Main Menu

నీర‌వ్ కోసం మోడీ చేసిన మేలు తెలుసా…?

Spread the love

ఇండియాలో అవినీతికి పాల్ప‌డినా నిరూపించ‌డం అంత సులువు కాద‌ని అంద‌రికీ తెలుసు. నేరం నిరూపించ‌డానికి ఉన్న అనేక మార్గాల‌ను ఎన్ని ర‌కాలుగా ప‌క్క‌దారి ప‌ట్టిస్తారో చాలాకాలంగా దేశ‌మంతా చూస్తోంది. అయితే కొన్నాళ్లుగా, మ‌రీ ముఖ్యంగా న‌రేంద్ర మోడీ అధికారంలోకి వ‌చ్చిన అవినీతికి పాల్ప‌డిన వాళ్లంతా, ద‌ర్జాగా దేశం దాటిపోవ‌చ్చ‌ని తెలుస్తోంది. భార‌తీయ చ‌ట్టాల‌కు దొర‌క‌కుండా విలాసాల జీవనానికి ఆటంకాలు లేకుండా చూసుకోవ‌చ్చ‌ని తెలుస్తోంది. వ‌రుస‌గా ల‌లిత్ మోడీతో మొద‌లుకుని తాజా నీర‌వ్ మోడీ వ్య‌వ‌హారం వ‌ర‌కూ అదే నిరూపితం అవుతోంది. అలా దేశంలో ప్ర‌జ‌ల సొమ్ము మింగేసిన వాళ్ల‌తో ఏకంగా ఫారిన్ వెళ్లిన ప్ర‌ధాని ఫోటో షూట్ ల‌కు దిగ‌డం మాత్రం కొంత విస్మ‌య‌క‌రంగా ఉంది.

అయితే దావోస్ లో మోడీతో బాగా క్లోజ్ గా మెలిగిన కొద్దిమంది భార‌తీయ పెట్టుబ‌డిదారుల జాబితాలో నీర‌వ్ మోడీ ప్ర‌ధానంగా క‌నిపిస్తున్నారు. కానీ అంత‌కుముందు నుంచే నీర‌వ్ కి మోడీ ద్వారా అనేక ర‌కాలుగా మేలు జ‌రిగింద‌ని ప‌రిణామాలు చాటుతున్నాయి. వాస్త‌వానికి తాజాగా కుంభ‌కోణం బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత నేర‌మంతా పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ సిబ్బంది కొంద‌రి చ‌ర్య‌గా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం సాగుతోంది. కానీ దానికి మించిన అధికార స‌హ‌కారం చాలా ఉంద‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఏకంగా చీఫ్ విజిలెన్స్ క‌మిష‌న‌ర్ మార్పు అని అనుమానిస్తున్నారు. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ ద్వారా లెట‌ర్ ఆఫ్ అండ‌ర్ స్టాండింగ్ పేరుతో భారీగా అక్ర‌మాల‌కు పాల్ప‌డిన నీర‌వ్ మోడీకి మొత్తం బ్యాంక్ లావాదేవీల‌న్నీ నిర్వ‌హించుకోవ‌డానికి త‌గ్గ‌ట్టుగా పాస్ వ‌ర్డ్ కూడా ఇచ్చేశార‌ని తాజాగా క‌థ‌నాలు చెబుతున్నాయి. అంటే పీఎన్బీలో ప‌రిణామాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. అలాంటి బ్యాంక్ కి విజిలెన్స్ లో అత్యంత ప‌గ‌డ్బందీగా వ్య‌వ‌హ‌రించిందంటూ ఆనాటి విజిలెన్స్ క‌మిష‌న‌ర్ కేవీ చౌద‌రి అవార్డ్ ఇవ్వ‌డం విశేషంగా మారింది. అంతేగాకుండా అదే కేవీ చౌద‌రి ని మోడీ ఆ త‌ర్వాత చీఫ్ విజిలెన్స్ క‌మిష‌న‌ర్ గా నియ‌మించ‌డం గ‌మ‌నిస్తే కేంద్రంలోని పెద్ద‌ల ఆశీస్సులు లేకుండా ఈ తంతు సాగ‌ద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

అంతేగాకుండా వివిద బ్యాంకులు అందులోనూ దేశంలో మూడో అతి పెద్ద బ్యాంక్ నుంచి ఎల్వోయూలు వెళుతున్న తంతు మీద ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల్సిన ఆర్బీఐ తీరు కూడా ఇక్క‌డ ప‌లు సందేహాల‌కు తావిస్తోంది. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ గా రాజ‌న్ ని తొల‌గించి హ‌ఠాత్తుగా ఉర్జిత్ ప‌టేల్ ని తీసుకురావ‌డం కూడా విశేషంగా క‌నిపిస్తోంది. రిల‌యెన్స్ సంస్థల మాజీ ఉపాధ్య‌క్షుడు ఉర్జిత్ ని ఆర్బీఐ సార‌ధిగా నియ‌మించిన త‌ర్వాత అంటే 2017లోనే అత్య‌ధికంగా ఎల్వోయూలు జారీ అయిన‌ట్టు సీబీఐ రిపోర్ట్ చెబుతోంది. ఉర్జిత్ ఆర్బీఐకి రాక‌ముందు రిల‌యెన్స్ లో ప‌నిచేస్తే, అదే రిల‌యెన్స్ అధినేత ముఖేష్ అంబానీకి నీర‌వ్ మోడీతో బంధుత్వం ఉండ‌డం విశేషంగా భావించాల్సి ఉంటుంది. అంటే ఓ వైపు సీవీసీ , మ‌రోవైపు ఆర్బీఐ నుంచి నీర‌వ్ కి పూర్తి స‌హ‌కారం అందించేలా కేంద్రంలోని పెద్ద‌లు పావులు క‌దిపి ఉంటార‌నే అభిప్రాయానికి ఈ నియామ‌కాలు అవ‌కాశం ఇస్తున్నాయి. ఇవ‌న్నీ య‌ధాలాపంగా జ‌రిగిన‌వి కాకుండా, కార్పోరేట్ ప్ర‌యోజ‌నాల కోసం, దేశాన్ని ముంచే వ్యూహంలో ఉన్న నీర‌వ్ మోడీలాంటి వారికి స‌హ‌క‌రించ‌డానికి త‌గ్గ‌ట్టుగా కేంద్రంలోని పెద్ద‌లు సాగించిన నిర్వాహ‌కాల ఫ‌లితాల‌ని అంచ‌నా వేస్తున్నారు. అంటే ఎల్వోయూల అడ్డ‌గోలుత‌నం పీఎన్బీ నుంచి బ‌య‌ట‌కు రాకుండా ఇన్నాళ్లుగా దానిని క‌ప్పి ఉంచ‌డంలో సీవీసీ తో పాటు ఆర్బీఐ స‌హ‌కారం కూడా ఉంద‌నే వాద‌న‌కు త‌గ్గ‌ట్టుగా ఈ వ్య‌వ‌హారం క‌నిపిస్తోంది.

అదే స‌మ‌యంలో స‌ద‌రు పీఎన్బీఐ ఉద్యోగిని ఏడేళ్ల పాటు బ‌దిలీ చేయ‌కుండా రిటైర్ అయ్యే వ‌ర‌కూ అదే స్థానంలో కొనసాగించ‌డం వెనుక కూడా పెద్ద‌ల హ‌స్తం ఉండ‌వ‌చ్చ‌నే వాద‌న ఉంది. ఉర్జిత్ వ‌చ్చిన త‌ర్వాతే నోట్ల‌ర‌ద్దు జ‌ర‌గ‌డం, ఆ త‌ర్వాత నీర‌వ్ కి భారీగా ల‌బ్ధి చేకూర‌డం ఓ ప‌క్కా ప్ర‌ణాళిక‌కు అనుగుణంగా సాగిన వ్య‌వహార‌మ‌ని భావిస్తున్నారు. అంతేగాకుండా జ‌న‌వ‌రి 1న నీర‌వ్ దేశం నుంచి వెళ్లిపోయిన త‌ర్వాత కేసులు, ద‌ర్యాప్తు అంటూ హ‌డావిడి చేయ‌డం గ‌మ‌నిస్తుంటే ఏ స్థాయిలో స్కెచ్ సాగిందో అర్థం చేసుకోవ‌చ్చ‌ని అనేక‌మ‌ది భావిస్తున్నారు. పీఎన్బీకి షేర్లు హ‌ఠాత్తుగా ప‌త‌నం కావ‌డం, బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌పైనే ప్ర‌జ‌ల్లో సందేహాలు పెర‌గ‌డం, అదే స‌మ‌యంలో బ్యాంకింగ్ లో ప్రైవేటు భాగ‌స్వామ్యం పెరగాలంటే కేంద్ర‌మంత్రి మాట్లాడుతుండ‌డం గ‌మ‌నిస్తే వ్య‌వ‌స్థ‌కే అవ‌స్థ‌లు తెచ్చేలా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మొత్తంగా ఈ అసాధార‌ణ కుంభ‌కోణంలో అత్యున్న‌త స్థాయి నేత‌ల పాత్ర అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది.

అందుకే ఇంత పెద్ద బండారం బ‌య‌ట‌ప‌డినా ప్ర‌ధాన‌మంత్రి క‌నీసం నోరు మెద‌ప‌డం లేద‌ని చెబుతున్నారు. ప్ర‌జాస్వామ్యం గురించి త‌న పార్టీ కార్యాల‌యం ప్రారంభం సంద‌ర్భంగా ప్ర‌స్తావించిన మోడీకి, ప్ర‌జ‌ల సొమ్ము ఎగరేసుకుపోయిన వ్య‌వ‌హారంలో బాధితుల‌కు భ‌రోసా క‌ల్పించ‌డం ప్ర‌జాస్వామ్యంలో పాల‌కుల బాధ్య‌త అని గుర్తురాలేదా అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *