Main Menu

రౌండ‌ప్: కాకినాడ‌లో క‌దం తొక్కేదెవ‌రు?

Spread the love

ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన గోదావ‌రి జిల్లాల్లో కాకినాడ ఫ‌లితాలు ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. ప్ర‌స్తుతం స్మార్గ్ సిటీగా ఎంపిక‌యిన ఈ సాగ‌ర తీరంలో సామాజిక స‌మీక‌ర‌ణాలే కీల‌కంగా ఉంటాయి. అటు మెట్ట‌, ఇటు డెల్టా మండ‌లాల స‌మాహారంగా క‌నిపించే ఈ ప్రాంతం నుంచి ప్ర‌స్తుతం ఇద్ద‌రు మంత్రులు కీల‌క శాఖ‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. దాంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం మీద అంద‌రి దృష్టి ఉంటుంది. విభిన్న ఫ‌లితాల‌తో విల‌క్ష‌ణ తీర్పులివ్వ‌డం కాకినాడ వాసుల ప్ర‌త్యేక‌త‌. గ‌త ఎన్నికల్లో టీడీపీకి ప‌ట్టం క‌ట్టిన ఇక్క‌డి నేత‌లు మూడేళ్ల‌లో మారిన ప‌రిణామాల‌తో ఎటు మొగ్గు చూపుతున్నార‌న్న‌ది ఈ రౌండ‌ప్ లో చూద్దాం.

1. తుని: ఒక‌నాడు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడికి పెట్ట‌ని కోట వంటిది. 1983 నుంచి 2004 వ‌ర‌కూ ఆయ‌న‌దే విజ‌యం. అయితే వ‌రుస రెండు ఎన్నిక‌ల్లో య‌న‌మ‌ల బ్ర‌ద‌ర్స్ ప‌రాజ‌యం పాల‌య్యారు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధించింది. ఆపార్టీ త‌రుపున దాడిశెట్టి రాజా గెలిచారు. త‌న స‌మీప టీడీపీ అభ్య‌ర్థి య‌న‌మ‌ల‌కృష్ణుడిని 18,573 ఓట్ల తేడాతో చిత్తుచేశారు. మూడేళ్ల‌లో దాడిశెట్టి రాజా పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. కానీ వివాదాల‌లో త‌ల‌దూర్చ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల మీద కొంత‌మేర‌కు క‌దిలారు. దివీస్ వ్య‌తిరేక ఉద్య‌మంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి శ్ర‌మించారు. అభివృద్ధి క‌నిపించ‌క‌పోయినా ప్ర‌జ‌ల‌తో స‌ఖ్య‌త‌గా ఉంటార‌నే గుర్తింపు సాధించారు. అదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో ఓట‌మి పాల‌యినప్ప‌టికీ య‌న‌మ‌ల కృష్ణుడిదే అన్నింటిలోనూ హ‌వా. ఆయ‌న మాటే ఇక్క‌డ వేద‌వాక్కు. ఈ నేప‌థ్యంలో దివీస్ వ్య‌తిరేక ఉద్య‌మంతో య‌న‌మ‌ల పునాది కూడా పోయింది. సొంత మండ‌లం తొండంగిలో సొంత సామాజిక‌వ‌ర్గ‌మే వేడి మీద ఉంది. దాంతో య‌న‌మ‌ల బ్ర‌ద‌ర్స్ కు మ‌రిన్ని క‌ష్టాలు ఖాయంగా క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో టికెట్ కోసం య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి కుమార్తె కూడా రేసులో ఉంద‌నే ప్ర‌చారం కుటుంబంలో క‌ల‌హాల‌కు దారితీస్తోంది.

2. ప్ర‌త్తిపాడు: మెట్ట‌ప్రాంత మండ‌ల‌మైన ప్ర‌త్తిపాడులో కాపు సామాజిక‌వ‌ర్గానిదే హ‌వా. వ‌రుపుల‌, ప‌ర్వ‌త కుటుంబాల మ‌ధ్య వార్ గా క‌నిపిస్తోంది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధించింది. ఆ పార్టీ త‌రుపున వ‌రుపుల సుబ్బారావు విజ‌యం సాధించారు. స‌మీప టీడీపీ అభ్య‌ర్థి ప‌ర్వ‌త చిట్టిబాబును 3,413 ఓట్ల తో ఓడించి గ‌ట్టెక్కారు. కానీ ఏడాది క్రిత‌మే మ‌ళ్లీ టీడీపీలో చేరిపోయారు. అభివృద్ది పెద్దగా లేక‌పోవ‌డం, కాపులు, రైతుల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌తో ఆయ‌న ఉక్కిరిబిక్కిర‌వుతున్నారు. ఆయ‌న పార్టీ మారినా క్యాడ‌ర్ వెంట తీసుకెళ్ల‌లేక‌పోయారు. దాంతో టీడీపీలో ఆయ‌న వ‌ర్గ‌పోరును ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. వ‌రుపుల కుటుంబంలోనే విబేధాలున్న‌ట్టు క‌నిపిస్తోంది. అవినీతి ఆరోప‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి. దాంతో వ‌రుపుల‌కు మ‌ళ్లీ టికెట్ రావ‌డం అనుమాన‌మేన‌ని టీడీపీ నేత‌లే ప్ర‌చారం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో వైసీపీకి త‌గిన నేత క‌నిపించ‌డం లేదు.. పార్టీని ఏక‌తాటిపై న‌డ‌ప‌డంంలో విఫ‌ల‌మ‌వుతున్నారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను సొమ్ము చేసుకోలేక‌పోతున్నారు. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పార్టీలో చేరిక మీద చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. ఆ ప్ర‌భావంతో గ‌ట్టెక్కాస్తామ‌న్న ధీమాతో క‌నిపిస్తున్నారు. వైసీపీకి ఇక్క‌డి నుంచి కొత్త అభ్య‌ర్థి రావ‌డం ఖాయం. ఇరు పార్టీల మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉంటుంది.

3. జ‌గ్గంపేట: తూర్పు గోదావ‌రి జిల్లాలో మ‌రో కీల‌క నియోజ‌క‌వ‌ర్గం. జ్యోతుల‌, తోట కుటుంబాల మ‌ధ్య సుదీర్ఘ‌కాలంగా వైరం కొన‌సాగుతోంది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి వైసీపీ గెలిచింది. ఆపార్టీ త‌రుపున జ్యోతుల నెహ్రూ విజ‌యం సాధించారు. స‌మీప టీడీపీ అభ్య‌ర్థి జ్యోతుల చంటిబాబు ని 15,932 ఓట్ల తేడాతో ఓడించారు. వైసీఎల్పీ డిప్యూటీ లీడ‌ర్ గా ఎన్నిక‌యిన‌ప్ప‌టికీ పీఏసీ చైర్మ‌న్ గిరీ ఇవ్వ‌లేద‌న్న కార‌ణం చూపించి పార్టీ ఫిరాయించేశారు. ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్నారు. ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కున్న ప‌ట్టు కోల్పోయిన‌ట్టే క‌నిపిస్తోంది. టీడీపీలో బ‌ల‌మైన నేత‌లంతా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌డంతో ఆపార్టీ మీద జ్యోతుల నెహ్రూకి ప‌ట్టు చిక్కేలా లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి పేరుతో అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌చ్చ‌ని ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. ముఖ్యంగా త‌న‌యుడుని ప్రోత్స‌హించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. కానీ ప్ర‌జ‌లు, పార్టీ పెద్ద‌లు ఏమేరుకు అంగీక‌రిస్తార‌న్న‌ది సందేహంగా ఉంది. ఇక వైసీపీకి నాయ‌క‌త్వం క‌నిపించ‌డం లేదు. ఏడాదిన్న‌ర‌గా ఆపార్టీకి దిక్కూ మొక్కూ క‌నిపించ‌డం లేదు. నియోజ‌క‌వ‌ర్గ ఇన్ఛార్జ్ గా నియ‌మించిన ముత్యాల‌ శ్రీనివాస్ కి ప్ర‌భావితం చేయ‌గ‌లిగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దాంతో వైసీపీ అభ్య‌ర్థిని బ‌ట్టే ఇక్క‌డ ఫ‌లితాలు ఉంటాయి.

4. పెద్దాపురం : డిప్యూటీ సీఎం చిన‌రాజ‌ప్ప ఇక్క‌డి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. దాంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే నియోజ‌క‌వ‌ర్గం. క‌మ్మ సామాజిక‌వ‌ర్గ ప్ర‌భావం కూడా ఉంటుంది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో చిన‌రాజ‌ప్ప త‌న స‌మీప వైసీపీ అభ్య‌ర్థి తోట సుబ్బారాయుడుపై 10,663 ఓట్ల‌తో విజ‌యం సాధించారు. మూడేళ్లుగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు సాధించారు. పార్టీ ప‌రంగానూ, ప్ర‌భుత్వ‌ప‌రంగానూ ఆయ‌న‌కు తిరుగులేదు. అనేక అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. కానీ అదే స‌మ‌యంలో రాజ‌ప్ప పేరు చెప్పి న‌డుస్తున్న అవినీతి భాగోతాలు ఆయ‌న మెడ‌కు చుట్టుకుంటాయ‌ని భావిస్తున్నారు. హోం మంత్రి త‌న‌యుడి వ్య‌వ‌హారం కూడా ఆస‌క్తిగానే ఉంది. దాంతో రాజ‌ప్ప‌కు స్థాన‌భ్రంశం జ‌రుగుతుంద‌నే ప్ర‌చారం ఆపార్టీ నేత‌లే చేస్తున్నారు. అదే స‌మ‌యంలో వైసీపీ బ‌ల‌ప‌డుతున్న దాఖాలు లేవు. ఆ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న సుబ్బారాయుడు అవ‌కాశాల‌ను వినియోగించుకోలేక‌పోతున్నారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై కార్యాచ‌ర‌ణ క‌నిపించ‌డం లేదు. క‌నీసం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కూడా నింప‌లేక‌పోతున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరక‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నా సొమ్ము చేసుకునే ప‌రిస్థితి లేదు. దాంతో మ‌రో అభ్య‌ర్థి కోసం వైసీపీ వేట ప్రారంభించిన‌ట్టు క‌నిపిస్తోంది. అభ్య‌ర్థిని బ‌ట్టి ఇక్క‌డి ఫ‌లితాలు ఆధార‌ప‌డి ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

5. పిఠాపురం: పిఠాపురంలో గెలిచిన పార్టీ ఏపీలో అధికారంలోకి రాద‌న్న‌ది ఓ నానుడి. 1999 నుంచి ఫ‌లితాలు అదే చెబుతున్నాయి. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి ఇండిపెండెంట్ గా టీడీపీ రెబ‌ల్ అభ్య‌ర్థి ఎస్వీఎస్ఎన్ వ‌ర్మ గెలిచారు. ఆ త‌ర్వాత ఆయ‌న టీడీపీలో చేరిపోయారు. వ‌ర్మ త‌న స‌మీప వైసీపీ అభ్య‌ర్థి దొర‌బాబుని 47,080 ఓట్ల తేడాతో చిత్తుచేశారు. రెబ‌ల్ అభ్య‌ర్థి భారీ మెజార్టీతో గెలిచిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ అధికారిక అభ్య‌ర్థి మూడోస్థానానికి ప‌రిమిత‌మైపోయారు. ఇక మూడేళ్ల‌లో వ‌ర్మ వైఖ‌రితో అటు పార్టీలోనూ, ఇటు ప్ర‌జ‌ల్లోనూ తీవ్ర వ్య‌తిరేక‌త కొని తెచ్చుకున్నారు. ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌జాగ్ర‌హానికి గుర‌వుతున్నారు. టికెట్ రాలేద‌న్న సానుభూతితో భుజానికెత్తుకున్న ప‌లువురు ఇప్పుడు ఆయ‌న‌కు దూర‌మ‌య్యారు. ప్ర‌జ‌లు కూడా ఆయ‌న తీరుతో వ‌ర్మ‌..ఏంటీ ఖ‌ర్మ అనుకునే స్థాయిలో క‌నిపిస్తున్నారు. ఎస్ఈజెడ్ ప్రాంతంలో మాట నిలుపుకోక‌పోవ‌డంతో తీవ్ర వ్య‌తిరేకత క‌నిపిస్తోంది. అయితే వైసీపీకి బ‌ల‌మైన నాయ‌కుడు క‌నిపించ‌డం లేదు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొర‌బాబు మీద పార్టీ నేత‌ల్లో కూడా విశ్వాసం క‌నిపించ‌డం లేదు. కాపులు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో త‌గిన అభ్య‌ర్థి లేకుండా ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను విప‌క్షం సొమ్ము చేసుకునే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు.

6 కాకినాడ రూర‌ల్ : కాకినాడ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో బీసీల‌దే కీల‌క పాత్ర‌. గ‌డిచిన ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన పిల్లి అనంత‌ల‌క్ష్మి విజ‌యం సాధించారు. వైసీపీ త‌రుపున పోటీ చేసిన చెల్లుబోయిన వేణు మీద 9,048 ఓట్ల‌తో విజ‌యం సాదించారు. అదే స‌మ‌యంలో ఇక్క‌డ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కుర‌సాల క‌న్న‌బాబు ఏకంగా 43 వేల ఓట్లు సాధించ‌డం విశేషంగా చెప్ప‌వ‌చ్చు. ఇక మూడేళ్ల‌లో పిల్లి కుటుంబం అరాచ‌కాల మీద ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. కానీ సామాజ‌కివ‌ర్గాల అండ‌తో తాము గ‌ట్టెక్కాస్తామ‌ని ఆమె ఆశిస్తున్నారు. ఆమె భ‌ర్త స‌త్తిబాబు వ్య‌వ‌హారం వ్య‌తిరేక‌త‌కు కార‌ణంగా ఉంది. పార్టీలో ఆయ‌న‌దే హ‌వా. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లోనూ భార్య క‌న్నా భ‌ర్త పెత్త‌న‌మే బ‌హిరంగంగా క‌నిపిస్తుంది. ఇది కొంద‌రిలో ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌వుతోంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కూడా తోడ‌వుతోంది. అదే స‌మ‌యంలో వైసీపీకి ప్ర‌స్తుతం చెల్లుబోయిన వేణు స్థానంలో కుర‌సాల క‌న్న‌బాబు ఇన్ఛార్జ్ గా రావ‌డంతో ఆపార్టీకి ఊపు వ‌చ్చింది. క‌ద‌లిక క‌నిపిస్తోంది. పార్టీకి బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గం తోడు కావ‌డంతో క‌న్న‌బాబు ఆశ‌లు పెంచుకున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగా రాబోయే కాలంలో కార్యాచ‌ర‌ణ ఉంటే అవ‌కాశాలు సొమ్ము చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

7. కాకినాడ సిటీ: మ‌త్స్యకార సామాజిక‌వ‌ర్గం అండ‌తో మొన్న‌టి ఎన్నిక‌ల్లో వ‌న‌మాడి కొండ‌బాబు టీడీపీ త‌రుపున విజ‌యం సాధించారు స‌మీప వైసీపీ అభ్య‌ర్థి ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిని 24,000 ఓట్ల‌తో చిత్తు చేశారు. అప్ప‌ట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి వ‌ర్గం రౌడీయిజం, భూకబ్జాలు వ‌న‌మాడి విజ‌యానికి దోహ‌దం చేశాయి. కాపులు కూడా క‌లిసి రావ‌డంతో తిరుగులేని మెజార్టీ ద‌క్కింది. ఇక మూడేళ్లుగా ఇక్క‌డ ఎమ్మెల్యే వ్య‌వ‌హారం సొంత సామాజిక‌వ‌ర్గంలో వ్య‌తిరేక‌తకు దారితీస్తోంది. కాపులు దాదాపుగా దూర‌మ‌య్యారు. న‌గ‌రంలో వ్యాపార‌, వాణిజ్య వ‌ర్గాల్లో కూడా అసంతృప్తి క‌నిపిస్తోంది. అన్నింటిలోనూ ఎమ్మెల్యే అన్న‌దే పెత్త‌నం కావ‌డంతో ఆపార్టీ లో కూడా చీలిక క‌నిపిస్తోంది. కొండ‌బాబుకి వ్య‌తిరేకంగా కాపులు పావులు క‌దుపుతున్నారు. అదే స‌మ‌యంలో వైసీపీ కూడా వ్యూహం మార్చింది. న‌గ‌రంలో కాస్త ప‌ట్టున్న వైశ్య సామాజిక‌వ‌ర్గం నుంచి మాజీ మంత్రి ముత్తా కుటుంబాన్ని రంగంలో దింపింది. ముత్తా త‌న‌యుడు శ‌శిధ‌ర్ పార్టీ ఇన్ఛార్జ్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. కానీ ద్వారంపూడి వ‌ర్గం మాత్రం అడుగ‌డుగునా ఆటంకాలు క‌లిగిస్తోంది. పార్టీలో ఐక్య‌త మ‌చ్చుకు కూడా క‌నిపించ‌డం లేదు. శ‌శిధ‌ర్ కూడా రాజ‌కీయాల‌కు కొత్త కావ‌డంతో ఏమేర‌కు ప్ర‌భావం చూపిస్తుంద‌న్న‌ది సందేహంగా ఉంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌కు అనుగుణంగా కార్యాచ‌ర‌ణ క‌నిపించ‌డం లేదు. దాంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాకినాడ సిటీలో పోటీ హోరా హోరీగా సాగే అవ‌కాశమే క‌నిపిస్తోంది.


Related News

బాబుని కేసీఆర్ మాత్ర‌మే కాపాడాలి..!

Spread the loveఏపీలో తెలుగుదేశం రూటు మార్చింది. అందుకు త‌గ్గ‌ట్టుగానే టీడీపీ అధినేత‌తో పాటు పార్టీ శ్రేణుల ధోర‌ణి మారుతోంది.Read More

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the loveతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *