Main Menu

10టీవీ స్కామ్ ఎన్ని కోట్లు..?

Spread the love

ఒక ప‌త్రిక‌లో ‘చందా..దందా’ అంటారు. మ‌రొక‌రు ‘రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం’ అంటారు. ఇంకొంద‌రు అడుగుముందుకేసి మీడియాలో మ‌రో ‘అగ్రిగోల్డ్’ అంటారు. అస‌లు ఇంత‌కీ 10టీవీ లో జ‌రిగిన స్కామ్ ఎంత‌..అస‌లు ఆ చానెల్ పేరుతో జ‌రిగిన అవినీతి, అక్ర‌మాల భాగోతం ఏంటి..క‌మ్యూనిస్టుల మీడియా వ్యాపారం ఎందుకు మ‌స‌క‌బారిపోయింది. మూణ్ణాళ్ల ముచ్చ‌ట‌గా ఎందుకు త‌యార‌య్యింది. తెలియాలంటే ఆరేడేళ్ల కింద‌కు వెళ్లాల్సిందే.

క‌మ్యూనిస్టులకు సొంతంగా ప‌త్రిక‌ల నిర్వ‌హ‌ణ కొత్త కాదు. స్వ‌తంత్ర్య‌పోరాట కాలంలోనే సొంత ప‌త్రిక‌లు స్థాపించారు. నిషేధాలు ఎదుర్కొన్నారు. ఆ త‌ర్వాత వార‌ప‌త్రిక‌లు, ర‌హ‌స్య‌ప‌త్రిక‌ల ద‌శ దాటి సొంత ప‌త్రిక‌లు స్థాపించుకుని వాటిని విస్త‌రించుకునే మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ప‌త్రిక‌ల ద‌శ దాటి మీడియా విస్త‌రించ‌డంతో సొంతంగా చానెల్ ఉండాల‌నే కాంక్ష ఆయా వ‌ర్గాల్లో పెరిగింది. అందుకు అనుగుణంగా పెట్టుబ‌డి పెట్టే వాళ్లు ఉండ‌రు కాబ‌ట్టి ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో ఓ చానెల్ పెట్టాల‌నే ఆలోచ‌న చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. అందుకు కేర‌ళ మార్గం కూడా తోడ్ప‌డి ఉంటుంద‌ని భావించ‌వ‌చ్చు. ఆ రాష్ట్రంలో కైర‌లీ పేరుతో సాగిన‌, సాగుతున్న ప్ర‌యోగం ఫలించింది. అది మ‌రింత ఉత్సాహాన్నివ్వ‌డంతో తెలుగు కామ్రేడ్స్ కూడా ఆ దారినే ఎంచుకున్నారు.

కానీ వ్య‌వ‌హారం ఆచ‌ర‌ణ‌లో భిన్నంగా ఉంది. దాంతో అనూహ్య ఫ‌లితాలు వ‌చ్చాయి. ఎలక్ట్రానికి మీడియాలో ప్రజాసమస్యలను ప్రసారం చేయటానికి ఒక చానల్ ని స్థాపించాలనే ఆలోచనతో వివిధ ప్రజా సంఘాలనుంచి మొత్తం 70కోట్ల రూపాయల‌ను సేక‌రించారు. ఆ ప్ర‌జాసంఘాల‌కు వారి స‌భ్యులు, సానుభూతిప‌రులు వాటాలుగా చెల్లించారు. దాంతో 10టీవీ చానెల్ ప్రారంభంలో ఊహించని స్పంద‌న మార్క్సిస్టుల‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. భారీగా పెట్టుబ‌డులు రావ‌డంతో చానెల్ ఏర్పాటు వ్య‌వ‌హారాలు పోనూ, మిగిలిన సొమ్ముల‌తో కొద్దిపాటి భూమి కొనుగోలు చేశారు. అయితే ఇక్క‌డే పెట్టుబ‌డుల సేక‌ర‌ణ‌లో ప‌లు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసిన‌ట్టు ఇప్పుడు కొంద‌రు గ‌గ్గోలు పెడుతున్నారు. నిజంగా అలాంటి ఆలోచ‌న ఉంటే ఇంత మందిని వాటాదారులుగా చేర్చుకుని విష‌యాన్ని విస్తృతం చేసుకుని ఉండేవారు కాదేమో. గుట్టుగా ఏ కొంద‌రో క‌లిసి వ్య‌వ‌హారం న‌డిపేవాళ్లేమో. అలాంటి ఆలోచ‌న లేదు కాబ‌ట్టి ప్ర‌జాభాగ‌స్వామ్యంతో ప్ర‌జ‌ల వాణి వినిపించే ప్ర‌య‌త్నంలో చానెల్ పుట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. అంత‌కుముందు ఎన్న‌డూ లేని అనుభ‌వం కార‌ణంగా పెట్టుబ‌డుల విష‌యంలో ప్ర‌గ‌తి, స్ఫూర్తి, అభ్యుద‌య వంటి కంపెనీలను ఏర్పాటు చేసి నిర్వ‌హ‌ణ‌కు పూనుకున్నారు.

ఎందుకిలా జ‌రిగింది?

అనుకున్నదానిక‌న్నా మిన్న‌గా 10టీవీ వెలుగు చూసింది. అనూహ్యంగా ప్ర‌జాద‌ర‌ణ పొందింది. ప‌లు చానెళ్ల‌కు పోటీగా నిలిచింది. టీఆర్పీల‌లో ఏకంగా రెండు, మూడు స్థానాల‌కు కూడా ఒక‌నొక ద‌శ‌లో ఎగ‌బాకింది . అదే స‌మ‌యంలో తన లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్న క్రమంలో అనేక అడ్డంకులను కూడా అధిగమించవలసి వచ్చింది. వాస్త‌వానికి ఎలక్ట్రానిక్ మీడియాలో లాభాలు రావటం అంత సులభం కాదని అచిరకాలంలోనే నిర్వాహ‌కుల‌కు తెలిసొచ్చింది. ప్ర‌జాశ‌క్తి అనుభ‌వం వేరు, ఎల‌క్ట్రానిక్ మీడియా చానెల్ వేరు అని త్వ‌ర‌గానే తేలిపోయింది. అంతేగాకుండా ఇత‌ర చానెళ్ల మాదిరిగా పెయిడ్ వార్త‌లు పోగేసి భారీగా దండుకోవ‌డానికి, ఇత‌ర వ్యాపార వ్య‌వహారాల‌కు ప్ర‌భుత్వం నుంచి భారీగా ప్ర‌యోజ‌నాలు ద‌క్కించుకోవ‌డానికి 10టీవీ లో సాధ్యం కాదు కాబ‌ట్టి త్వ‌ర‌గానే చేతులు కాల్చుకునే ద‌శ‌కు వ‌చ్చింది. మీడియాలో ఏ సంస్థ అయినా తొలి మూడేళ్ల నిర్వ‌హ‌ణ అత్యంత భారంగా ఉంటుంది. 10టీవీ కూడా అదే రీతిలో సుమారుగా 15 కోట్ల అప్పుల‌కు చేరింది. కోలుకుని బ్రేక్ ఈవెన్ ద‌శ‌కు వ‌స్తుంద‌నుకుంటున్న స‌మ‌యంలో నోట్ల‌ర‌ద్దు. జీఎస్టీ వంటి స‌మ‌స్య‌లు తోడ‌య్యాయి.

వాటితోపాటుగా వివిధ సందర్భాల్లో 10టీవీ నిక‌రంగా నిల‌బ‌డ‌డం, ప్ర‌జా స‌మ‌స్య‌లను ప్ర‌స్ఫుటించేలా చేయ‌డం ప‌లువురికి గిట్ట‌లేదు. చానెల్ మీద ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు మొద‌ల‌య్యాయి. చివ‌ర‌కు రేణుకా చౌద‌రి వంటి వారు ఆర్వోసీ కి ఫిర్యాదులు కూడా చేశారు. మీడియాలో ఇలాంటి కోఆప‌రేటివ్ ప‌ద్ధ‌తిలో చానెల్ ఏర్పాటు ప్ర‌యోగాత్మ‌కంగా సాగిన త‌రుణంలో దాని పీక‌నులిమే ప్ర‌య‌త్నాలు ప్ర‌తీ అడుగులోనూ సాగాయి. అయినా వెనుకాడ‌కుండా న‌ష్టాలు, ఆటంకాలకు ఎదురీదుతూ 10టీవీ సాగింది. ఆలోగా న‌ష్టాలు ఎక్కువ కావ‌డంతో క‌ష్టాల్లో ప‌నికొస్తాయ‌ని కొనుగోలు చేసిన భూముల‌ను అమ్మి చానెల్ న‌డ‌పాల్సిన పరిస్థితి వ‌చ్చింది. దానినే రియ‌ల్ ఎస్టేట్ అంటూ చిత్రీక‌రించేందుకు కొంద‌రు పూనుకున్నారు. అయితే రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత మారిన ప‌రిస్థితుల్లో భూముల ధ‌ర‌ల పరిస్థితుల్లో మార్పులు కూడా అంద‌రికీ తెలిసిందే

వాటాదారుల ప‌రిస్థితి ఏమిటి?

అయితే చానెల్ కొన‌సాగించాల‌ని స‌ద‌రు పార్టీ నేత‌లు ఆశించినా, ప‌లు ర‌కాల ప్ర‌చారాలు సాగుతున్న త‌రుణంలో వాటాదారుల్లో కూడా సందేహాలు పెరిగాయి. చివ‌ర‌కు త‌మ షేర్లు గురించి ఒత్తిడి పెరిగింది. దాంతో అంతిమంగా చానల్ ను రక్షించటానికి అన్ని ప్రయత్నాలు విఫలమైన తరువాత అమ్మ‌కం పెట్టాల్సిన ప‌రిస్థితి దాపురించిన‌ట్టు క‌నిపించింది. దానికి కూడా ప‌లు వాద‌న‌లున్నాయి. మార్కెట్లో పెడితే మ‌రింత ధ‌ర వ‌చ్చేది క‌దా అనే వాళ్లు కూడా లేక‌పోలేదు. కానీ చానెల్ ప‌రిస్థితి, 1.8ల‌క్ష‌ల మంది వాటాలు పెట్టిన వారి విష‌యం ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని చివ‌ర‌కు న‌ష్టాల‌కే చానెల్ అమ్మ‌కం జ‌రిగిన‌ట్టు క‌నిపిస్తోంది. సుమారుగా 25 శాతం న‌ష్టాలు పాల‌యిన‌ట్టుగా చెప్ప‌వ‌చ్చు.

అయినా వాటాదారుల‌కు షేర్లు పంపిణీలో ఎవ‌ర‌కీ స‌మ‌స్య రాకుండా చూడాల‌ని మార్క్సిస్టు పార్టీ క‌మిటీలు నిర్ణ‌యించిన‌ట్టుగా నిర్వాహ‌కులు చెబుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా వాటాల పంపిణీ జ‌రుగుతోంది. ఇప్పటికే ల‌క్ష‌మందికి పైగా తిరిగి చెల్లించటం జరిగిందని, మిగిలిన 70వేల మందికి కూడా షేర్ సర్టిఫికేట్లను పరిశీలించి ఇవ్వవలసిన డబ్బును చెల్లించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ క‌మ్యూనిస్టుల మీద వ్య‌తిరేక‌త‌, 10టీవీ కి ల‌భించిన ఆద‌ర‌ణ‌తో పెరిగిన అసూయ‌, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చిత్త‌శుద్ధితో సాగించిన కృషి అంటే గిట్ట‌ని వాళ్లు ప‌లు రూపాల్లో వ‌క్ర‌భాష్యాలు చెబుతూ చానెల్ మీద నింద‌ల పేరుతో క‌మ్యూనిస్టులను టార్గెట్ చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈలోగా ప‌లు ఫిర్యాదులు సీపీఎం కేంద్ర క‌మిటీ నేత‌ల‌కు చేరిన విష‌యాన్ని ఆపార్టీ ఆలిండియా కార్య‌ద‌ర్శి మీడియాతో మీడియాకు వెల్ల‌డిస్తే, దానిని కూడా గోరింత‌లు కొండింత‌లు చేసేందుకు కొంద‌రు చేస్తున్న ప్ర‌య‌త్నం విస్మ‌య‌క‌రంగా ఉంది.

స‌ర్వ‌శ‌క్తులూ ఉన్న కార్పోరేట్ సంస్థ‌లే సొంత మీడియా సంస్థ‌ల నిర్వ‌హ‌ణ‌లో చేతులెత్తేస్తున్న ద‌శ‌లో క‌మ్యూనిస్టులు ఓ మీడియా చానెల్ కోసం చేసిన ప్ర‌య‌త్నం విక‌టించ‌డంలో పెద్ద వింతేముంటుంది. అయినా జ‌నం న‌ష్టాలు పాలుకాకుండా చూసేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు చిత్త‌శుద్ధితో సాగిస్తున్న తీరు వారి నిబ‌ద్ధ‌త‌కు నిద‌ర్శ‌నంగా కొంద‌రు భావిస్తున్నారు. దానిని ఓ పెద్ద కుంభ‌కోణం అంటూ క‌హానీలు అల్లుతున్న వారి మాట‌లు క‌ల‌క‌లం చెల్లుతాయ‌ని భావించ‌లేం. ఈ దుష్ప్ర‌చారాన్ని వాటాదారులు సోష‌ల్ మీడియా సాక్షిగా తిప్పికొడుతున్నారు. త‌మ వాటా ధ‌నం త‌మ‌కు ముట్టింద‌ని పోస్టులు చేస్తున్నారు. కానీ కందుకు లేని దుర‌ద క‌త్తిపీట‌కు వ‌చ్చింద‌న్న‌ట్టుగా కొంద‌రు చిత్ర విచిత్ర వ్యాఖ్యానాల‌తో ర‌క‌ర‌కాల క‌థ‌నాలు రాస్తూ ప్ర‌జ‌ల్లో అపోహ‌లు క‌లిగించే ప్ర‌య‌త్నం చేయ‌డం , అందుకోస‌మై అక్క‌డ లేని చందాల‌ను, త‌మ‌కు తెలిసిన దందాల‌ను అంద‌రికీ ఆపాదించ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్న‌మే ఆశ్చ‌ర్యంగా ఉంది. వంద‌ల‌, వేల కోట్లు స్కాములు చేసి ద‌ర్జాగా తిరుగుతున్న వాళ్లని వ‌దిలేసి 70 కోట్ల రూపాయ‌ల వాటాల సేక‌ర‌ణ‌లో ఇప్ప‌టికే మూడొంతులు తిరిగి చెల్లించి, మిగిలిన వాళ్ల విష‌యంలో నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేస్తున్న వారిపై రాళ్లేయ‌డం వెనుక కార‌ణాలు ఆలోచిస్తే అర్థం కావ‌డానికి పెద్ద స‌మ‌యం ప‌ట్ట‌క‌పోవ‌చ్చు. జ‌నం సొమ్ము మింగేస్తున్న వాళ్ల‌ను మొన‌గాళ్ల‌గానూ, ఎవ‌రి డ‌బ్బులు వారికి తిరిగి చెల్లిస్తుంటే దానిని స్కామ్ గానూ చిత్రీక‌రించే య‌త్నంలో త‌ల‌మున‌క‌లైన వాళ్ల తీరు వారి అస‌లు నైజానికి త‌గ్గ‌ట్టుగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Related News

పుంజుకున్న సాక్షి టీవీ: పొలిటిక‌ల్ సంకేత‌మేనా?

Spread the loveతెలుగు మీడియాలో బార్క్ రేటింగ్స్ కి పెద్ద‌గా ప్రాధాన్య‌త లేక‌పోవ‌చ్చు గానీ వాటికున్న గుర్తింపు వాటికుటుంద‌న‌డంలో సందేహంRead More

ఈవీఎం వ్య‌వ‌హారంలో విలేక‌రుల‌పై కేసు!

Spread the loveఈవీఎం ల వ్య‌వ‌హారం ముదురుతోంది. మీడియా మెడ‌కు చుట్టుకుంది. ప‌లువురిపై కేసు కూడా న‌మోద‌య్యింది. మొన్న‌టి సాధార‌ణRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *