Main Menu

బాబు సర్వేలో టీడీపీకి భారీ మెజార్టీ

Spread the love

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పునర్విభజనతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ 125, 130 స్థానాలు సాధించే అవకాశాలున్నట్లు ఆ పార్టీ ఢిల్లీ, బెంగళూరుకు చెందిన రెండు సర్వే ఏజెన్సీలలో చేయించిన సర్వేల్లో తేలింది. అయితే, రెడ్డి సామాజికవర్గ ప్రభావం ఉన్న జిల్లాలో మాత్రం వైసీపీకి కొంత మేరకు అనుకూలంగా ఉందని, కాపు-బ్రాహ్మణ సామాజికవర్గాలు పార్టీకి దన్నుగా ఉన్నారని ఆ రెండు సర్వేలలో తేలింది. దాదాపు 40-45 సిట్టింగు ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమయింది. ఆ వివరాలను పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు తన దావోస్ పర్యటనకు ముందు నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో కూడా వెల్లడించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 125 నుంచి 130 స్థానాల వరకూ గెలిచే అవకాశం ఉన్నట్లు రెండు ప్రముఖ జాతీయ సర్వే సంస్థలతో చేయించిన సర్వేల్లో వెల్లడయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నోయిడా, బెంగళూరుకు చెందిన ఈ సంస్ధలు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ వేయి మంది చొప్పున శాంపిల్స్ తీసుకుని, 20 ప్రశ్నలతో కూడిన ఫార్మెట్‌ను రూపొందించాయి. వయసు, విద్యార్హత, సామాజికవర్గాల ప్రాతిపదికన ఈ సర్వే నిర్వహించాయి.

50 శాతానికిపైగా ఓట్లతో టీడీపీ 125-130 సీట్లు సాధిస్తుందని పేర్కొన్నాయి. ముఖ్యంగా మహిళలు, చదువుకున్న యువత పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, బాబు సీఎంగా కొనసాగితేనే అమరావతి అభివృద్ధి చెందుతుందని, ఎమ్మెల్యేలు, మంత్రుల కంటే ఆయనే ఎక్కువ కష్టపడుతున్నారన్న అభిప్రాయం ఎక్కువమందిలో వ్యక్తమయింది. అయితే గృహనిర్మాణాలపై అసంతృప్తి ఉన్నట్లు తేలింది. చివరకు కార్యకర్తలు కూడా ఎక్కువమంది ఇదే వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే బాబు.. జిల్లాల వారీగా అధికారులకు లక్ష్యాలు నిర్దేశించడం ప్రస్తావనార్హం. దానితోపాటు నిరుద్యోగ యువతకు భృతిపై మెజారిటీ యువకులు అసంతృప్తితో ఉన్నారు. అందుకే నిరుద్యోగ భృతిపై విధి విధానాలను త్వరగా రూపొందించాలని బాబు మంత్రులను ఆదేశించినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో రాష్ట్రానికి గత కొంతకాలం నుంచీ ఐటీ కంపెనీలు వస్తుండటాన్ని ఇంజనీరింగ్ యువకులు స్వాగతిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులలో సానుకూలత శాతం పెరగగా, కింద స్థాయి ఉద్యోగులలో పని ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమయింది. చంద్రన్న బీమా, పెన్షన్లు, రేషన్ సరకులపై మెజారిటీ ప్రజలు ఎక్కువ సంతృప్తితో ఉండగా, అందులో మహిళలు, వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చంద్రన్నబీమాను మొదట తీసుకోవడానికి ఇష్టపడని వైసీపీ గ్రామస్థాయి కార్యకర్తలు ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారని అందులో తేలింది. పథకాల్లో చంద్రన్న బీమానే టాప్‌లో, తర్వాత పెన్షన్లు ఉండటం విశేషం. ప్రభుత్వ పథకాలపై దాదాపు 65 శాతం సంతృప్తి వ్యక్తమయింది. సర్వేల్లో పెన్షన్లపై వచ్చిన నివేదికలను ఆధారం చేసుకున్న తర్వాతనే.. ఒక ఇంట్లో ఎంతమంది లబ్ధిదారులున్నా వారికి పెన్షను ఇవ్వాలని బాబు నిర్ణయించడం ప్రస్తావనార్హం.

బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్ల ద్వారా లబ్ధి పొందుతున్న ఆ రెండు సామాజికవర్గాలు పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని, ముఖ్యంగా కాపులను బీసీల్లో చేర్చినందుకు, ఇటీవలి కాలం వరకూ పార్టీ-ప్రభుత్వంపై ఉన్న కాపు యువతలో కూడా సానుకూలత వ్యక్తమవుతోందని తేలింది. ఇదిలాఉండగా గుంటూరు, నెల్లూరు, ప్రకాశంతోపాటు రాయలసీమలో రెడ్డి సామాజికవర్గ ఆధిపత్యం ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ వైపు మొగ్గు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దర్శి మినహా ఆ ప్రాంతంలో ఉన్న రెడ్డి సామాజికవర్గంలో కొంత ప్రతికూల పరిస్థితి ఉన్నప్పటికీ, అక్కడ జగన్ ఎంపిక బట్టే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. దళితులలో కొంత మేరకు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. సుమారు 45 నియోజకవర్గాల వరకూ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల పనితీరు, వ్యక్తిగత వ్యవహార శైలిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తేలింది. ఇది గ్రహించిన తర్వాతనే.. మూడునెలల పాటు దళితవాడల్లో దళిత తేజం-తెలుగుదేశం కార్యక్రమం రూపొందించి, కార్యకర్తలను అందులో భాగస్వామ్యం చేయాలని బాబు నిర్ణయించినట్లు కనిపిస్తోంది. అదే విధంగా దావోస్ పర్యటన ముగింపు తర్వాత బలహీనంగా ఉన్న ఆ 40-45 నియోజకవర్గాలపై పూర్తి స్థాయి దృష్టి సారించాలని బాబు నిర్ణయించారు. వైసీపీ నుంచి ఫిరాయించిన 22 మంది నియోజకవర్గాల్లో కేవలం కొంతమందిపైనే సానుకూలత ఉంది. బీసీల్లో మెజారిటీ కులాలు, వైశ్య వర్గాల్లో మెజారిటీ సంఖ్య టీడీపీ వైపు మొగ్గుచూపుతుండగా, ప్రకాశం-కృష్ణా జిల్లాల్లో కమ్మ సామాజికవర్గంలో 20-30 శాతం వైసీపీ వైపు మొగ్గుచూపుతోంది. కాగా.. కొంతమంది ప్రముఖులు, వారి తనయులు, ఇతర కుటుంబసభ్యుల చర్యలతో పార్టీ తీవ్రంగా నష్టపోతోందని, వారి వల్ల పార్టీ సంప్రదాయ ఓటుబ్యాంకుతోపాటు, పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు కూడా దూరమవుతున్నారన్న ఆందోళన ఉంది. వారి చర్యల వల్ల చంద్రబాబు వ్యక్తిగత ఇమేజ్, పార్టీ ప్రతిష్ఠ కూడా దారుణంగా దెబ్బ తినే ప్రమాదం ఏర్పడింది. ఇలాంటి నియోజకవర్గాల్లో ఎంత పెద్ద ప్రముఖులయినా వారిని మార్చకపోతే ఓటమి తప్పదన్న హెచ్చరికలు కార్యకర్తల నుంచే వినిపిస్తున్నాయి. అలాంటి వారి విషయంలో మొహమాటం ప్రదర్శిస్తే, పార్టీ సీట్లు తగ్గే ప్రమాదం ఉందన్న హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అయితే అలాంటి వారికి టికెట్లు ఇస్తే కార్యకర్తలే ఓడించే పరిస్థితి నెలకొంది.


Related News

చంద్ర‌బాబు అభ్య‌ర్థుల క‌స‌ర‌త్తు ల‌క్ష్యం నెర‌వేరేనా?

Spread the loveఏపీలో తెలుగుదేశం పార్టీ గ‌తానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. చివ‌రి నిమిషం వ‌ర‌కూ ఊరించి, నామినేష‌న్ల గుడువు ముగిసిపోయేRead More

టీడీపీని వీడ‌బోతున్న మూడో ఎంపీ ఆయ‌నే..!

Spread the loveగోద‌వ‌రి జిల్లాల తెలుగుదేశం రాజ‌కీయాల్లో తోట బ్ర‌ద‌ర్స్ త‌ల‌నొప్పిగా త‌యార‌య్యారు. ఇప్ప‌టికే తోట త్రిమూర్తులు త‌న పార్టీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *