అభాసుపాలయిన ఆంధ్రజ్యోతి!

0

ఆంధ్రజ్యోతి తీరు ఆశ్చర్యకరంగా మారింది. అంతా తామే ముందు చెప్పుకోవాలని తపన పడుతున్న వర్తమాన మీడియా రీతికి ఇది పరాకాష్టగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏబీఎన్ కి గవర్నర్ కి ఏదో ముడిపడి ఉన్నట్టు చాలామంది భావిస్తున్నారు. రాజ్ భవన్ వ్యవహారాలతోనే ఎన్డీ తివారీ భాగోతం ద్వారా ఈ చానెల్ అందరికీ సుపరిచితం అయ్యిందనే సంగతి తెలిసిందే.

ఇక ఆ తర్వాత గవర్నర్ ఈఎస్ఎల నరసింహన్ గురించి ఆంధ్రజ్యోతి అనేక ఊహాగానాలు ప్రసారం, ప్రచురితం చేసింది. గవర్నర్ మార్పు గురించి ఈ సంస్థ నుంచి ఎన్ని మార్లు కథనాలు వచ్చాయో కూడా చెప్పలేం. అంతేగాకుండా కొత్త గవర్నర్ అంటూ పలువురి పేర్లు కూడా ప్రస్తావించి రాసిన రోజులున్నాయి. కానీ తీరా నిజంగానే గవర్నర్ మార్పిడి జరిగిన నాడు మాత్రం కనీసం కనిపెట్టగలిగే పరిస్థితి ఎవరికీ కనిపించలేదు. ఇద్దరు సీఎంలు, రాష్ట్ర విభజన, రాష్ట్రపతి పాలన, ఆ తర్వాత రెండు రాష్ట్రాలు, తెలంగాణాలో ఒకరే సీఎం గానీ ఏపీలో ఇద్దరు సీఎంలతో పనిచేసిన ఘనతను ఈఎస్ఎల్ దక్కించుకున్నారు. అలాంటి నరసింహన్ విషయంలో ఆంధ్రజ్యోతి రాసిన కథనాలు ఎన్నడూ వాస్తవ రూపం దాల్చిన దాఖలాలు కనిపించలేదు.

కానీ ఏబీఎన్ ముందే కనిపెట్టింది అంటూ చెప్పుకోవడానికి మాత్రం ఇప్పుడు సిద్ధపడిపోయారు. దీనిపై సోషల్ మీడియాలో పలు సెటైర్లు వినిపిస్తున్నాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీద అనేక వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఊహాజనిత కథనాలకు ఆ పత్రిక అద్దంపడుతుందనే రీతిలో అనేక మంది విమర్శలు గుప్పిస్తున్నారు. త్వరలోనే మోత్కుపల్లి నర్సింహులకి గవర్నర్ గిరీ అంటూ ఆ పత్రిక అనేక మార్లు రాసిన విషయాన్ని కూడా పలువురు గుర్తు చేస్తున్నారు. మొత్తంగా గవర్నర్ బదిలీ వ్యవహారంలో సదరు సంస్థ బద్నాం అయినట్టు కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here