జర్నలిస్టుల కొత్త అవతరాలు

journalists-quotes-4
Spread the love

పాత్రికేయులు పరిణతి సాధిస్తున్నారు. కొత్త రూపాల్లో కనిపిస్తున్నారు. గతానికి భిన్నంగా ఇటీవల ఇది జోరందుకుంది. సాధారణ జర్నలిస్టులు కూడా ఉన్నత స్థానాలకు చేరుతున్నారు. రాజకీయ అనుబంధాలతో సాగడమే దానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. నేతలతో సన్నిహిత సంబంధాలు నెరపడం తోడు కావస్తుండవచ్చు. కానీ పాత్రికేయులు మాత్రం పలు పదవులను అధిరోహిస్తున్నారు. ఈ పరిణామక్రమం గతంలో వైఎస్ ఉన్నప్పుడు ప్రాధమికంగా ప్రారంభం కాగా తెలంగాణాలో జోరందుకుంది. అప్పట్లో ఈనాడులో పనిచేసిన దిలీప్ రెడ్డి ని సహ చట్టం పదవి వరించగా ఆ తర్వాత అదే దిలీప్ రెడ్డి సాక్షి సంస్థల్లో కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. అమర్ వంటి వాళ్లు కూడా అదే తంతు.

ఇక తెలంగాణా ఆవిర్బావం తర్వాత అల్లం నారాయణ కి ప్రెస్ అకాడమీ పదవి దక్కింది. గటిక విజయ్ కుమార్ కి సీఎం కోటరీలో చోటు దక్కింది. తాజాగా ట్రాన్స్ కో లో ఉన్నత పదవి ఆయనకు కేటాయించారు. అల్లం నారాయణ కేసీఆర్ కి చెందిన నమస్తే తెలంగాణా నుంచి , విజయ్ కుమార్ టీ న్యూస్ నుంచి ప్రభుత్వ పదవుల్లోకి వెళ్లడం విశేషం. వనం జ్వాలా నరసింహరావు, ఆయన కుమార్తె ప్రేమ వంటి వారు కూడా అదే కోవలో ఉంటారు. ఇక తాజాగా దొంతు రమేష్ అనే టీవీ9 వరంగల్ విలేకరికి సెన్సార్ బోర్డ్ పదవి కేటాయించారు. అంతేగాకుండా సుదీర్ఘకాలం పాటు ఆంధ్రభూమిలో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు బుద్ధా మురళీ కూడా సహ చట్టం కమిషనర్ పదవి దక్కించుకున్నారు. కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యమే ఆ పదవికి కారణమని చెప్పవచ్చు.

ఇక ఏపీలో కూడా అదే పరిస్థితి. ఇప్పటికై ఎంఎల్వోల పేరుతో పలువురిని ముఖ్యంగా టీడీపీ అనుకూల జర్నలిస్టులను ప్రభుత్వ శాఖల్లో తీసుకున్నారు. ఆ తర్వాత మరికొందరిని సమాచార శాఖలో వివిధ పోస్టుల్లో తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా సమాచార హక్కు చట్టం కమిషనర్ గా సీనియర్ జర్నలిస్టులకు అవకాశం కల్పించడానికి రంగం సిద్ధమయ్యింది. తాజాగా నోటిఫకేషన్ విడుదల చేసిన ముగ్గుర సభ్యుల సహ చట్టం కమిషనర్ పోస్టుల్లో ఇద్దరి పేర్లు దాదాపు ఖాయం అయ్యాయి. వారిలో ఈనాడు ప్రతినిధి ఒకరు కాగా, ఆంధ్రజ్యోతి చానెల్ లో విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న రామారావు మరొకరని సమాచారం. వారిద్దరికీ సహ చట్టం కమిషన్లుగా అవకాశం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రభుత్వ పదవులకు తోడుగా ప్రభుత్వ పెద్దల అండతో మరికొందరు కీలక స్థానాలకు చేరుకుంటున్నారు. ఏపీ టైమ్స్ పేరుతో వెంకట క్రుష్ణ చానెల్ ప్రయత్నాల వెనుక కొందరు టీడీపీ పెద్దల హస్తం ఉందనడంలో సందేహం లేదు. దానికి మించి తాజాగా మారెళ్ల వంశీక్రుష్ణ అనే టీడీపీ అనుకూల జర్నలిస్టు సంఘం నాయకుడు మహాటీవీలో ఎండీ స్థాయికి ఎదిగిపోవడంలో టీడీపీ ఎమ్మెల్యే ఒకరున్నారని సమాచారం. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే మహాటీవీని కొనుగోలు చేసి వంశీక్రుష్ణకి బాధ్యతలు అప్పగించారు. దాంతో సాధారణ జర్నలిస్టుగా అమరావతిలో అడుగుపెట్టి, జర్నలిస్టు సంఘం పెట్టి నాయకుడిగా ఎదిగి, ఇప్పుడు ఓ సంస్థకి కీలక నిర్వాహకుడిగా మారడంలో ఆయన సామాజిక నేపథ్యంతో పాటు సర్కారీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం బాగా ఉపయోగపడిందని చెప్పకవచ్చు.

మొత్తంగా జర్నలిస్టులు కొత్త రూపాల్లో, సరికొత్త అవకాశాలను వెదుక్కుంటున్నారన్న వాస్తవం బోధపడుతుంది. దానికి తగ్గట్టుగా వారికి అవకాశాలు కల్పించడానికి కూడా కొందరు సిద్ధపడుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారిని ప్రోత్సహిస్తూ తమ అవకాశాలు మెరుగుపరుచుకునే పనిలో పార్టీల పెద్దలున్నారు. దాంతో ఈ పరిణామం మీడియాలో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *