Main Menu

టీవీ5పై నిషేధం న్యాయ‌మేనా?

Spread the love

ప్ర‌జాస్వామ్యంలో ఫోర్త్ పిల్ల‌ర్ మీడియాకు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంటుంది. కానీ రానురాను అది తారుమార‌వుతోంది. మీడియా రూపం మారిన సోష‌ల్ మీడియా దూకుడు పెరిగిన త‌ర్వాత ప్ర‌ధాన స్ర‌వంతి మీడియాకు చిక్కులు తప్ప‌డం లేదు. ప్రింట్, ఎల‌క్ట్రానిక్ మీడియా అధిపతులు కొంద‌రు పాత ప‌ద్ధ‌తుల్లోనే ఆలోచిస్తూ తాము చెప్పిందే వేదం అన్న‌ట్టుగా సాగాల‌నుకుంటే సాధ్యం కాద‌ని అనేక ప‌రిణామాలు చాటుతున్నాయి. అయినా మార్పు రాని కొంద‌రికి ఇలాంటి నిషేధ నిర్ణ‌యాలు విఘాతంగా మారుతున్నాయి.

వాస్త‌వానికి మీడియా నిష్స‌క్ష‌పాతంగా ఉంటుంద‌నే మాట‌లో వీస‌మంత కూడా వాస్త‌వం ఉండ‌దు. ఎవ‌రో ఒక‌రిప‌క్షాన‌, వారి ప్ర‌యోజ‌నాలు కాపాడేందుకే మీడియా ఉంటుంది. ఏదో ఒక ఉద్దేశాల‌ను ప్ర‌సారం చేయ‌డానికే ప‌నికివ‌స్తుంది. కానీ పైకి మాత్రం తాము నిప్పు, మా అక్ష‌రాల‌న్నీ జ‌నం ప‌క్షం అని ఫోజులు పెడుతూ ఉంటారు. ప్ర‌స్తుతం మీడియా కార్పోరేట్ కాసుల కోసం వాటి బాసుల చుట్టూ తిరుగుతోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే వార్త‌ల స్థానంలో వ‌క్రీక‌ర‌ణ‌లు, విష‌యానికి బ‌దులుగా విష ప్ర‌చారాలు సాగుతున్నాయి.

తెలుగులో కూడా రియ‌ల్ ఎస్టేట్ స‌హా వివిధ రంగాల‌లో నాలుగు కాసులు వెన‌కేసిన కొంద‌రు ప్రారంభించిన టీవీ చానెళ్లు ఇప్పుడు హ‌వా చాటుతున్నాయి. వారి మీడియా క‌థ‌నాల‌ను జ‌నం సంపూర్ణంగా విశ్వ‌సించే అవ‌కాశం లేక‌పోయినా, ఒకే విష‌యాన్ని ప‌దే ప‌దే చెప్ప‌డం ద్వారా జ‌నం మెద‌ళ్ల‌లో తాము అనుకున్న‌ది ఎక్కించే య‌త్నంలో స‌ద‌రు చానెళ్లు తీవ్రంగా శ్ర‌మిస్తున్న‌ట్టు క‌నిపిస్తున్నాయి. ఈ త‌రుణంలోనే ఇప్ప‌టికే ఏబీఎన్ ని బ‌హిష్క‌రిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన వైసీపీ తాజాగా ఆ జాబితాలో టీవీ5ని కూడా చేర్చింది.

ఇప్ప‌టికే టీవీ5, మ‌హాటీవీ, టీవీ9 మీద ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌తంలోనే విరుచుకుప‌డ్డారు. తాజాగా వైసీపీ బ‌హిష్క‌ర‌ణ నిర్ణ‌యం మీద భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నిజానికి ఇలాంటి నిషేధం పెట్టేంత ఆగ్ర‌హం గ‌తంలోనే ప‌లు పార్టీల‌కు , నేత‌ల‌కు వ‌చ్చేది . కానీ అప్ప‌ట్లో ప్ర‌త్యామ్నాయం లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ ఆయా సంస్థ‌లనే ఆశ్ర‌యించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి స‌ద‌రు నేత‌ల‌ది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయి సోష‌ల్ మీడియా ఆధారంగానే రాజ‌కీయాలు న‌డిపే స్థాయికి రావ‌డంతో ఇలాంటి మీడియా సంస్థ‌ల‌ను ఖాత‌రు చేసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

స‌హ‌జంగా పాల‌క‌ప‌క్షం త‌న‌కు న‌చ్చ‌ని సంస్థ‌ల‌ను ప‌క్క‌న పెట్టి, అదుపు చేసే య‌త్నం చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు. గానీ ఏపీలో విప‌క్షాన్ని టార్గెట్ చేసిన మీడియా సంస్థ‌లుండ‌డ‌మే విడ్డూరం. వాటి ని బాయ్ కాట్ చేస్తున్న‌ట్టు విప‌క్ష పార్టీ ప్ర‌క‌టించ‌డం మ‌రో విచిత్రం. ఈ విష‌యంలో న్యాయానికి అవ‌కాశం లేదు. ఎవ‌రూ నీతిమంతులు కాన‌ప్పుడు ఎవ‌రికి ఎవ‌రూ న్యాయం చెప్ప‌గ‌లిగే ప‌రిస్థితి లేదు. గానీ మీడియా సంస్థ‌ల య‌జ‌మానులు తాము ఆడింది ఆట‌గా సాగుతుంద‌నే భ్ర‌మ‌లు వీడిక‌పోతే మాత్రం ఇలాంటివి మ‌రిన్ని ప‌రిణామాలు చూడాల్సి వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు.

అయితే ఇక్క‌డో కీల‌కాంశం ఏమంటే టీవీ5 ని గానీ ఏబీఎన్ ని గానీ వైసీపీ నిషేధించిన‌ప్ప‌టికీ ఇలాంటి ఫ్రీ చానెళ్లు వైసీపీ నేత‌లంద‌రి ఇళ్ల‌లోకి తొంగి చూసే అవ‌కాశం లేక‌పోలేదు. నిషేధం త‌మ ప్ర‌తినిధుల‌ను పంపించ‌డం వ‌ర‌కూ, త‌మ ప్రెస్ మీట్ల‌కు పిలిచేటంత వ‌ర‌కూ మాత్ర‌మే ఉంటుంద‌నడంలో సందేహం లేదు. సాక్షిని నిషేధించిన టీడీపీ అధినేత స‌ద‌రు ప‌త్రిక‌ను చ‌దువుతున్న దృశ్యాలు ఇప్ప‌టికే హ‌ల్ చ‌ల్ చేసిన త‌రుణంలో వైసీపీ శ్రేణులంతా ఆయా మీడియా గ్రూపుల కార్య‌క‌లాపాల‌ను చూడ‌కుండా ఉంటాయా అన్న‌ది అనుమానంగానే చెప్ప‌వ‌చ్చు.


Related News

డిజిట‌ల్ న్యూస్ లో టాప్ బ్రాండ్స్ ఇవే..!

Spread the loveదేశంలో ప్ర‌స్తుతం డిజిట‌ల్ మీడియా విస్త‌ర‌ణ‌కు మ‌రిన్ని అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మ‌రింత విస్త‌రించ‌డం ఖాయంగాRead More

టీవీ5పై నిషేధం న్యాయ‌మేనా?

Spread the loveప్ర‌జాస్వామ్యంలో ఫోర్త్ పిల్ల‌ర్ మీడియాకు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంటుంది. కానీ రానురాను అది తారుమార‌వుతోంది. మీడియా రూపంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *