టీడీపీలో కొత్త లొల్లి

tdp
Spread the love

జెడ్పీ వ్యవహారం తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. చైర్మన్ మార్పిడి విషయంలో జరుగుతున్న కాలయాపన అందరినీ కలచివేస్తోంది. దాంతో వ్యవహారం పెద్ద వివాదంగా మారుతుందా అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. అనంతరాజకీయాలను హీటెక్కిస్తున్న జెడ్పీ చైర్మన్ పోస్ట్ విషయంలో సాగుతున్న రాజకీయాలు పెద్ద రచ్చకే దారితీస్తాయని భావిస్తున్నారు.రోజులు గడుస్తున్నా జడ్పీ చైర్మన్ మార్పు కొలిక్కి రావడం లేదు. ప్రస్తుత చైర్మన్ చమన్ సైతం పదవిని వదిలేందుకు సుముఖంగా లేకపోవడం సమస్యగా మారుతోంది. దాంతో అధిష్టానం కూడా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు నాగరాజు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తుది నిర్ణయం తీసుకునే నిమిత్తం జిల్లా ఇన్‌చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచన మేరకు చైర్మన్ చమన్, పదవిని ఆశిస్తున్న నాగరాజు ముఖ్యమంత్రిని కలిసేందుకు ఈనెల 4న అమరావతికి వెళ్లారు. అయితే సిఎం అప్పాయింట్‌మెంట్ లభించకపోవడంతో విషయం చర్చకు రాలేదు.

ఇటీవల అమరావతిలో నిర్వహించిన రాష్టస్థ్రాయి వర్క్‌షాపులో జిల్లాకు చెందిన మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీతతో పాటు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఈనేపథ్యంలో వర్క్‌షాప్ పూర్తయిన తర్వాత జడ్పీ చైర్మన్ మార్పు విషయాన్ని సిఎం పరిశీలించవచ్చని ఆశించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న జడ్పీటీసీ నాగరాజు తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. తననే చైర్మన్ పదవిలో కొనసాగించేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరాలని చమన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒకవేళ చైర్మన్ పదవిని నుంచి తొలగిస్తే, ప్రత్యామ్నాయంగా నామినేడెట్ పోస్టు ఏదైనా ఇవ్వాలని జిల్లాకు చెందిన రాష్ట్ర నేతల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. నూర్‌బాప్ అసోసియేషన్‌లో తనకు అనుభవం ఉన్నందున సంబంధిత కార్పొరేషన్‌కు చైర్మన్‌గానైనా నియమించాలని కోరుతున్నట్లు సమాచారం.

కాగా చమన్ వ్యవహార శైలి జిల్లా పార్టీ నేతల్లో సైతం అసహనానికి గురి చేస్తోంది. ఒప్పందం సమయంలో నిర్ణయించిన మేరకు ఆయన హూందాగా వ్యవహరించాల్సి ఉన్నా, నాన్చుడు ధోరణితో ప్రజల్లో చులకన భావం కలిగేలా ప్రవర్తిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని పార్టీ రాష్ట్ర, జిల్లా నేతల్లో చర్చ సాగుతున్నట్లు సమాచారం. జడ్పీ చైర్మన్ పదవి కాలం ముగియడానికి మరికొన్ని నెలలే ఉన్నప్పటికీ ఎలాగైనా ఆ స్థానంలో తాను కూర్చోవాలని నాగరాజు బలంగా కోరుకుంటున్నారు. తనకు ఇచ్చిన మాట ప్రకారం పార్టీ నేతలు తనకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటు పార్టీ వర్గాలు, జిల్లా ప్రజలు కూడా జడ్పీ చైర్మన్ మార్పుపై ముఖ్యమంత్రి సరైన నిర్ణయం తీసుకుంటారా, లేదా? అనే ఎదురు చూస్తున్నారు. మరి ఈ దోబూచులాట ఇంకెంత కాలం కొనసాగుతుందో వేచి చూడాల్సి ఉంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *