ఈసారి ధోనీతో రోహిట్

rohith
Spread the love

ఫెయిర్ మారింది. కానీ ఫలితం అదే. ప్లేస్ మారింది గానీ రిజల్ట్ మాత్రం అదే. శ్రీలంక సిరీస్ లో టీమిండియా అప్రతిహాత విజయాలకు అడ్డుకట్ట వేయాలని భావించిన లంకేయులకు ఆశాభంగం తప్పడం లేదు. అభిమానుల ఆగ్రహంతో చివరకు శ్రీలంకలో క్రికెట్ స్టేడియంలోనే నిరసనలు తప్పని స్థితి ఏర్పడింది. దాంతో కొద్ది సేపు ఆటకు విరామం ఏర్పడినా ఆఖరికి టీమిండియా విజయకేతనం తప్పలేదు. 5 వన్డేల సిరీస్ లో 3 మ్యాచ్ లనూ టీమిండియా గెలవడంతో సిరీస్ సొంతమయ్యింది.

రెండో వన్డేలో భువీతో కలిసి జట్టును విజయతీరానికి చేర్చిన ధోనీ ఈసారి ఓపెనర్ రోహిత్ శర్మతో జతగట్టాడు. ఇద్దరూ కలిసి సునాయాసంగా జట్టును గెలిపించారు. అందులో రోహిట్ కావడం జట్టుకు శుభసూచికం. ఇటీవల ఫామ్ లో లేక రోహిత్ శర్మ తీవ్రంగా సతమతమవుతున్నాడు. ఈ మ్యాచ్ లో సెంచరీతో కదం తొక్కి మళ్లీ తన పూర్వవైభవాన్ని అందుకోవడానికి ఓ అడుగు వేశాడు. కెరీర్ లో 10వ సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ శర్మ సెంచరీతో పాటు, ధోనీ అర్థ సెంచరీలతో నాటౌట్ గా నిలిచి జట్టును గెలిపించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకను బుమ్రా హడలెత్తించాడు. జస్‌ప్రీత్ బుమ్రా 10 ఓవర్లు బౌల్ చేసి, కేవలం 27 పరుగులిచ్చి 5 వికెట్లు కూల్చాడు. అతని బౌలింగ్ ప్రతిభ లంక బ్యాటింగ్‌ను దారుణంగా దెబ్బతీసింది. దాంతో శ్రీలంక స్వల్ప స్కోర్ కే పరిమితం అయ్యింది.

రెండో వన్డేలో అద్భుతంగా ఆడి, జట్టును గెలిపించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి అదే స్థాయిలో రాణించి, అర్ధ శతకం సాధించి నాటౌట్‌గా నిలిచాడు. 218 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 9 పరుగుల వద్ద మొదటి వికెట్‌గా శిఖర్ ధావన్ (5)ను కోల్పోయింది. అతను లసిత్ మలింగ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 3 పరుగులు చేసి, విశ్వ ఫెర్నాండో బౌలింగ్‌లో దుష్మంత చమీరా క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. లోకేష్ రాహుల్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, 24 బంతుల్లో 17 పరుగులు చేసి, అకిల దనంజయ బౌలింగ్‌లో లాహిరు తిరిమానే క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరాడు. కేవలం రెండు బంతులు ఎదుర్కొని, పరుగుల ఖాతాను తెరవడంలో విఫలమైన కేదార్ జాధవ్‌ను అకిల దనుంజయ ఎల్‌బిగా వెనక్కు పంపాడు. ఈ దశలో, ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి ధోనీ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 45.1 ఓవర్లలో భారత్ నాలుగు వికెట్లకు 218 పరుగులు సాధించి, ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించే సమయానికి రోహిత్ శర్మ 124 (145 బంతులు, 16 ఫోర్లు, 2 సిక్సర్లు), ధోనీ 67 (86 బంతులు, 4 ఫోర్లు, ఒక సిక్సర్) నాటౌట్‌గా ఉన్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *