Main Menu

వైసీపీ వ్యూహాత్మ‌క త‌ప్పిద‌మేనా?

Spread the love

రాజ‌కీయాల్లో కొన్ని నిర్ణ‌యాల మూలంగా క‌లిగే న‌ష్టం తాత్కాలిక‌మే. కానీ మ‌రికొన్ని చ‌ర్య‌ల‌తో దీర్ఘ‌కాలం ఫ‌లితాలు అనుభ‌వించాల్సి ఉంటుంది. గ‌డిచిన ఎన్నిక‌లకు ముందు త‌న‌తో పొత్తుల కోసం క‌మ‌ల‌నాధులు చేతులు చాసినా కాదు పొమ్మ‌న్నందుకు ఆ త‌ర్వాత జ‌గ‌న్ పాశ్చాత్తాపం ప‌డాల్సి వ‌చ్చింది. అలాంటి అనుభ‌వాలు అనేకం ఉంటాయి. అంద‌రికీ ఉంటాయి. కానీ తాజాగా ఏపీ అసెంబ్లీ స‌మావేశాల విష‌యంలో వైఎస్సార్సీపీ వ్యూహాత్మ‌కంగా త‌ప్పిదానికి పాల్ప‌డిన‌ట్టేన‌ని ప‌లువురు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ ప‌క్షం పూర్తిగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ఉన్న ద‌శ‌లో మ‌రింత ఎదురుదాడికి అసెంబ్లీ వేదిక అవ‌కాశం క‌ల్పిస్తుంది. అయినా దానిని వినియోగించుకోవ‌డంలో జ‌గ‌న్ విఫ‌ల‌మ‌య్యార‌ని భావించ‌వ‌చ్చు.

ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా, ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యంలో చంద్ర‌బాబు రాజీప‌డ్డార‌నే విష‌యంలో మెజార్టీ అంగీక‌రిస్తోంది. కానీ అంద‌రూ అదే తీరు క‌దా అనే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో హ‌స్తిన‌లో ఆందోళ‌న ద్వారా వైసీపీకి కొంత మొగ్గు క‌నిపించింది. దానికి కొన‌సాగింపుగా ఏపీ అసెంబ్లీని వినియోగించుకుని ఉంటే మ‌రింత మెరుగ్గా ఉండేద‌నేది ప‌లువురి అభిప్రాయం. ఫిరాయింపుల కార‌ణంగా అసెంబ్లీని బ‌హిష్క‌రిస్తున్న‌ట్టు శీతాకాల స‌మావేశాల్లో తీసుకున్న నిర్ణ‌యాన్ని జ‌గ‌న్ కొన‌సాగించారు. కానీ ఇప్పుడు మాత్రం అసెంబ్లీకి వెళ్ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి వైసీపీది. ఎలానూ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అసెంబ్లీకి హాజ‌రుకావాల్సి ఉంది. అలాంటి స‌మ‌యంలో ఫిరాయింపుల‌నే కార‌ణం చూపించి దూరంగా ఉండ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నం క‌న్నా హోదా విష‌యంలో దూకుడు కొన‌సాగించి స‌భ‌లో పాల‌క‌ప‌క్షాన్ని మ‌రింత ఇర‌కాటంలో పెట్ట‌డానికి ఉన్న అవ‌కాశాన్ని వినియోగించుకుంటే మ‌రింత మెరుగ్గా ఉండేద‌న‌డం కాద‌న‌లేని స‌త్యం.

ఫిరాయింపుల విష‌యం ఎలా ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని మీద అన‌ర్హ‌త వేటు వేయ‌డానికి త‌గ్గ‌ట్టుగా ప్ర‌భుత్వాన్ని ఒత్తిడి పాలు చేయ‌డం కూడా జ‌రిగేది. కీల‌కంగా మారిన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల ముందు ఒక్క స‌భ్యుడు చేజారినా అది టీడీపీని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేస్తుంది. మూడో అభ్య‌ర్థి విష‌యంలో వైసీపీకి కొంత లైన్ క్లియ‌ర్ అయ్యేది. దానికి త‌గ్గ‌ట్టుగా కోర్ట్ తీర్పు ఆధారంగా స‌భ‌లో నానా ర‌చ్చ చేయ‌డానికి దోహ‌ద‌ప‌డేది. అయిన‌ప్ప‌టికీ పిరాయింపుల విష‌యంలో రాజీప‌డేది లేద‌ని వైసీపీ భీష్మించుకుని కూర్చోవ‌డం ద్వారా చింత‌మ‌నేని వంటి వారికి కొంత ఊర‌ట‌గా చెప్ప‌వ‌చ్చు. స్పీక‌ర్ దాట‌వేత ధోర‌ణికి దోహ‌ద‌ప‌డుతోంది. త‌ద్వారా వైసీపీ మ‌రింత ప‌గ‌డ్భందీగా వ్య‌వ‌హ‌రించాల్సిన స్థితి వ‌చ్చింది. అయితే వైసీపీకి కూడా కొన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చేవి. ముఖ్యంగా ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభ‌ప‌ర‌చ‌డానికి టీడీపీకి ఒక అవ‌కాశం ఇచ్చిన‌ట్టుగా ఉండేది. ఇలాంటి స‌మ‌స్య‌లున్న‌ప్ప‌టికీ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో వ్య‌వ‌హ‌రిస్తే ఏపీ అసెంబ్లీలో వైసీపీకి కొంత సానుకూల‌త ద‌క్కేది. అలాంటి ఛాన్స్ మిస్ చేసుకోవ‌డం విప‌క్షం వ్యూహాత్మ‌క త‌ప్పిదంగానే భావిస్తున్నారు. ఇక కాగ్ రిపోర్ట్ లాంటి అనేక కొత్త ఆయుధాలు అందిపుచ్చుకునే అవ‌కాశం కోల్పోయిన‌ట్టు క‌నిపిస్తోంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *