Main Menu

చంద్ర‌బాబు- నాలుగు ద‌శాబ్దాలు

Spread the love

నారా చంద్ర‌బాబు నాయుడు. సాధార‌ణ విద్యార్థిగా రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించి తెలుగు నాట రాజ‌కీయాల్లో కీల‌క‌భూమిక పోషించిన నాయ‌కుడు. అంద‌రిక‌న్నా అత్య‌ధిక కాలం ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన తెలుగువాడిగా గుర్తింపు పొందిన నేత‌. విశేష అనుభ‌వంతో దేశ‌వ్యాప్తంగానూ మంచి గుర్తింపు సాధించిన స‌మ‌ర్థుడు. కాంగ్రెస్ నుంచి రాజ‌కీయ ఆరంగేట్రం చేసి, సొంత మామ మీదే పోటీకి సిద్ద‌మ‌ని చెప్పి, చివ‌ర‌కు ఓట‌మి త‌ర్వాత పార్టీ మారిన నేప‌థ్యం నుంచి తిరిగి ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి పార్టీని త‌న వైపుకి త‌ప్పుకోవ‌డం వ‌ర‌కూ సాగిన చ‌రిత్ర చిన్న‌దేం కాదు. ఆ త‌ర్వాత టీడీపీ మీద సంపూర్ణ ఆధిపత్యం సాధించి, ఇప్పుడు వార‌సుడిగా నారా లోకేష్ ని ముందుకు తీసుకురావ‌డానికి వేస్తున్న అడుగుల వ‌ర‌కూ అనేక ప‌రిణామాలు ఆంధ్ర‌లోకం అంత‌టికీ తెలుసు.

అయితే చంద్ర‌బాబుకి విద్యార్థి ద‌శ నుంచి ఎస్వీ యూనివ‌ర్సిటీలో మొద‌ల‌యిన ప్ర‌స్థానంలో అండ‌గా నిలిచిన వారు ఆ త‌ర్వాత దూర‌మ‌య్యారు. కాంగ్రెస్ లో ఆయ‌నకు చేదోడుగా నిలిచిన వారు త‌ర్వాత శ‌త్రువుల‌య్యారు. టీడీపీలో కూడా తోడ‌ల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుతో నిత్యం త‌గాదాలు సాగి చివ‌ర‌కు ద‌గ్గుబాటి కూడా శ‌త్రుశిబిరంలో చేరారు. ఎన్టీఆర్ ని గ‌ద్దెదించ‌డంలో బాబు వెంట న‌డిచిన చాలామంది నేత‌లు ఆ త‌ర్వాత వ్య‌తిరేకంగా మారారు. చంద్ర‌బాబు క్యాంప్ లో ప‌నిచేసిన కేసీఆర్ ఆఖ‌రికి బాబు జీవితంలో చెరిగిపోని మ‌చ్చ‌గా మిగిలిన ఓటుకు నోటు కేసుకి మూల‌మ‌య్యారు. హైద‌రాబాద్ ని వీడి అమరావ‌తికి ప‌రిమితం అయ్యేలా చేశారు. ఒక‌నాడు న‌రేంద్ర‌మోడీ హైద‌రాబాద్ వ‌స్తే అరెస్ట్ చేస్తాన‌ని చెప్పిన చంద్ర‌బాబు, ఇప్పుడు ఆయ‌న అపాయింట్ మెంట్ కోసం ఏడాది పాటు క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురుచూడ‌క త‌ప్ప‌ని స్థితి దాపురించింది. ఇలా చంద్ర‌బాబు సుదీర్ఘ ప్ర‌స్థానంలో చాలామంది స‌న్నిహితులు, ప‌రిచ‌య‌స్తులు కూడా చంద్ర‌బాబు తీరుతో దూర‌మ‌యిన‌ట్టు చ‌రిత్ర చెబుతోంది. ముఖ్యంగా అంద‌రినీ అనుమానించే బాబు ధోర‌ణి గిట్ట‌ని చాలామంది నేటికీ టీడీపీలో ఉన్న‌ప్ప‌టికీ, సంపూర్ణంగా చంద్ర‌బాబు ని విశ్వ‌సించే ధోర‌ణి క‌నిపించ‌డం లేదు.

అయినా చంద్ర‌బాబు న‌ల‌భై ఏళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానం అస‌మాన్యంగా చెప్ప‌క త‌ప్ప‌దు. చంద్ర‌గిరి నుంచి గెలిచినప్ప‌టికీ ఒక ఓట‌మి త‌ర్వాత కుప్పం మారిన చంద్ర‌బాబు 1994 నుంచి అదే నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే చంద్ర‌బాబుకి బ‌ల‌హీన‌త‌ల క‌న్నా బ‌లమైన అంశాలు తోడ్ప‌డ్డాయి. ఎన్టీఆర్, ల‌క్ష్మీపార్వ‌తి వ్య‌వ‌హారం టీడీపీని ఆయ‌న చేతుల్లోకి తెచ్చింది. కాంగ్రెస్ నాయ‌క‌త్వ లోపం తొమ్మిదేళ్ల పాటు తిరుగులేని అధికారాన్ని సంపాదించిపెట్టింది. కానీ వైఎస్ హ‌వాతో 2004లో అధికారం దూరం అయినా 2009లో కూడా ఆయ‌న ఆశ‌లు నెర‌వేర‌క‌పోవ‌డంతో పార్టీ క‌ష్టాల్లో ప‌డింది. అయినా ప్ర‌త్యేక తెలంగాణా సాధ‌న పోరాటంలో ఏర్ప‌డిన సందిగ్ధం ఆయ‌న‌కు ఒక్క ప్రాంతంలోనైనా అనుభ‌వం రూపంలో అక్క‌ర‌కు వ‌చ్చింది. ప‌దేళ్ల విరామం త‌ర్వాత మ‌ళ్లీ పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టే ఛాన్స్ ద‌క్కింది. గ‌తంలో ప్ర‌పంచ బ్యాంక్ జీతగాడిగా ఆయ‌న మీద వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు త‌గ్గ‌ట్టుగానే ప్ర‌స్తుతం కూడా ఆయ‌న తీరు కొన‌సాగుతోంది. రాజ‌ధానిని సింగ‌పూర్ అంటూ చెప్పుకోవ‌డంతోనే స‌రిపోయింది. సోమ‌వారం పోల‌వ‌రంగా మార్చ‌డమే ఘ‌న‌తగా మారింది. ప్ర‌త్యేక హోదా చుట్టూ న‌డిచిన రాజ‌కీయంలో ప‌లుమార్లు మాట మార్చేయ‌డానికి ఆయ‌న ప్ర‌య‌త్నించాల్సి వ‌చ్చింది.

ఎలాంటి స‌మ‌స్య ఉన్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబుని భుజాన మోసే మీడీయా ఉండ‌డంతో బాబుకి కొండంత అండ అయ్యింది. ప్ర‌చారంతో ప్ర‌జ‌ల‌ను ఏమార్చ‌డానికి, అస‌లు స‌మ‌స్య‌ల నుంచి ప‌క్క‌దారి ప‌ట్టించ‌డానికి తోడ్ప‌డుతోంది. దానికి తోడు రిల‌యెన్స్ అంబానీ లాంటి వారి ఆశీస్సులుండ‌డంతో కార్పోరేట్ లాబీయింగ్ బాగా క‌లిసొచ్చింది. కేజీ బేసిన్ క‌ట్ట‌బెట్టిన దానికి ప్ర‌తిఫ‌లంగా చంద్ర‌బాబుకి మంచి చేదోడు అయ్యింది. మొత్తంగా కార్పోరేట్ సెక్ష‌న్, ప్ర‌ధాన స్ర‌వంతి మీడియా ఆయుధాలుగా చంద్ర‌బాబుకి అనుకూల‌త క‌నిపిస్తోంది. వాటి అండ‌తోనే వ‌చ్చే ఎన్నిక‌లు ఎదుర్కోవ‌డానికి ఆయ‌న స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. మ‌ళ్లీ విజ‌యం సాధిస్తే వార‌సుడికి ప‌ట్టం క‌ట్ట‌డం ఖాయం అని చెప్ప‌వ‌చ్చు.


Related News

బాబుకి కాలు అడ్డుపెడుతున్న కేసీఆర్!

Spread the loveతెలంగాణాలో వ‌ర‌సుగా రెండోసారి విజయం ద‌క్క‌డంతో కారు పార్టీ అధినేత ఉత్సాహం రెట్టింప‌య్యింది. ఎన్న‌డూ లేనంత జోష్Read More

మ‌రో మెగాబ్ర‌ద‌ర్ పొలిటిక‌ల్ ఎంట్రీ క్లియ‌ర్

Spread the loveమెగాస్టార్ చిరంజీవి సినిమా రంగంలో చ‌రిత్ర సృష్టించారు. ఆయ‌న్ని అనుస‌రిస్తూ ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ టాలీవుడ్ లో ఎంట్రీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *