Main Menu

రౌండ‌ప్: అన‌కాప‌ల్లి ఎవరికి అనుకూలం?

MLC-polls-turned-into-a-proxy-war’-between-Chandrababu-Jagan-in-Kadapa
Spread the love

ఉత్త‌రాంధ్రలో అన‌కాప‌ల్లి ఓ కీల‌క కేంద్రం. ఆస‌క్తిక‌ర రాజకీయాల‌కు అడ్డాగా ఉంటుంది. అన‌కాప‌ల్లి వాసులే విశాఖ జిల్లా రాజ‌కీయాల‌ను శాసించిన అనుభ‌వం ఉంది. ఉద్దండులైన నేత‌లు ఇక్క‌డి నుంచి ఉద్భ‌వించారు. అందుకే విశాఖ జిల్లాలో అంద‌రి దృష్టి ఈ నియోజ‌క‌వ‌ర్గం మీద ఉంటుంది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి టీడీపీ విజ‌యం సాధించింది. గ‌డిచిన మూడేళ్ల‌లో అనేక మార్పులు జరిగాయి. ప్ర‌ధానమైన రెండు పార్టీల‌లో పలు ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేప‌థ్యంలో రాబోయే ఎన్నిక‌లపై అంద‌రి దృష్టి క‌నిపిస్తోంది. మ‌రి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా అన‌కాప‌ల్లి రాజ‌కీయాలను ఈ రౌండ‌ప్ లో ప‌రిశీలిద్దాం..

1.పాయ‌క‌రావు పేట: విశాఖ జిల్లాలోని ఏకైక ఎస్సీ రిజ‌ర్వుడు స్థానం. టీడీపీకి బ‌ల‌మైన కేంద్రం. గ‌త ఆరు ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే కేవ‌లం ఒక్క‌సారి మాత్ర‌మే కాంగ్రెస్ కైవ‌సం చేసుకుంది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి వంగ‌ల‌పూడి అనిత విజ‌యం సాధించారు. ఆమె త‌న స‌మీప వైసీపీ అభ్య‌ర్థి చంగ‌ల వెంక‌ట్రావుపై 2,848 ఓట్ల‌తో విజ‌యం సాదించారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వ‌చ్చిన అనిత ప్ర‌తిప‌క్షంలో సాగించిన అనేక పోరాటాల‌తో ఆమెకు ఓట‌ర్లు ప‌ట్టం క‌ట్టారు. కానీ మూడేళ్లుగా ఓట‌ర్ల విశ్వాసాన్ని ఆమె నిల‌బెట్టుకుంటున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. చివర‌కు వైజాగ్ లో నివాసం ఉంటుండ‌డంతో ఎమ్మెల్యే త‌మ‌కు అందుబాటులో ఉండ‌డం లేద‌నే ప్ర‌చారం ఉంది. అంతేగాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న‌ప్ప‌టికీ అభివృద్ధి మీద దృష్టి సారించ‌లేక‌పోతోంది. వాటికి తోడు అయ్య‌న్న‌పాత్రుడుతో ఆమె విబేధాలు కోట ఉర‌ట్ల మండ‌లంలో ఆమె కొంపముంచుతాయ‌నే వాద‌న ఉంది. అదే స‌మ‌యంలో వైసీపీ కూడా చెంగ‌ల వెంక‌ట్రావు స్థానంలో మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుని రంగంలో దింపింది.ఆయ‌న త‌ర్వాత ఇప్పుడు బాబూరావు పార్టీ ని న‌డిపిస్తున్నారు. చెంగ‌ల వ‌ర్గీయులంద‌రినీ క‌లుపుకుని పోతే సానుకూల‌త ఏర్ప‌డ‌వ‌చ్చు. అనిత మీద పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌ను సద్వినియోగం చేసుకోగ‌లిగితే ఉత్త‌రాంధ్ర ముఖ‌ద్వార నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఆశ‌లు పండుతాయ‌ని అంచ‌నాలున్నాయి.

2.న‌ర్సీప‌ట్నం: తెలుగుదేశం పార్టీకి మ‌రో బ‌ల‌మైన కేంద్రం న‌ర్సీప‌ట్నం. ప్ర‌స్తుతం ఏపీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు ఇక్క‌డి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న స‌మీప వైసీపీ అభ్య‌ర్థి పెట్ల ఉమాశంక‌ర్ గ‌ణేష్ పై 2,338 ఓట్ల తేడాతో గట్టెక్కారు. గ‌ట్టిపోటీ ఎదుర్కుని విజ‌యం సాధించిన అయ్య‌న్న మూడేళ్లుగా త‌న ప‌ట్టు పెంచుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. త‌న‌కు దూర‌మ‌యిన ప‌లువ‌ర్గాల‌ను ద‌గ్గ‌ర చేర్చుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు.విప‌క్షాన్ని ఇరుకున పెట్ట‌డానికి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే కాపుల్లో పెరుగుతున్న ఆగ్ర‌హం ఆయ‌న‌కు కొంత ఇబ్బందిని తీసుకొస్తోంది. దానికితోడు ఇసుక‌, మైనింగ్ మాపియా వ్య‌వ‌హారాలు అధికార పార్టీకి ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను తీసుకొస్తున్నాయి. అదే స‌మ‌యంలో వైసీపీ కి ప‌లు సంస్థాగ‌త స‌మ‌స్య‌లు క‌నిపిస్తున్నాయి. పార్టీ బ‌లోపేతం అయిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌, పార్టీ ఇమేజ్ తో గెల‌వాల‌ని ప‌లువురు ప్ర‌య‌త్నిస్తున్నారు. అభ్య‌ర్థి గ‌ణేష్ ని మార్చి త‌న‌కు అవ‌కాశం వ‌స్తుంద‌ని మాజీ ఎమ్మెల్యే ముత్తాల పాప ఆశిస్తున్నారు. టీడీపీ త‌రుపున కూడా అయ్య‌న్న స్థానంలో చింత‌కాయ‌ల విజ‌య్ ఆయ‌న వార‌సుడిగా రంగంలో దిగ‌డం ఖాయంగా ఉంది. దాంతో ఈ న‌ర్సీపట్నం రాజ‌కీయాలు ఆస‌క్తిదాయ‌కంగా మారుతున్నాయి.

3.య‌ల‌మంచిలి: కాపులు ప్ర‌ధానంగా క‌నిపించే మ‌రో కీల‌క నియోజ‌క‌వ‌ర్గం య‌ల‌మంచిలిలో ప్ర‌ధాన వ‌ర్గాల‌న్నీ టీడీపీలో చేర‌డంతో మొన్న‌టి ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుంది. ఆపార్టీ త‌రుపున పంచ‌క‌ర్ల ర‌మేష్ బాబు విజ‌యం సాధించారు. స‌మీప వైసీపీ అభ్య‌ర్థి ప్ర‌గ‌డ నాగేశ్వ‌ర‌రావును 8,375 ఓట్ల తేడాతో ఓడించారు. పెందుర్తి నుంచి య‌ల‌మంచిలికి వ‌ల‌స వ‌చ్చిన ర‌మేష్ బాబుకి రాజ‌కీయంగా ప‌ట్టు సాధించ‌డం సాధ్యం కావ‌డం లేదు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు ప‌ప్ప‌ల చ‌ల‌ప‌తిరావు, క‌న్న‌బాబు వ‌ర్గాలు ఎమ్మెల్యేకి కంట్లో న‌లుసులా క‌నిపిస్తున్నాయి. వారికి తోడు విశాఖ డెయిరీ చైర్మ‌న్ అడారి తుల‌సీరావు వ‌ర్గం కూడా మ‌రో పెద్ద త‌ల‌నొప్పిగా మారుతోంది. దాంతో టీడీపీలో ఐక్య‌త క‌రువ‌య్యింది. ఎమ్మెల్యే తీరు మీద కూడా పార్టీలో అసంతృప్తి క‌నిపిస్తుండ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థి మార్పు ఖాయ‌మ‌నే ప్ర‌చారం ఉంది. మ‌రోవైపు వైసీపీ కూడా ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను, టీడీపీలో అసంతృప్తుల‌ను సొమ్ము చేసుకోలేక‌పోతోంది. ప్ర‌గ‌డ నాగేశ్వ‌రావు ప్ర‌య‌త్నాలు ఫెద్ద‌గా ఫ‌లించ‌డం లేదు. దాంతో కొత్త అభ్య‌ర్థి రంగంలో దిగ‌వ‌చ్చ‌ని ప్ర‌చారం సాగుతోంది. సామాజిక అండ ఉన్న ప్ర‌గ‌డ‌కు మ‌రో ఛాన్స్ ద‌క్కుతుందా లేదా అన్న‌ది ఆస‌క్తిదాయ‌క‌మే. దాంతో య‌ల‌మంచిలో ఇరుపార్టీల బ‌లంగా డీ కొంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

4. అన‌కాప‌ల్లి: బెల్లం వ్యాపారంతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు పొందిన అన‌కాప‌ల్లిలో కుల స‌మీక‌ర‌ణాలు కీలకంగా ఉంటాయి. గ‌వ‌ర కులం హ‌వా న‌డుస్తుంది. కాపులు కూడా కీలంగా వ్య‌వ‌హ‌రిస్తారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి పీలా గోవింద్ విజ‌యం సాధించారు. వైసీపీ అభ్య‌ర్థి కొణ‌తాల ర‌ఘునాథ్ ను 22,341 ఓట్ల తేడాతో చిత్తు చేశారు. మూడేళ్ల‌లో పీలా గోవింద్ వ్య‌వ‌హ‌శైలి ప‌లు వివాదాల‌కు కేంద్రంగా ఉంది. భూ ఆక్ర‌మ‌ణ‌ల ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. టీడీపీ నేత‌ల్లోనూ స‌ఖ్య‌త లేదు. వ్యాపార వ‌ర్గాల‌లో ప్ర‌భుత్వ తీరు మీద వ్య‌తిరేక‌త పెరుగుతోంది. దాంతో ఇక్క‌డ టీడీపీకి ఎదురీత త‌ప్పేలా లేదు. అదే స‌మ‌యంలో వైసీపీకి గ‌త ఎన్నిక‌ల్లో దూర‌మ‌యిన కొంద‌రు మ‌రోసారి ద‌గ్గ‌రవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ముఖ్యంగా కొణ‌తాల‌, దాడి వ‌ర్గాలు రాజ‌కీయంగా ఆస‌క్తి ఉన్నా, అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. వారిలో ఎవ‌రు మ‌ళ్లీ వైసీపీ వైపు చేరినా కొంత ఊపు వ‌స్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌స్తుతం మాత్రం ఆపార్టీకి త‌గిన దిశానిర్దేశం క‌నిపించ‌డం లేదు. దాంతో న‌డిపించే నేత కోసం ఎదురుచూడాల్సి వ‌స్తోంది.

5. చోడ‌వ‌రం: టీడీపీకి బ‌ల‌మైన మ‌రో నియోజ‌క‌వ‌ర్గంగా చెప్ప‌వ‌చ్చు. గ‌డిచిన మూడు ఎన్నిక‌ల్లోనూ టీడీపీదే విజ‌యం ఇక్క‌డ‌. కాపులు, క్ష‌త్రియుల మ‌ధ్య రాజ‌కీయ వైరం క‌నిపిస్తుంటుంది. ప్ర‌స్తుతం క‌లిదిండి సూర్య‌నాగ స‌న్యాసిరాజు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీని 909 ఓట్ల తేడాతో ఓడించి గ‌ట్టెక్కారు. సామాజికంగానూ, అర్థికంగానూ బ‌ల‌మైన ప‌ట్టున్న స‌న్యాసిరాజుకి నియోజ‌క‌వ‌ర్గ‌మంతా విస్తృత ప‌రిచ‌యాలున్నాయి. పార్టీకి బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది. పైగా ఇటీవ‌ల ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌తో అంద‌రికీ చేరువ‌య్యే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. చోడ‌వ‌రం షుగర్స్ విష‌యంలో స‌ర్కారు తీరు ఎమ్మెల్యేకి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. మ‌రోవైపు క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ మీద నియోజ‌క‌వ‌ర్గంలో సానుభూతి క‌నిపిస్తోంది. వ‌రుస ఓట‌ముల‌తో ఆయ‌న ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదుర్కుంటున్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో ఉండే నాయ‌కుడిగా గుర్తింపు ఉంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద ప‌నిచేయ‌డంలో కొంత లోపం క‌నిపిస్తున్నా వాటిని అధిగించ‌గ‌ల‌ర‌ని ధ‌ర్మ‌శ్రీ అనుచ‌రులు ఆశిస్తున్నారు. దాంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా మ‌రోసారి ఈ ఇద్ద‌రు నేత‌లు మ‌రోసారి ఢీ కొట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది. అదే జ‌రిగితే ఫ‌లితాలు ఆస‌క్తిదాయ‌క‌మే.

6. మాడుగుల: విశాఖ‌లో మ‌రో కీల‌క నియోజ‌క‌వ‌ర్గం. కాపులు కీల‌కంగా ఉంటారు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి వైసీపీ గెలిచింది. ఆ పార్టీ అభ్య‌ర్థి బూడి ముత్యాల నాయుడు 4,761 ఓట్ల తేడాతో గ‌విరెడ్డి రామానాయుడుని ఖంగుతినిపించారు. బూడి ముత్యాల‌నాయుడికి విస్తృత ప‌రిచ‌యాలున్నాయి. బంధుత్వం కూడా ఉంది. దాంతో ఆయ‌న విజ‌యానికి అవ‌కాశం ద‌క్కినా, రాజ‌కీయంగా ప‌ట్టు నిలుపుకోవ‌డానికి త‌గ్గ‌ట్టుగా కార్యాచ‌ర‌ణ క‌నిపించ‌డం లేదు. పార్టీ యావ‌త్తు ఆయ‌న నాయ‌క‌త్వంలో ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌తిప‌క్షంలో ఉండడంతో ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోతున్నారు. కీల‌కాంశాల‌లో దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోతున్నార‌నే వాద‌న కూడా ఉంది. అదే స‌మ‌యంలో టీడీపీ లో విబేధాలు బ‌హిరంగంగానే ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే రామానాయుడు వైఖ‌రిని ప‌లువురు టీడీపీ నేత‌లే స‌హించ‌లేక‌పోతున్నారు. ఆయన స్థానంలో కొత్త అభ్య‌ర్థిని రంగంలో దింపుతార‌ని టీడీపీలోని ఓ వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది. కాపుల్లో ప్ర‌భుత్వం ప‌ట్ల సానుకూల‌త లేక‌పోవ‌డం టీడీపీకి కొంత ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణ‌మే. దాంతో మ‌ళ్లీ పాత అభ్య‌ర్థులే బ‌రిలో దిగితే హోరా హోరీ పోరు త‌ప్ప‌క‌పోవ‌చ్చు.

7.పెందుర్:తి బీసీలు, కాపులు ప్రాధానంగా ప‌ట్టు ప్ర‌ద‌ర్శించే నియోజ‌క‌వ‌ర్గం. ఇప్పుడు పూర్తిగా విశాఖ న‌గ‌రంలో భాగంగా మారిపోయింది. ప్ర‌స్తుతం టీడీపీ త‌రుపున బండారు స‌త్య‌న్నారాయ‌ణ మూర్తి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఆయ‌న వైసీపీ అభ్య‌ర్థి గండిబాబ్జీని 18,684 ఓట్ల తేడాతో చిత్తుచేశారు. వ్య‌క్తిగ‌తంగా బండారుకి కొంత గుర్తింపు ఉంది. కానీ గ‌డిచిన మూడేళ్ల‌లో అవినీతి, భూదందాల వంటి వ్య‌వ‌హారాల‌తో టీడీపీ కి త‌ల‌నొప్పి గా మారుతోంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కొంత ఉన్నా, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గం అండ‌తో మ‌రోసారి గ‌ట్టెక్క‌గల‌న‌ని ఈ సీనియ‌ర్ ఎమ్మెల్యే ఆశిస్తున్నారు. అయితే టీడీపీలో వ‌ర్గ‌పోరు ఉధృతంగా ఉంది. ఆయ‌న చేతిలో ఓట‌మిపాల‌యిన గండి బాబ్జీ కూడా సైకిలెక్కేయ‌డంతో బండారు స‌త్యాన్నారాయ‌ణ మూర్తితో ఆయ‌న విబేధాలు టీడీపీ ని ఇర‌కాటంలో ప‌డెతున్నాయి. ఇక వైసీపీకి త‌గిన నాయ‌క‌త్వం లేక‌పోవ‌డం టీడీపీకి క‌లిసొచ్చే అంశ‌మ‌ని అంచ‌నాలున్నాయి. గండిబాబ్జీ పార్టీని వీడ‌డంతో విప‌క్షానికి త‌గిన నాయ‌కుడు క‌నిపించ‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి సబ్బం హ‌రి వంటి వారు మ‌ళ్లీ వైసీపీ గూటికి వ‌స్తే పెందుర్తి బ‌రిలో దిగ‌వ‌చ్చ‌నే ప్ర‌చారం ఉన్నా, అదంత సులువుగా లేదు. ఇక పార్టీ జిల్లా అధ్య‌క్షుడు గుడివాడ్ అమ‌ర్ నాధ్ కూడా పెందుర్తి మీద దృష్టిపెట్టారు. అసెంబ్లీకి రంగంలో దిగితే గ‌తంలో త‌న తండ్రి ప్రాతినిధ్యం వ‌హించిన పెందుర్తి నుంచేన‌ని ఆయ‌న ఆశిస్తున్నారు. దాంతో గ‌ట్టి పోరు సాగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.


Related News

SBICBI

సీఎం ఇచ్చిన చెక్ చెల్లలేదు..!

Spread the loveపదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపినందుకుగాను సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా అందుకున్న చెక్కు చెల్లుబాటుRead More

somu, gorantla

సోము వీర్రాజు వసూళ్లు ఎక్కడో తెలుసా?

Spread the loveతెలుగుదేశం, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఓవైపు సోము వీర్రాజు నేరుగా చంద్రబాబు మీద గురిపెట్టారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *