Main Menu

ఆదాల‌కి చెక్ పెట్టే య‌త్నంలో..!

Spread the love

నెల్లూరు జిల్లా రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా క‌నిపిస్తున్నాయి. అధికార పార్టీ వ్య‌వ‌హారాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ సీట్ల వేట‌లో ఒక‌రిపై ఒక‌రు పై చేయి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. పైకి న‌వ్వుతూనే లోలోన గోతులు తీసే ప‌నిలో ప‌డుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఆదాల ప్రభాకర్‌రెడ్డిని టార్గెట్‌గా చేసుకోవడం ఇపుడు జిల్లాతో పాటు రాష్ట్ర పార్టీలోనూ హాట్ టాపిక్‌గా మారింది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు, మరికొందరు కార్పొరేటర్లు, నాయకులు ఇటీవల నగరంలో ప్రత్యేకంగా సమావేశం జరుపుకోవడం, ఆదాల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మంత్రి నారాయణకు ఫిర్యాదు చేయాలనుకోవడం తెలిసిందే. అయితే ఈ సమావేశానికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి హాజరుకావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదాలకు వ్యతిరేకంగా జరుగుతున్న చర్యల్లో తాజాగా కోటంరెడ్డి కూడా చేరడాన్ని ఆదాల వర్గీయులు తట్టుకోలేకున్నారు. నుడా చైర్మన్ పదవి సమయంలో తన సంసిద్ధతను కూడా ఆదాల తెలియచేశారని, అయినా శ్రీనివాసులరెడ్డి ఇలా గ్రూపు సమావేశాలకు హాజరవడం, అందులో తమ నేతను టార్గెట్‌గా చేసుకొని విమర్శలకు దిగడాన్ని వారు నిరసిస్తున్నారు.

ఈ సమావేశం, అందులో తీసుకున్న నిర్ణయాల వెనుక ఆదాలతో సఖ్యత లేని ఓ మంత్రి ప్రమేయముందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారాయణకు జరుగుతున్న వ్యవహారాలు తెలిసినప్పటికీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో జరిగే ప్రతి బదిలీ, కాంట్రాక్ట్ పనుల అప్పగింతల వెనుక మంత్రి ప్రధాన అనుచరుడు కీలకపాత్ర పోషిస్తుండడాన్ని ఆదాలతో పాటు నగరంలోని టీడీపీ నాయకులు తొలి నుండి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయితే మంత్రిని చూసి వారు మిన్నకుండిపోతున్నారు. నగర టీడీపీలో గత రెండు మూడేళ్లుగా కార్పొరేటర్లు మొదలు, నాయకుల్లోనూ ఎంతో కొంత అసంతృప్తి ఉందనేది వాస్తవం. పార్టీకి నష్టం కలిగించే చర్యలు జరుగుతున్నా తమ లాభం మాత్రం చూసుకుంటూ వారు కూడా మిన్నకుండిపోతున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అసలు వారిని కాదని ఆదాలను టార్గెట్ చేయడం వెనుక కారణమేమిటనేది ఆదాల అనుచరుల ప్రశ్న.

దీనికితోడు నగరంలో రూరల్ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ కార్పొరేటర్లు కొందరు నూతన ఏడాది ఫ్లెక్సీల్లో ఆదాల ఫోటో తప్పించడం, జిల్లాకు చెందిన ఓ మంత్రి పేరుతో మాత్రమే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించడం ప్రస్తుతం మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారే అవకాశముంది. నగరంలో తనతో పాటు పార్టీకి చేటుచేసేలా జరుగుతున్న ఘటనలను పరిశీలించి పార్టీ అధ్యక్షుడి హోదాలో చర్యలు తీసుకోవాలని బీద రవిచంద్రను ఆదాల కోరడం జరిగింది. అయితే ఆయన కూడా ఈ గ్రూప్ మీటింగ్స్ ముందూ వెనకా ఉన్నదెవరో తెలిసినప్పటికీ సదరు నాయకులపై చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నట్లు ఆదాల వర్గీయుల ఆరోపణ. దీంతో తమ నేత ఈ సంఘటన పూర్వాపరాలను, నగరంలో మంత్రి షాడోగా ఓ నాయకుడు చేస్తున్న అత్యుత్సాహాన్ని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు వారు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కూడా గత రెండు రోజులుగా నగర టీడీపీలో జరుగుతున్న వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గతంలో జిల్లాలో చావుదెబ్బ తిన్న సంగతిని కూడా మరచిపోయి తెలుగు తమ్ముళ్లు చేస్తున్న అసమ్మతి ఆరాటం ఇలానే కొనసాగితే 2019లోనూ గత ఫలితాలు ఎదురుచూడక తప్పదని రాజకీయ భావిస్తున్నారు.


Related News

ఆదాల సెంటిమెంట్: జ‌గ‌న్ కి క‌లిసొస్తుందా?

Spread the loveనెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో చిత్ర విచిత్ర ప‌రిణామాలు కొత్త కాదు. అయితే ఈసారి ఏకంగా పార్టీ టికెట్Read More

వైసీపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the loveఇప్ప‌టికే విప‌క్షం క‌స‌ర‌త్తులు పూర్తి చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను నోటిఫికేష‌న్ రాగానేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *