Main Menu

బీజేపీ నినాద‌మే జ‌గ‌న్ విధానం..!

modi jagan
Spread the love

ఇటీవ‌ల ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర మార్పులు జ‌రుగుతున్నాయి. అధికార కూట‌మిలో పార్టీల మ‌ధ్య దూరం పెరుగుతోంది. అదే స‌మ‌యంలో విప‌క్ష వైసీపీకి బీజేపీ మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డుతుంద‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం. ఇప్ప‌టికే బేష‌ర‌తుగా రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌పతి ఎన్నిక‌ల్లో ఎన్డీయేకి మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించారు. మోడీ విధానాల‌ను స‌మ‌ర్థిస్తున్నారు. చివర‌కు ప్ర‌త్యేక హోదా విష‌యంలో రాజీనామాల ప్ర‌స్తావ‌న‌ను దాదాపుగా మ‌ర‌చిపోయారు. పార్ల‌మెంట్ లో ప‌ట్టుబ‌డ‌తామంటూ వైసీపీ నేత‌లు ఇప్పుడు మాట మార్చాల్సి వ‌చ్చింది. ఇక దానికి కొన‌సాగింపుగా వైఎస్ జ‌గ‌న్ చేతల్లో ప‌లు మార్పులు వ‌స్తున్నాయి. ఆయ‌న ఇటీవ‌ల యాగాల‌కు కూడా సిద్ధ‌మ‌య్యారు. త‌న‌పై ఉన్న ముద్ర‌ను చెరిపేసుకోవ‌డంలో భాగంగా త్వ‌ర‌లో కాలిన‌డ‌క‌న తిరుమ‌ల ద‌ర్శ‌నానికి బ‌య‌లుదేర‌బోతున్నారు. మొత్తంగా హిందూ అతివాద పార్టీకి అతి చేరువ కావ‌డానికి జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

వాస్త‌వానికి చంద్ర‌బాబు గ‌తంలోనే వ్యాఖ్యానించారు. ఎన్డీయే నుంచి తాము బ‌య‌ట‌కు వ‌స్తే ఆ స్థానంలో జ‌గ‌న్ చేర‌డానికి సిద్ధంగా ఉన్నార‌న్నారు. ఇప్పుడు ప‌రిణామాలు గ‌మ‌నిస్తే ఆ దిశ‌లోనే క‌నిపిస్తున్నాయి. జ‌గ‌న్ తో బీజేపీ స్నేహ‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. చివ‌ర‌కు సీఎం చంద్ర‌బాబుకి దొర‌క‌ని మోడీ అపాయింట్ మెంట్ వైఎస్ జ‌గ‌న్ కి అనూహ్యంగా ద‌క్కుతుంది. ఏపీ వ్య‌వ‌హారాల్లో కేంద్రం స‌హాయ‌నిరాక‌ర‌ణ చేస్తుంది. కానీ జ‌గ‌న్ పార్టీ త‌రుపున నంద్యాల ఉప ఎన్నిక‌ల ఓట‌ర్ల‌పై ఓ నివేదిక అంద‌గానే స్పందించి పాత ఓట‌ర్ల లిస్టు ప్ర‌కార‌మే ఎన్నిక‌లు జ‌రిగేలా నిర్ణ‌యం వెలువ‌డుతుంది. మొత్తంగా ఇలాంటి అనేక ప‌రిణామాల‌తో బాబు ఉక్కిరిబిక్కిర‌వుతున్నారు. ఆయ‌న్ని బీజేపీ వ‌దలాల్సిందే త‌ప్ప ఇప్ప‌టికిప్పుడు ఎన్డీయే వీడ‌డం బాబు వ‌ల్ల కాద‌న‌ట్టుగా ప‌రిణామాలున్నాయి. అందుకే ఆయ‌న బ‌ల‌హీన‌త‌ల‌ను బీజేపీ అధిష్టానం వినియోగించుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది.

అదే స‌మ‌యంలో జ‌గ‌న్ తాజా నినాదం 25 పార్ల‌మెంట్ స్థానాల‌ను 25 జిల్లాలుగా మార్చ‌డం అన్న‌ది బీజేపీ నినాద‌మే కావ‌డం విశేషం. ఏపీలో చాలాకాలంగా ఆ పార్టీ ఈ విష‌యంలో డిమాండ్ చేస్తోంది. చంద్ర‌బాబుని కూడా కోరింది. కానీ ఆయ‌న మాత్రం 13 జిల్లాల‌ను 14కి పెంచడానికి తగ్గ‌ట్టుగా పోల‌వ‌రం విలీన మండ‌లాల‌తో ఓ ప్ర‌తిపాద‌న చేసి ఆ త‌ర్వాత వెన‌క్కి త‌గ్గారు. కొత్త జిల్లాల ఆలోచ‌న‌ను మరుగున‌ప‌డేశారు. కానీ ఇప్పుడు జ‌గ‌న్ తాజాగా ఆ నిర్ణ‌యం త‌లకెత్తుకోవ‌డం విశేషంగా క‌నిపిస్తోంది. అధికారంలోకి రాగానే న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాలు అమ‌లుకోసం వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డానికే కొత్త జిల్లాలు ఖాయం అన్నారు. ప్ర‌తీ పార్ల‌మెంట్ సీటుని ఒక జిల్లా చేస్తామ‌ని, నంద్యాల‌ని జిల్లా కేంద్రంగా ఆయ‌న ప్ర‌క‌టించేశారు. త‌ద్వారా బీజేపీ నినాదం ఇక ఇప్పుడు వైసీపీ విధానంగా మారిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇలా చిన్న జిల్లాలు, చిన్న రాష్ట్రాలు అన్న‌ది ఆర్ఎస్ఎస్ మూల విధానం కావ‌డం గ‌మ‌నార్హం. బ‌లహీన‌మైన రాష్ట్రాలు-బ‌ల‌మైన కేంద్రం అన్న‌ది ఆర్ఎస్ఎస్ వైఖ‌రి. దానికి త‌గ్గ‌ట్టుగా జిల్లాల విభ‌జ‌న కోసం చాలాకాలంగా ప‌ట్టుబ‌డుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ క‌మిటీలుండే జిల్లాలు కూడా చాలా చిన్న‌విగా ఉంటాయ‌న్న‌ది గుర్తించాల్సిన అంశం. స‌రిగ్గా వైస్ జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న దానికి త‌గ్గ‌ట్టుగానే ఉండ‌డం విశేష‌మే.

మొత్తంగా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తుంటే బీజేపీతో జ‌గ‌న్ స్నేహం బ‌ల‌ప‌డే అవ‌కాశాల‌కు ఇలాంటి విధానాలు దారితీస్తాయ‌న‌డంలో అనుమానం లేదు. బీజేపీ డిమాండ్ల‌ను జ‌గ‌న్ త‌న అధికారిక విధానాలుగా ప్ర‌క‌టించ‌డం ద్వారా ఇరు పార్టీల మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డ‌డానికి దోహ‌దం చేస్తాయి. దాంతో ఏపీ రాజ‌కీయాల్లో ఎన్నిక‌ల‌కు ముందుగానీ, త‌ర్వాత గానీ జ‌గ‌న్ కి బీజేపీ తో స్నేహం ఖాయ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. దాంతో ఈ వ్య‌వ‌హారం ఆస‌క్తిక‌రంగా మారుతోంది.


Related News

ANNACANTEEN

అన్న క్యాంటీన్లు- అస‌లు మ‌త‌ల‌బు

Spread the loveఏపీలో ఎంతో అభివృద్ధి జ‌రిగింద‌ని, దేశ‌మ‌యితే ఎంతో అభివృద్ధి చెందుతోంద‌ని నేత‌లు అదే ప‌నిగా ప్ర‌చారార్భాటం చేస్తున్నRead More

tdp

వార‌సుల కోసం నేత‌ల పాట్లు

Spread the loveప్ర‌జాస్వామ్యంలో వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు కొద‌వ ఉండ‌డం లేదు. ప్ర‌ధాన పార్టీల‌న్నింటా అదే తంతు కనిపిస్తోంది. ఒక‌ప్పుడు కాంగ్రెస్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *