Main Menu

కిరణ్ నోరు నొక్కేశారా?

Spread the love

నాలుగేళ్ల పాటు అజ్నాతవాసం అనుభవించారు. హఠాత్తుగా తెరమీదకు వచ్చి తల్లిపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకేముందు ఏపీలో మళ్లీ చక్రం తిప్పేస్తారని అంచనాలు వేశారు. కానీ ఆయన అనూహ్యంగా కనుమరుగయ్యారు. రెండు నెలలుగా కనిపించకుండా పోయారు. కీలక పరిణామాలు జరుగుతున్నా ఉలుకూ పలుకూ లేదు. కనీసం ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. దాంతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సుదీర్ఘకాలం కాలుదువ్వుకున్న రెండు పార్టీలు చేతులు కలుపుకున్నాయి. దాంతో టీడీపీ, కాంగ్రెస్ బంధం బలపడుతున్నట్టు స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తో కలిసి కాంగ్రెస్ నేతలు వేదిక పంచుకోవడం అనివార్యంగా మారింది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ని తిరిగి బలోపేతం చేస్తామని చెప్పుకొచ్చిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏమయ్యారోననే సందేహాలు తల్లెత్తుతున్నాయి. కాంగ్రెస్ నేతలు చంద్రబాబు చేతులు కలపడాన్ని నిరసిస్తూ ఇప్పటికే కిరణ్ మంత్రివర్గంలో పనిచేసిన వట్టి వసంత్ కుమార్, బాలరాజు వంటి నేతలు సొంత పార్టీకి గుడ్ బై చెప్పేశారు. సి రామచంద్రయ్య కూడా రాజీనామా సమర్పించేశారు. మరికొందరు అదే బాటలో ఉన్నట్టు కనిపిస్తోంది.

ఇలాంటి తరుణంలో తన తండ్రి కాలం నుంచి చంద్రబాబుతో విబేధాలున్న కిరణ్ కుమార్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. అదే సమయంలో ఇప్పటికే కిరణ్ సోదరుడు కిషోర్ మాత్రం టీడీపీ గూటిలో చేరిన విషయం గమనార్హం. దాంతో కిరణ్ ఈ పరిణామాలను ఏరకంగా భావిస్తారన్న దానిపై చర్చ సాగుతోంది. అయినా మాజీ సీఎం మాత్రం మాట కూడా వినిిపించడం లేదు. జనాలకు కనిపించడం లేదు కూడా. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పలు కార్యక్రమాలకు ఆయన ఢుమ్మా కొట్టారు. దాంతో కిరణ్ వ్యవహారం ఎటు దారితీస్తోందననే చర్చలు మొదలయ్యాయి.

అయితే కిరణ్ గురించి ఆరా తీస్తే తెలిసిన విషయం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ కి కొంత అవకాశాలు మెరుగుపడుతున్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారు నోరు తెరిస్తే పార్టీకి నష్టం చేకూరుస్తుందని, ఆయన సైలెన్స్ కొనసాగించడం పార్టీకి ప్రయోజనమని కొందరు తెలంగాణా నేతల అభిప్రాయంగా చెబుతున్నారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల ప్రభావం కొనసాగుతున్నందున కొన్నాళ్ల పాటు మౌనంగా ఉండాలని కోరినట్టు తెలుస్తోంది. దాంతోనే కిరణ్ మౌనవ్రతం సాగిస్తున్నారనే అంచనాలు వినిపిస్తున్నాయి.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *