చివరకు జగన్ ఏం చేస్తారో?

0

రానీ, రానీ కష్టాల్..నష్టాల్..అన్నట్టుగా ఉంది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరు. ఎవరమేనుకుంటే మనకెందుకున్నట్టుగా ఆయన సాగుతున్నారు. విపక్షం అభ్యంతరం పెట్టినా, కేంద్రం మోకాలడ్డినా, ఏకంగా జపాన్ సహా పలు దేశాల కార్పోరేట్లు అభ్యంతరం పెట్టినా తాను అనుకున్నది జరిగి తీరుతుందని తేల్చేశారు.

దానికి తగ్గట్టుగానే పోలవరం రీటెండరింగ్ కి రంగం సిద్ధమయ్యింది. ఆయన విదేశీ పర్యటనలో ఉండగానే రివర్స్ టెండరింగ్ కార్యక్రమం పాతరేట్లు ప్రకారమే జరగబోతోంది. అంతేగాకుండా పీపీఏల పున:సమీక్ష మీద కూడా జగన్ వెనక్కి తగ్గడం లేదు. పైగా రైతులకు చౌకగా విద్యుత్ అందిస్తామంటే అడ్డుకుంటారా అంటూ ఆయన ప్రశ్నించడం ద్వారా తాను ప్రజా ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నాననే సంకేతాలు ఇచ్చేశారు.

లోకల్ రిజర్వేషన్ల వ్యవహారంలోనూ తాము చేసిన తీర్మానంపై ముందుకే వెళతామని ఇప్పటికే పెట్టుబడుల ఆకర్షణ కోసం జరిగిన సమావేశంలో వెల్లడించిన సీఎం మరోసారి పునరుద్ఘాటించారు. తద్వారా జగన్ ముందుకే వెళుతున్న నేపథ్యంలో అనేక వ్యవహారాల్లో ఆయన నిర్ణయాలు చివరకు ఎటువంటి ఫలితాలకు దారితీస్తాయోననే చర్చ మొదలయ్యింది.

జగన్ ఆశించినట్టు అన్నీ సానుకూల సంకేతాలు అయితే ప్రజలకు పెద్దగా సమస్యలు రావు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న సంకేతాలు వస్తున్న తరుణంలో జగన్ తీసుకోబోయే సాహసోపేత నిర్ణయాల ఫలితాలు మాత్రం ఆయన భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. ప్రస్తుతం చెబుతున్న మాటలు ఆచరణలో సానుకూల సంకేతాలు ఇస్తే మరికొన్నాళ్ల పాటు తిరుగుండదు. అదే సమయంలో బూమరాంగ్ అయితే మాత్రం ఏపీ రాజకీయాల్లో చిక్కులు తప్పవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here