చ‌ట్ట‌ప‌ర‌మైన చిక్కుల్లో చంద్ర‌బాబు స‌న్నిహితులు

0

తెలంగాణాలో దాదాపుగా ఖాళీ అయిన టీడీపీ ప‌రిస్థితి ఆంధ్రాలోనూ రానురాను దిగ‌జారిపోతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. పాల‌క‌ప‌క్షం వైఫ‌ల్యాల‌ను మీడియాలో ప్ర‌ధానంగా చూపిస్తూ పార్టీని ప‌రిర‌క్షించుకోవాల‌నే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబు స‌న్నిహితులు ఒక్కొక్క‌రుగా చిక్కులు ఎదుర్కోవాల్సి రావ‌డం స‌మ‌స్య‌గా మారుతోంది. దాంతో ప‌లువురి నేత‌ల నైతిక స్థైర్యం కోల్పోయే ప‌రిస్థితి దాపురించింద‌ని చెబుతున్నారు.

ఇప్ప‌టికే మాజీ స్పీక‌ర్ కోడెల క‌ష్టాలు అంద‌రికీ తెలిసిన‌వే. కొనితెచ్చుకున్న క‌ష్టాల కార‌ణంగా ఆయ‌నకి అండ‌గా నిలిచే అవ‌కాశం కూడా లేకుండా పోయింది టీడీపీ నేత‌ల‌కు. ఆ త‌ర్వాత య‌ర‌ప‌తినేని, ఆయ‌న వియ్యంకుడు స‌మ‌స్య‌ల్లో ఇరుక్కున్నారు. ఏకంగా సీబీఐ విచార‌ణ‌కు దాదాపుగా లైన్ క్లియ‌ర్ కావ‌డంతో ఈ మైనింగ్ కింగ్ క‌ష్టాల క‌డ‌లిలో కూరుకుపోతున్న‌ట్టేన‌ని కొంద‌రు అంచ‌నాలు వేస్తున్నారు.

ఆ త‌ర్వాత మాజీ విప్ కూన ర‌వికుమార్ నోటిదురుసు నెత్తిమీద‌కు వ‌చ్చింది. అరెస్ట్ కాకుండా త‌ప్పించుకునేందుకు ఏకంగా అజ్ఞాతంలో ఉన్నార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. దాంతో కూన‌ర‌వికుమార్ విష‌యం కూడా పీక‌ల్లోతున ఉన్న‌ట్టుగా చెప్ప‌వ‌చ్చు. ఇక మరో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి మ‌రింత చౌక‌బారుగా ఫోర్జరీ కేసుల్లో ఇరుక్కోవ‌డం మ‌రో త‌ల‌నొప్పి. ఆయ‌న మీద కేసు న‌మోదు చేయాల‌ని కోర్ట్ ఆదేశించ‌డంతో సోమిరెడ్డి స‌మ‌స్య‌లు రెట్టింప‌యిన‌ట్టుగానే చెప్ప‌వ‌చ్చు.

తెలుగుదేశం పార్టీకి చెందిన మ‌రికొంద‌రు నేత‌ల మీద న్యాయ‌ప‌ర‌మైన తాఖీదులు త‌ప్ప‌వ‌ని తాజాగా చెబుతున్న విష‌యం. దాంతో టీడీపీ నేత‌ల్లో కోర్టులు, కేసులు పెరుగుతున్న తీరు మీద త‌ల‌లు ప‌ట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో పోస్టుల కార‌ణంగా ప‌లువురు కార్య‌క‌ర్త‌లు కూడా కేసుల్లో ఇరుక్కున్నారు. ఇలా నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కూడా కోర్టులు చుట్టూ తిర‌గాల్సిన ప‌రిస్థితి దాపురిస్తుండ‌డంతో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంద‌రు నేత‌లు మౌనంగా ఉంటే మంచిద‌నే అభిప్రాయానికి వ‌స్తున్న‌ట్టు క‌నిపిస్తోంద‌న్న‌ది ప‌రిశీల‌కుల భావ‌న‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here