రోజాతో జగన్ కి ఇక్కట్లు?

roja
Spread the love

ఏపీ రాజకీయాల్లో అధికార పార్టీకి కంట్లో నలుసులా మారిన వాళ్లలో ప్రతిపక్ష నేత జగన్ తో పాటు అదే పార్టీకి చెందిన ఆర్కే రోజా కూడా ఉంటారు. ఆమె మాట తీరుతోనే కాదు చేష్టలు కూడా టీడీపీకి సహించరాని అంశాలే. దానికి అనేక పూర్వ కారణాలుండవచ్చు గానీ ప్రస్తుతం మాత్రం రోజాకి జనంలో కొంత ఆదరణ ఉండడం, అదే సమయంలో ఆమె వాగ్దాటితో ఎదుటివారిని నియంత్రించే సామర్థ్యం ఉండడంతో అధికారపక్షానికి ఆమె కూడా సవాల్ గా మారారు. దానిని నేరుగా ఎదుర్కోవడం కంటే వ్యక్తిత్వం మీద దాడి కొట్టడానికే ఇటీవల రాజకీయాల్లో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. సరిగ్గా జగన్ విషయంలో చేసినట్టే రోజా విషయంలోనూ టీడీపీ అదే పద్ధతి అవలంభిస్తోంది.

తొలుత రోజాని ఐరెన్ లెగ్ అంటూ మొదలుపెట్టారు. ఇప్పుడు ఆమె మాటలతోనే నంద్యాల ఎన్నికలో టీడీపీకి ఉపయోగం జరిగిందంటూ రోజా మీద గురిపెట్టారు. చివరకు గుండు గీయించి ఫ్లెక్సీలు పెడుతూ దిగజారిపోతున్నారు కూడా. ఇదంతా రోజా మీద వ్యక్తిగత ద్వేషంతో కొందరు చేస్తుంటే, టీడీపీ వ్యూహాలలో భాగంగానే ఇలాంటివి జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. కొందరు నేతల వ్యక్తిత్వాల మీద దెబ్బ కొట్టడం ద్వారా వారిని జనంలో పలుచన చేసే పద్ధతి ఇటీవల అందరూ పాటిస్తున్నారు. ఇప్పటికే నారా లోకేష్ విషయంలో వైసీపీ అలాంటి వ్యూహాలను అనుసరించి దాదాపు ఫలితం సాధించింది.

టీడీపీ కూడా అదే బాటలో జగన్ మీద చేసిన ప్రచారం జనాలకు చేరింది. రోజా విషయంలో కూడా సక్సెస్ అయ్యేలా కనిపిస్తున్నారు. దానికి రోజా తీరు కూడా కొంత కారణం అవుతోంది. సబ్జెక్ట్ మీద పట్టున్నప్పటికీ కొన్ని మార్లు కట్లు తెంచుకుని చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. నంద్యాలలో అఖిలప్రియ మీద చేసిన కామెంట్స్ అలానే అయ్యాయి. అయినా ఆమెకు సాధారణ ప్రజల్లో సినీ నటిగా ఉన్న ఆదరణ ఉంటుందనడంలో సందేహం లేదు. అదే సమయంలో ఆమె మాటలు విశ్వాసంలోకి తీసుకోకపోతే ఆమెకు కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి దానిని కాపాడుకోవడం అవసరం. అందుకు తగ్గట్టుగా కంట్రోల్ తో వ్యవహరించాలి. అదుపు తప్పితే అసలుకే మోసం వస్తుందని ఆమె గ్రహించాలి.

ఇప్పటికే వైసీపీలో పలువురు నేతలు రోజా మీద విమర్శలు చేస్తున్నారు. జగన్ ముందు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. జగన్ కామెంట్స్ తో పాటు రోజా వ్యాఖ్యలు కూడా నష్టం చేకూర్చాయని వైసీపీలో కొందరు అంగీకరిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులోనైనా ఎమ్మెల్యే రోజా తన పార్టీ అధినేతకు భారం కాకుండా ఉండాలంటే తీరు మార్చుకోవాలి. లేకుంటే రోజాకి సొంత నియోజకవర్గం నగరిలో కూడా ఇక్కట్లు ఎదురవుతాయి.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *