Main Menu

టీఆర్ఎస్ కి మేలు చేస్తున్న చంద్ర‌బాబు!?

Spread the love

తెలంగాణా ఎన్నిక‌ల్లో ప‌రిణామాలు ఆశ్చ‌ర్యక‌రంగా మారాయి. వాస్త‌వానికి సెప్టెంబ‌ర్ లో అసెంబ్లీ ర‌ద్ద‌యిన నాడు కేసీఆర్ కి తిరుగులేదు. ఆ వెంట‌నే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డంతో కేసీఆర్ గ్రాఫ్ ప‌డిపోవ‌డం ప్రారంభ‌మ‌య్యింది. ఆత‌ర్వాత కాంగ్రెస్ పుంజుకోవడంతో పోటీ త‌ప్ప‌ద‌నే వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. మ‌హాకూట‌మి ఏర్పాటుతో ప‌రిస్థితి మ‌రింత సంక్లిష్టంగా మారింది. ఇక ప్ర‌చారం ఊపందుకోవ‌డం, మ‌హాకూట‌మిలో లుక‌లుక‌లు కార‌ణంగా కోలుకుంటున్న‌ట్టు భావించిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ తెలంగాణా రాష్ట్ర స‌మితి ఊహించిన దానికి భిన్న‌మైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.

అందుకు ప్ర‌ధాన కార‌ణం చంద్ర‌బాబు పాత్ర అని చాలామంది అంగీక‌రించ‌వ‌చ్చు. మీడియాలో విస్తృత‌ప్ర‌చారాలు, ర‌క‌ర‌కాల స‌ర్వేల పేరుతో వినిపిస్తున్న వాద‌న‌లు , కేసీఆర్ కుటుంబానికి వ్య‌తిరేకంగా కూట‌మి నేత‌ల మూకుమ్మ‌డి దాడులు, చివ‌ర‌కు మోడీ కూడా కేసీఆర్ మీద విమ‌ర్శ‌లు చేయాల్సిన ప‌రిస్థితి రావ‌డం అన్నీ క‌లిసి కారు పార్టీ కుర్చీ కింద‌కు నీళ్లొస్తున్నాయ‌నే క‌థ‌నాలు రాసే ప‌రిస్థితి వ‌చ్చింది. ఏబీఎన్ వారి ప‌త్రిక‌లోనే రెండు వారాల క్రితం అనేక విష‌యాలు రాయ‌లేని ప‌రిస్థితి ఉంద‌ని వాపోయిన రాధాకృష్ణ తాజాగా కారు క‌ష్టాల‌ను ధైర్యంగా చాట‌డానికి సిద్ధ‌ప‌డ‌డం ప‌రిస్థితుల్లో వ‌చ్చిన మార్పుల‌కు తార్కాణం అని చెప్ప‌వ‌చ్చు.

చంద్ర‌బాబు భారీగా నిధులు ఇస్తున్నార‌ని, త‌న అనుభ‌వాన్నంత రంగ‌రించి తెలంగాణా ఎన్నిక‌ల ప్రచారం బాద్య‌త‌లు చూస్తున్నార‌ని టీఆర్ఎస్ ఆరోప‌ణ‌లు చేస్తోంది. పైగా క‌ర్ణాట‌కా మంత్రి శివ‌కుమార్ తో క‌లిసి భారీగా పంప‌కాల‌కు సిద్ధ‌ప‌డుతున్న‌ట్టు సందేహిస్తోంది. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ దృష్టి చంద్ర‌బాబు మీద మ‌ళ్లింది. విమ‌ర్శ‌ల‌న్నీ ఆయ‌న మీదే సాగిస్తున్నారు. కేసీఆర్ , కేటీఆర్ ఎవ‌రు పెద‌వి విప్పినా చంద్ర‌బాబు మీదే. చివ‌ర‌కు కేటీఆర్ వేలు పెట్టే కామెంట్ తో ప‌తాక‌స్థాయికి తీసుకెళ్లారు. త‌ద్వారా టీఆర్ఎస్ కే మేలు జ‌రుగుతుంద‌నే అభిప్రాయం కొంద‌రి నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల క‌న్నా చంద్ర‌బాబు మీద తెలంగాణా స‌మాజంలో ఉన్న వ్య‌తిరేక‌త‌ను సొమ్ము చేసుకోవ‌డం ద్వారా గ‌ట్టెక్కాల‌నే ల‌క్ష్యంతో టీఆర్ఎస్ నేత‌లున్న‌ట్టు భావిస్తున్నారు. కాంగ్రెస్ మీద క‌న్నా చంద్ర‌బాబు మీద విమ‌ర్శ‌లు ఎక్కుపెట్ట‌డం ద్వారా కూట‌మిలో లుక‌లుక‌లు పుట్టించ‌వ‌చ్చ‌ని, త‌ద్వారా టీడీపీ, కాంగ్రెస్ శ్రేణుల మీద స‌ఖ్య‌త ఓట్ ట్రాన్ఫ‌ర్ వ‌ర‌కూ వెళ్ల‌కుండా చేయ‌డం త‌మ‌కు ల‌బ్ది చేకూరుస‌తుంద‌ని అంచ‌నాల్లో ఉన్నారు.

త‌ద్వారా టీఆర్ఎస్ కి చంద్ర‌బాబు మేలు చేసిన‌ట్టుగానే కొంద‌రు భావిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ ప‌రిస్థితి ఇంత‌వ‌ర‌కూ రావ‌డానికి, కూట‌మి గ‌ట్టి పోటీదారుడిగా క‌నిపించ‌డానికి కార‌ణం చంద్ర‌బాబేన‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. తెలంగాణా నేత‌లు వేగంగా పావులు క‌దుపుతూ చంద్ర‌బాబుని తెలంగాణా వ్య‌తిరేకి అనే ముద్ర మ‌రింత బ‌ల‌ప‌డే ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని, అవి ఫ‌లిస్తా లేదా అన్న‌ది చూడాల‌ని కొంద‌రు చెబుతున్నారు. ఏమ‌యినా ఈ ప‌రిణామాలు ఆస‌క్తిదాయ‌క‌మే. ఏమ‌యిన‌ప్ప‌టికీ తెలంగాణాలో కూట‌మి గెలిస్తే కార‌కుడు చంద్ర‌బాబు అవుతార‌ని, ఓట‌మి పాల‌యిన‌ప్పటికీ ప్ర‌ధాన కార‌ణంగా చంద్ర‌బాబు నిలుస్తార‌ని చెప్ప‌వ‌చ్చ‌న్న‌ది మెజార్టీ అభిప్రాయం.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *