Main Menu

బీజేపీ బంధంపై టీడీపీలో విబేధాలు

Spread the love

తెలుగుదేశం నేతలు తల పట్టుకుంటున్నారు. తమను కనీసం పట్టించుకునే వాళ్లే లేక ఏం చేయాలో పాలుపోవడం లేదంటున్నారు. హస్తినలో అధికార మిత్రపక్షంగా ఉన్నా వారి మాటలకు అసలు విలువ ఉండడం లేదు. చివరకు నిరసనలకు దిగినా మోడీ అండ్ కో మాట మాత్రం ఊరటనివ్వడం లేదు. ఏదో ఉద్దరిస్తారనే కథనాలు అల్లుుతున్నా కనికరించడం లేదు. ఏదో చెబుతారనుకుంటే చివరకు ఊరించి ఉసూరుమనిపిస్తున్నారు. ఈ ప్రక్రియ ఇఫ్పటికే నాలుగేళ్లు గడిచిపోయింది. ఐదు బడ్జెట్ లు అయిపోయాయి. ప్రజాగ్రహం కట్టులు తెంచుకుంటోంది. ఆఖరికి తమ కొంపల మీదకు వస్తుందనే భయాందోళన కనిపిస్తోంది. దాంతో ఏం చేయాలో పాలుపోని టీడీపీ ఎంపీలు కాడి వదిలేయాలని భావిస్తున్నారు. బీజేపీని మోయాలని చూస్తే తామే మునిగిపోతామని ఆందోళన చెందుతున్నారు.

దాంతో ఈ వ్యవహారం టీడీపీలో దుమారం రేపుతోంది. రెండు వర్గాలుగా విడిపోవడానికి కారణం అవుతోంది. టీడీపీలో సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి నేతలు తెగతెంపులకు ససేమీరా అంటుంటే గతంలో ఇలాంటి పరిస్థితులను స్వయంగా గమనించిన కొనకళ్ల, నిమ్మల, రాయపాటి వంటి వారితో పాటు యువనేతలు కింజరాపు రామ్మోహన్ నాయుడు వంటి వారు కూడా బ్రేకప్ చెప్పేయాలని ఆశిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే చాలాకాలాతీతం అయ్యిందని, తక్షణం బీజేపీని వదిలించుకోకపోతే చివరకు దాని ప్రభావం తెలుగుదేశం మీద పడుతుందని కొందరు రాష్ట్రమంత్రులు కూడా బలంగా వాదిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల మూడ్ గమనించిన కొందరు అదే అబిప్రాయాన్ని అధినేత ముందు కూడా ప్రస్తావించారు.

కానీ చంద్రబాబు మాత్రం ఈ విషయంలో ముదుడుగు వేసే ఆలోచనలో లేరని టీడీపీ వర్గాల అంతర్గత అభిప్రాయం. ఇప్పటికిప్పుడు బీజేపీని వదిలించుకోవడం కంటే, ఆపార్టీని మరింత బద్నాం చేసి, తద్వారా తాము వదిలించుకోవడం ద్వారా ప్రజల్లో సానుభూతి కొట్టేయాలని చూస్తున్నారు. అంతేగాకుండా కొన్ని చంద్రబాబు కేసులు సహా ఇతర సమస్యలన్నీ కొన్నాళ్లాగితే కేంద్రం ముందడుగు వేసే పరిస్థితి రాదని అంచనా వేస్తున్నారు. దానికితోడుగా ఏపీలో వైఫల్యాలకు బీజేపీని బాధ్యురాలిగా చేయడం ద్వారా చంద్రబాబు సశ్ఛీలుడని నిరూపించుకునే అవకాశం ఉంటుందని లెక్కిస్తున్నారు. ఇలాంటి ఏకకాలంలో మూడు రకాల ప్రయోజనాలు బీజేపీ ద్వారా పొందడానికి తగ్గట్టుగా పావులు కదుపుతున్న చంద్రబాబు, సుజనా అండ్ కో అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్టు పలువురు ఎంపీలు భావిస్తున్నారు. దాంతో ఈ విషయంలో తమ అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా కొందరు సాహసించడం లేదు.

మొత్తంగా బీజేపీ వ్యవహారం టీడీపీలో విబేధాలు తీసుకొచ్చిన నేపథ్యంలో చంద్రబాబు చివరకు ఏ రీతిన వ్యవహరిస్తారో చూడాలి. బీజేపీతో బ్రేకప్ చేసుకోవడం ఖాయంగా మారిన తరుణంలో ఎలాంటి నిర్ణయాలతో సాగుతారన్నది ఆసక్తిదాయకమే. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామమే.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *