Main Menu

టీడీపీ మెడ‌కు చుట్టుకున్న‌ట్టే!

Spread the love

అధికార పార్టీ అడ్డంగా బుక్క‌య్యింది. తొంద‌రపాటుతో పీక‌ల‌మీద‌కు తెచ్చుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. విశాఖ ఎయిర్ పోర్ట్ వ్య‌వ‌హారం పాల‌క‌ప‌క్షానికి పెద్ద త‌ల‌నొప్పిగా మారుతోంది. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌ద‌ర్శించిన హూందాత‌నం టీడీపీ నేత‌ల్లో క‌రువ‌వ్వ‌డంతో న‌ల‌భై ఏళ్ల అనుభ‌వం కూడా న‌ల‌భై ఏళ్ల వ‌య‌స్సున్న నాయ‌కుడు ముందు తేలిపోయిన‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో ఇప్పుడీ వ్య‌వ‌హారం నుంచి గ‌ట్టెక్కే మార్గం అన్వేషిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

వాస్త‌వానికి వైజాగ్ లో జ‌గ‌న్ మీద జ‌రిగిన దాడి ప‌క్కా ప్ర‌ణాళికాబ‌ద్ధ‌మ‌ని తాజాగా రిమాండ్ రిపోర్ట్ తేల్చేసింది. శ్రీనివాస్ ముందస్తుగానే జ‌గ‌న్ రాక‌పోక‌ల‌ను గ‌మ‌నించ‌డం నుంచి అత్యంత జాగ్ర‌త్త‌గా క‌త్తిని ఎయిర్ పోర్ట్ లోకి తీసుకెళ్ల‌డం వ‌ర‌కూ అన్నీ స్కెచ్ లో భాగంగా జ‌రిగిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌య్యింది. అంతేగాకుండా శ్రీనివాస్ కి ప‌లువురు స‌హాకారం అందించిన‌ట్టుగా కూడా క‌నిపిస్తోంది. ఒక్కొక్క‌రి పేర్లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. అయితే అందులో అంద‌రూ చిన్న‌చేప‌లే కావ‌డంతో అస‌లు కీల‌క సూత్ర‌ధారులు ఎవ‌ర‌నే సందేహాలు పెరుగుతున్నాయి.

ఈ విష‌యంలో అధికార ప‌క్షం అతిధీమాతో చేసిన హంగామా ఇప్పుడు అసలుకే ఎస‌రు తెచ్చేలా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వం ప‌ట్ల‌, పాల‌క‌ప‌క్ష నేత‌ల ప‌ట్ల అనుమానాలు బ‌ల‌ప‌రుస్తోంది. వైసీపీ వాద‌న‌కు త‌గ్గ‌ట్టుగా ఉన్న ప‌రిణామాల‌తో టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జ‌గ‌న్ మీద దాడిపై స్పందించ‌డంలో సీఎం హూందాత‌నం మ‌ర‌చిపోయారు. దాంతో వ్య‌వ‌హారం బాగా ముదిరింది. తొలుత మంత్రులు, డీజీపీ ఎలా మాట్లాడిన‌ప్ప‌టికీ సీఎం మాత్రం చాక‌చక్యంగా విష‌యంపై విచార‌ణ జ‌రుపుతామ‌ని, జ‌గ‌న్ దాడిని గ‌ర్హిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేసి ఉంటే స‌రిపోయేది. కానీ మ‌రో రెండ‌డుగులు ముందుకేసి డ్రామాలాడుతున్నారు…వాడు , వీడూ అంటూ నోరు జార‌డం, అంతా ఆప‌రేష‌న్ గ‌రుడ అంటూ క‌ట్టుక‌థ‌ల‌ను అధికార‌యుతం చేయ‌డం వంటి మాట‌ల‌తో నెత్తికెత్తుకున్నారు.

ఆ త‌ర్వాత లోకేష్ కూడా జ‌గ‌న్నాట‌కం అన‌డం, జ‌గ‌న్ మోడీ రెడ్డి అంటూ ట్వీట్లు చేయ‌డం వంటి ప‌రిణామాల‌తో టీడీపీ నేత‌లంతా ఎదురుదాడి సుర‌క్షిత‌మ‌ని భావించారు. కానీ చివ‌ర‌కు వ్య‌వ‌హారం బెడిసికొట్టింది. ఎన్నిక‌ల‌కు ఐదు నెల‌ల ముందు జ‌రిగిన ఈ ప‌రిణామాల్లో అధికార పార్టీని దోషిగా నిల‌బెట్టేలా ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. వ‌రుస‌గా లెట‌ర్, ఫ్లెక్స్, టీడీపీ స‌భ్య‌త్వం వంటి అన్ని విష‌యాల్లోనూ అధికార‌ప‌క్షం అబాసుపాల‌వుతోంది. అన్ని వేళ్లూ ఆపార్టీ వైపు చూపించేందుకు కార‌ణ‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ పాత్ర గురించి చ‌ర్చ లేవ‌దీసి జ‌గ‌న్ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టాల‌ని చేసిన ప్ర‌య‌త్నాలు కూడా ఫ‌లించ‌డం లేదు. మొత్తంగా చివ‌ర‌కు టీడీపీ వెబ్ సైట్ నుంచి గ‌తంలో మ్యానిఫెస్టో తొల‌గించిన‌ట్టుగా ప్ర‌స్తుతం జ‌నుప‌ల్లి శ్రీనివాస్ అనే నిందితుడు స‌భ్య‌త్వ వివ‌రాలు కూడా లేకుండా చేయాల్సిన ప‌రిస్థితి తెచ్చుకున్నారు. దాంతో వ్య‌వ‌హారం పాల‌క టీడీపీకి పెద్ద స‌మ‌స్య‌గా మారబోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఎలా గ‌ట్టెక్కుతారో చూడాలి.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *