Main Menu

పెళ్లికి పన్ను భారమాయే..!

Spread the love

ప్రతి ఒక్కరి జీవితం మధురానుభూతిగా మిగిలిపోయే వివాహ వేడుకకు జీఎస్‌టీ భారంగా పరిణమించింది. ఎంత కష్టమైనా..ఎన్ని అప్పులైనా వివాహాన్ని ఉన్నంతలో ఎంతో ఆర్భాటంగా చేయాలని అందరూ భావిస్తారు. జీవితంలో అత్యంత కీలకమైన వివాహ ఘట్టాన్ని జీవితాంతం మధురస్మృతిగా గుర్తుండేలా వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించేలా ప్రతి ఒక్కరూ తాపత్రయపడతారు. సాధారణంగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు పెళ్లి చేస్తున్నారంటే ఎంతో కొంత అప్పు చేయక తప్పదు. నగదు రూపంలో కాకపోయినా వస్తువులు, ఇతర కొనుగోళ్లు, చెల్లింపులు..ఇలా ఏదో రూపంలో అప్పు చేయడమో, లేక అరువుకు తీసుకురావడమో చేస్తుంటారు. ఇలాంటి వివాహ వేడుకలకు జీఎస్‌టీ భారంగా మారింది.

మార్గశిర మాసం ప్రారంభంలో ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయి. పెళ్లిళ్లకు 23, 24, 25వ తేదీలలో ముహూర్తాలు ఉండటంతో జిల్లా పరిధిలో సుమారు ఆరువేలకు పైగా వివాహాలు జరగబోతున్నాయి. ఈ ముహూర్తాలు గడిచిపోతే వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు లేకపోవడంతో పెళ్లి కుదిరిన వారు ఈ ముహూర్తాలలోనే చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ముహూర్తాలలో వివాహం చేసేందుకు వీలుగా చాలావరకు రెండునెలల క్రితమే ఫంక్షన్‌హాల్స్, కేటరింగ్, వివాహ తంతు నిర్వహించే పురోహితులను మాట్లాడుకున్నారు. అవసరమైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేయగా, వివాహ వేదిక అలంకరణకు డెకరేషన్, విందు భోజనానికి కేటరింగ్ నిర్వాహకులకు ఫొటోలు, వీడియోగ్రఫీకి ఇదివరకే ఆర్డర్లు ఇచ్చేశారు.

ప్రస్తుతం వివాహం చేయాలంటే ఎంతలేదన్నా రూ.5 లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఖర్చుకావడం సర్వసాధారణం. పేదలైతే రూ.5 లక్షలు, మధ్యతరగతి ప్రజలైతే రూ.15లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. జీఎస్టీ ప్రభావంతో రూ.5 లక్షలు ఖర్చు చేసే వారిపై అదనంగా మరో లక్ష రూపాయల వరకు ఆర్థికంగా భారం పడుతుండగా, రూ.10 లక్షలు ఖర్చు చేసే వారిపై అదనంగా రూ.2 లక్షలు, రూ.15 లక్షలకు మించిచే అదనంగా రూ.3 లక్షలు భారం పడుతోంది. బంగారు ఆభరణాలపై 3శాతం జీఎస్‌టీ విధిస్తుండగా, శుభలేఖలపై 12శాతం జీఎస్‌టీ ఉంది. ఫంక్షన్‌హాల్స్, డెకరేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ తదితర వివాహ సేవలు 18శాతం జీఎస్‌టీ పరిధిలో ఉన్నాయి.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *