Main Menu

మీడియాలో క‌మ్యూనిస్టుల‌ ‘లెప్ట్’..!

Spread the love

మీడియాలోనే కాదు..అన్ని రంగాల్లోనూ మార్పు అనివార్యం. అది నిత్యం జ‌రుగుతూనే ఉంటుంది. అయితే ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా, ప్ర‌జ‌లంద‌రి ప్ర‌యోజ‌నాల‌క‌నుగుణంగా సాగితే అది స‌మాజ వికాసానికి దారితీస్తుంది. కానీ దానికి భిన్నంగా కొంద‌రి ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా కార్పోరేట్ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా ప‌రిణామాలు మారుతుంటే అది పెనుముప్పున‌కు సంకేతంగా భావించ‌వ‌చ్చు. ఇక మీడియాలో ఈ మార్పు మ‌రింత న‌ష్టం చేకూరుస్తుంది. వాస్త‌వానికి మీడియా అంటే ప్ర‌జాభిప్రాయం వినిపించే సాధ‌నం అనుకున్న‌ప్పుడు , అందులో అన్ని త‌ర‌గ‌తుల‌కు, అన్నివ‌ర్గాల‌కు ప్రాతినిథ్యం ఉండాలి. అందులోనూ సామాన్యుల‌కు, అట్ట‌డుగువ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఉండాలి. అప్పుడే అది ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధం అని చెప్ప‌డానికి అవ‌కాశం ఉంటుంది. కానీ ప్ర‌స్తుతం దానికి భిన్నం. అభిప్రాయాల‌ను రూపొందించేందుకే మీడియా అన్న‌ట్టుగా మారిపోయింది. కొన్ని త‌ర‌గతుల ప్ర‌జ‌ల‌ను త‌మ‌క‌నుకూలంగా మ‌లుచుకునే ఉద్దేశంతో వార్త‌ల ప్ర‌సారం, ఇత‌ర రూపాల్లో ప్ర‌య‌త్నిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే స‌మాచార పంపిణీ క‌నిపిస్తోంది.

ఏపీలో ఇప్ప‌టికే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత పాద‌యాత్ర‌కు త‌గిన ప్రాధాన్య‌త ద‌క్క‌డం లేదు. చంద్రబాబుకి అనుకూలంగా ఉన్న కాలంలో ద‌క్కిన ప్ర‌చారం ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి లేకుండా పోయింది. దానికి కొన‌సాగింపుగానే తాజాగా వామ‌ప‌క్షాల మ‌హాగ‌ర్జ‌న‌కు అస‌లు మీడియాలో చోటు లేకుండా పోయింది. విజ‌య‌వాడ న‌గ‌రంలో సుమారు ల‌క్ష‌మంది సామాన్య జ‌నాల‌ను, ఎటువంటి ప్ర‌లోభాలు లేకుండా స‌మీక‌రించి ఉభ‌య క‌మ్యూనిస్టు పార్టీలు మ‌హా ప్ర‌ద‌ర్శ‌న‌, స‌భ నిర్వ‌హిస్తే మీడియాలో ఆన‌వాళ్లు కూడా క‌నిపించ‌లేదు. అంత పెద్ద స‌భ జ‌రుగుతుంద‌ని తెలిసినా సాక్షి, ఆంధ్ర‌జ్యోతి వంటి ప‌త్రిక‌లు క‌నీసం కూడా క‌ర్టెన్ రైజ‌ర్ వార్త‌ని ఇవ్వ‌కుండా నిర్ల‌క్ష్యం చేశాయి. అదే రీతిలో ఈనాడు నామ‌మాత్రంగా చిన్న వార్త‌తో స‌రిపెట్టి చేతులు దులుపుకుంది.

ఇక ప్ర‌ద‌ర్శ‌న‌, స‌భ జ‌రిగిన సంద‌ర్భంగా చానెళ్ల క‌వ‌రేజ్ మ‌రీ విడ్డూరం. ల‌క్ష మందితో ఓ స‌భ రాజ‌ధాని న‌గ‌రంలో జ‌రుగుతుంటే కేవ‌లం ఏపీ 24*7 చానెల్ మిన‌హా లైవ్ క‌వ‌రేజ్ ఇచ్చిన దాఖ‌లాలు లేవు. ఎన్టీవీ మాత్రం త‌న ఫేస్ బుక్ పేజ్ క‌వ‌రేజ్ తో స‌రిపెట్టింది. ఇక ప‌త్రిక‌ల్లో ఈనాడు, ఆంధ్ర‌జ్యోతికి ఆ వార్త పెద్ద ప్రాధాన్య‌త‌గానే క‌నిపించ‌లేదు. సాక్షి మాత్రం మొద‌టి పేజీలో కొంత స్థ‌లం కేటాయించింది. ఈనాడు 11వ పేజీలో ఓ చిన్న వార్త‌ను ప్ర‌చురించ‌డం విశేషం. వాస్త‌వానికి రాజ‌కీయంగా ప్ర‌స్తుతం వామ‌ప‌క్షాలు భిన్న‌మైన వైఖ‌రి తీసుకోవ‌డం దానికి కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు. ఏపీలో అటు వైసీపీ, ఇటు టీడీపీపై ఏక‌కాలంలో విమ‌ర్శ‌లు చేస్తూ ప్ర‌త్యామ్నాయం అంటూ జ‌న‌సేన‌తో క‌లిసి అడుగులేస్తామ‌ని వామ‌ప‌క్షాలు చెబుతున్నాయి. దానికితోడు విజ‌య‌వాడ‌లో స‌భ‌లో లోక్ స‌త్తా, ఆప్, బీఎస్పీ స‌హా వివిద పార్టీలు పాల్గొన్నాయి. ఈ నేప‌థ్యంలో వామ‌ప‌క్షాల స‌భ అటు అధికార‌ప‌క్ష అనుకూల మీడియాకి ఇటు విప‌క్ష సానుకూల మీడియాకు కూడా ప‌ట్ట‌రాని అంశంగా మారింది. అందుకు త‌గ్గ‌ట్టుగానే క‌వ‌రేజ్ క‌నిపిస్తోంది. అంతేగాకుండా క‌మ్యూనిస్టులు న‌డిపిన రెండు చానెళ్లు ఇప్పుడు కార్పోరేట్ల చేతుల్లో పెట్ట‌డంతో సొంత చానెళ్లు లేక‌పోవ‌డం కూడా వారికి త‌గిన క‌వ‌రేజ్ ద‌క్క‌క‌పోవ‌డానికి మ‌రో కార‌ణంగా క‌నిపిస్తోంది. మొత్తంగా మీడియాలో ప్ర‌దాన ప్ర‌తిప‌క్షాల‌కే చోటు లేన‌ప్పుడు క‌మ్యూనిస్టుల‌కు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని ఆశించ‌డం అత్యాశే అవుతుందేమో


Related News

రామోజీ..! ఇదేనా ప‌ద్ధ‌తి ?

Spread the loveఈనాడు..తెలుగు మీడియాలో నేటికీ చాలామంది ఆ సంస్థ‌ల విలువ‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ఉంటారు. అంతో ఇంతో పాత్రికేయ సూత్రాల‌కుRead More

పుంజుకున్న సాక్షి టీవీ: పొలిటిక‌ల్ సంకేత‌మేనా?

Spread the loveతెలుగు మీడియాలో బార్క్ రేటింగ్స్ కి పెద్ద‌గా ప్రాధాన్య‌త లేక‌పోవ‌చ్చు గానీ వాటికున్న గుర్తింపు వాటికుటుంద‌న‌డంలో సందేహంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *