌న్ అంచ‌నాల‌కు భిన్నంగా ఉన్నాయి. కొంద‌రు మంత్రులు దూకుడు చివ‌ర‌కు మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల్లో అపోహ‌ల‌కు ఆస్కారం ఇస్తోంది. పార్టీ నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు కూడా నెల్లూరు వంటి చోట్ల ఇప్ప‌టికే న‌ష్టం తెచ్చింది. ఇలాంటి కొన్ని పరిణామాలు జ‌గ‌న్ కి హ‌ర్డిల్స్ గా క‌నిపిస్తున్నా మొత్తంగా చూస్తే జ‌గ‌న్ ఇమేజ్ డ్యామేజ్ చేయాల‌నే ప్ర‌తిప‌క్షం ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేద‌నే చెప్పాలి.

రంగులు, మ‌తం కోణం వంటి అంశాల‌నే ఆధారంగా చేసుకుని ప్ర‌తిప‌క్షాలు రాజ‌కీయం చేయాల్సి వ‌స్తోంది. వాస్త‌వానికి ఈ రెండూ ప్ర‌జ‌ల‌కు సంబంధించిన అంశాలే కాదు. మ‌తం కొంత సెంటిమెంట్ గా ఉప‌యోగ‌ప‌డ‌వ‌చ్చు. దానిక‌న్నా ముందు త‌న ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌నే ప్ర‌జ‌లు గ‌మ‌నంలో ఉంచుకుంటారు. అవినీతి వంటివి స‌మ‌స్య‌లుగా భావిస్తారు. నేరుగా త‌న‌కు దెబ్బ త‌గిలే ప‌రిస్థితి వ‌స్తే వ్య‌తిరేక‌త ప్ర‌ద‌ర్శిస్తారు. ఇసుక‌లో అలాంటిది ఓ మేర‌కు జ‌రిగింది. అయితే ఆరంభమే కావ‌డంతో నేరుగా జ‌గ‌న్ కి క‌లిగిన న‌ష్టం పెద్ద‌గా లేదు. అదే స‌మ‌యంలో ఇంగ్లీష్ ద్వారా జ‌గ‌న్ అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌డానికి ఆస్కారం ద‌క్కింది. ఇక ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌కు రంగులు వేస్తున్నారంటూ హంగామా చేస్తున్నా అది జ‌నానికి అవ‌స‌రం లేదు. ఏరంగు ఉంద‌న్న‌ది కాదు..త‌న‌కు ఏం మేలుజ‌రుగుతుంద‌న్న‌దే జ‌నం గుర్తిస్తారు. ఇలాంటి మౌలిక అంశాల్లో ప్ర‌తిప‌క్షాల తీరు ప్ర‌జ‌ల‌కు చేర‌డం లేదు. ఇది కూడా జ‌గ‌న్ కి మ‌రింత బ‌లంగా మారుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఆరు నెల‌ల పాల‌న ద్వారా జ‌గ‌న్ త‌న మార్క్ పాల‌న‌ను మొద‌లుపెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని మార్పుల‌కు సిద్ధ‌మ‌వుతారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here