వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ జ‌డేజా స్థానంలో?

jadeja
Spread the love

భారత లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ ర్యాంకింగ్స్‌లో నెం:1 ఆల్‌రౌండర్‌గా అగ్రస్థానం చేజిక్కుంచుకున్నాడు. శ్రీలంకపై 2-0తో భారత్‌ టెస్ట్‌ సిరీస్‌ను వశం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ రెండు టెస్ట్‌ల్లో అద్భుత ప్రతిభతో పలువురు ఆటగాళ్లు ఐసిసి ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకారు. కొద్ది నెలలుగా టెస్ట్‌ల్లో నెం:1 బౌలర్‌గా కొనసాగుతున్న జడేజా, తాజాగా ఆల్‌రౌండర్‌గా 438 పాయింట్లతో నెంబర్‌ వన్‌ స్థానాన్ని అధిష్టించాడు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న షాకిబ్‌ అల్‌ హసన్‌ (431) పాయింట్లను రెండో స్థానానికి నెట్టేశాడు. టాప్‌-3లో 418 పాయింట్లతో అశ్విన్‌ నిలిచాడు. మాంచెస్టర్‌లో సత్తా చాటిన జేమ్స్‌ అండర్సన్‌ రెండో స్థానంలో నిలిచాడు.

బౌలింగ్‌ విభాగంలో జడేజా నెంబర్‌ వన్‌ ర్యాంకులో యథాతథంగానే కొనసాగుతున్నాడు. నెం:2 ర్యాంకర్‌ అండర్సన్‌ కంటే జడ్డు 15 పాయింట్ల ముందంజలో ఉన్నాడు. ఇటీవల కొలంబోలో 50వ టెస్ట్‌ ఆడిన పుజారా తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులతో బ్యాటింగ్‌ విభాగంలో టాప్‌ టెన్‌కు చేరాడు. టాప్‌ ర్యాంకులో నిలిచిన జడేజాను భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రశంసలతో ముంచెత్తాడు. కత్తి మాస్టర్‌, మిస్టర్‌ జడేజాకు అభినందనలు చెప్పాడు. జడ్డుకు భారీ అభినందనలుంటూ ట్విట్టర్‌లో కోహ్లీ ట్వీట్‌ చేశాడు. 2012లో టెస్ట్‌ల్లో ప్రవేశించిన జడేజా బెస్ట్‌ ఆల్‌రౌండర్లలో ఒకడిగా నిలిచాడు. 5 వికెట్ల చొప్పున 9 సార్లు పడగొట్టడంతో పాటు, వేగంగా 150 వికెట్లను తీసిన రెండో బౌలర్‌గా ఇటీవల రికార్డుల కెక్కాడు.

శ్రీలంకతో ఈ నెల 12 నుంచి ఆరంభం అయ్యే మూడో టెస్ట్‌లో జడేజా స్థానంలో అక్షర్‌ పటేల్‌ లేదా జయంత్‌ యాదవ్‌ల్లో ఎవర్నో ఒకర్ని తీసుకునే అవకాశం ఉంది. రెండోటెస్ట్‌లో అవమానకర రీతిలో జడేజా గ్రౌండ్స్‌లో వ్యవహరించిన తీరుతో అతన్ని చివరి టెస్ట్‌కు ఐసిసి సస్పెండ్‌ చేసి, మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించిన విషయం తెల్సిందే. దీంతో రెండో స్పిన్నర్‌గా అక్షర్‌ లేదా జయంత్‌ల్లో పల్లెకలె టెస్ట్‌కు ఎంపిక చేసే విషయమై కెప్టెన్‌ కోహ్లీ, ప్రధాన కోచ్‌ రవిశాస్త్రితో చర్చించి తుది నిర్ణయాన్ని చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్కే ప్రసాద్‌ తీసుకునే అవకాశం ఉంది


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *