కూల్చారు:మూడో రోజు కీలకంగా మార్చారు

team india
Spread the love

దక్షిణాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్న సమయంలో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియాకు స్వల్ప ఆధిపత్యం దక్కింది. మూడో రోజు కీలకంగా మారింది.

రెండో రోజు ఆటలో టీమిండియా బౌలర్లు చెలరేగారు. వాండరర్స్ వేదికగా సత్తా చాటారు. దాంతో కేవలం ఏడు పరుగుల స్వల్ప ఆధిపత్యం మాత్రమే ఆతిథ్య జట్టుకి దక్కింది. పదునైన బంతులతో భారత పేసర్లు ప్రతాపం చూపడంతో తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టు 194 పరుగులకే పరిమితమైంది. అతికష్టమ్మీద 7 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. అది కూడా ఆపద్బాంధవుడు ఆమ్లా (121 బంతుల్లో 61; 7 ఫోర్లు) అర్ధ శతకానికి బౌలింగ్‌ ఆల్‌ రౌండర్లు రబడ (84 బంతుల్లో 30; 6 ఫోర్లు), ఫిలాండర్‌ (55 బంతుల్లో 35; 5 ఫోర్లు) తోడుగా నిలవడంతోనే సాధ్యమైంది. వీరు ముగ్గురు తప్ప జట్టులో మరెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోవడం గమనార్హం.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ ఆట ముగిసేసరికి పార్థివ్‌ పటేల్‌ (16) వికెట్‌ కోల్పోయి 49 పరుగులు చేసింది. ఓపెనర్‌ మురళీ విజయ్‌ (13 బ్యాటింగ్‌), వన్‌డౌన్‌లో వచ్చిన కేఎల్‌ రాహుల్‌ (16 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఇప్పటికి టీమిండియా 42 పరుగుల ఆధిక్యంలో ఉంది. బ్యాటింగ్‌ బహు కష్టంగా ఉన్న నేపథ్యంలో నిఖార్సైన పేస్‌ను ఎదుర్కొంటూ నాలుగో ఇన్నింగ్స్‌లో ప్రొటీస్‌కు ఛేదన దుర్లభమే. కాబట్టి… మూడో రోజు భారత్‌ ఎన్ని ఎక్కువ పరుగులు జోడిస్తే విజయానికి అంత చేరువవుతుంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *