Main Menu

కీల‌క ప్రాంతంలో వైసీపీ ఉక్కిరిబిక్కిరి

Spread the love

ఏపీలో అన్నింటికన్నా కీల‌కమైన ప్రాంతం గోదావ‌రి జిల్లాలు. అందులోనూ వైసీపీకి ఆ జిల్లాలు మ‌రింత ముఖ్యం. అయితే ఇప్పుడా జిల్లాల్లో జ‌గ‌న్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌తో స‌త‌మ‌తం అవుతోంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో పార్టీ అధినేత ప‌డిపోతున్నార‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. అదే స‌మ‌యంలో పార్టీలోనే ప్ర‌ధాన నేత‌లుగా ఉన్న వారు బ‌హిరంగంగా చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు వైసీపీని మ‌రింత స‌త‌మ‌తం చేస్తున్నాయి.

గోదావ‌రి జిల్లాల సామాజిక స‌మీక‌ర‌ణాల విష‌యంలో ప్ర‌ధానంగా తూర్పు గోదావ‌రి జిల్లాతో పాటు ప‌శ్చిమ గోదావ‌రిలో కూడా మెజార్టీ ప్రాంతంలో కాపుల‌దే కీల‌క పాత్ర‌. ఆ త‌ర్వాత శెట్టిబ‌లిజ సామాజిక‌వ‌ర్గం ముఖ్య భూమిక పోషిస్తుంది. అందుకు తగ్గ‌ట్టుగానే గ‌డిచిన ఎన్నిక‌ల్లో కాపుల‌కు భారీగా సీట్లు ఇచ్చిన జ‌గ‌న్, శెట్టిబ‌లిజ‌ల‌కు కూడా రామ‌చంద్రాపురం, కాకినాడ రూర‌ల్, ముమ్మిడివ‌రం, పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గాల‌ను కేటాయించారు. అయినా ఆశించిన ఫ‌లితాలు రాక‌పోవ‌డంతో వైసీపీ ఢీలా ప‌డింది. శెట్టిబ‌లిజ వ‌ర్గానికి చెందిన అభ్య‌ర్థులు అన్ని చోట్లా ఓట‌మి పాల‌య్యారు. దాంతో వ‌చ్చే ఎన్నిక‌ల కోసం వైసీపీ వ్యూహం మార్చుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. సామాజిక నేప‌థ్యం క‌న్నా గెల‌పు గుర్రాల‌ను ఎంచుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా సాగుతోంది.

ఈ త‌రుణంలోనే ఇత‌ర పార్టీల నుంచి కూడా నేత‌లు వైసీపీ వైపు చూస్తున్నారు. దాంతో రాబోయే ఎన్నిక‌ల్లో శెట్టిబ‌లిజ సామాజిక‌వ‌ర్గానికి అవ‌కాశాలు కుచించుకుపోయే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ముమ్మిడివ‌రం సీటుని శెట్టి బ‌లిజ వ‌ర్గానికి కాకుండా మ‌త్స్య‌కార సామాజిక‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పొన్నాడ స‌తీష్ కి దాదాపు ఖాయం చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఆయ‌న పార్టీ తీర్థం పుచ్చుకుని ప్ర‌చారంలో దిగిపోతార‌ని చెబుతున్నారు. అదే విధంగా పాల‌కొల్లు నుంచి కూడా మాజీ మంత్రి చేగొండి హ‌రిరామ‌జోగ‌య్య త‌న‌యుడు అవ‌కాశం కోసం చూస్తున్నారు. ఆయ‌న‌కు సై అంటే కండువా క‌ప్పుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇక కాకినాడ రూర‌ల్ సీటు మ‌రో మాజీ ఎమ్మెల్యే , కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన కుర‌సాల క‌న్న‌బాబుకి దాదాపు ఖాయం అని చెప్ప‌వ‌చ్చు. అనూహ్య మార్పులు వ‌స్తే త‌ప్ప ఆయ‌నే బ‌రిలో ఉంటార‌ని భావిస్తున్నారు. ఇక రామ‌చంద్రాపురం నుంచి కూడా కీల‌క కాపు నేత‌, సీనియ‌ర్ ఎమ్మెల్యే టీడీపీ నుంచి వైసీపీ లోకి రావ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నార‌నే వాద‌న ఉంది.

దాంతో ముమ్మిడివ‌రం మిన‌హా మిగిలిన మూడు చోట్ల ఈసారి కాపుల‌కు అవ‌కాశం క‌ట్ట‌బెట్ట‌డానికి పావులు క‌దుపుతున్నార‌నే ప్ర‌చారం ఊపందుకోవ‌డంతో శెట్టిబ‌లిజ నేత‌లు స్వ‌రం పెంచుతున్నారు. త‌మ సామాజిక‌వ‌ర్గానికి అన్యాయం చేయ‌కూడ‌దంటూ పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ వంటి వారు ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు. ప్ర‌త్యేక స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. కుల స‌మీక‌ర‌ణాల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. దాంతో వైసీపీకి పెద్ద స‌మ‌స్య‌గా మారే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. సామాజిక మార్పులు చెమ‌ట‌లు ప‌ట్టించడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. దానిని అధిగ‌మించ‌డానికి ఆపార్టీ ఎలాంటి మార్గం ఎంచుకుంటుందో చూడాలి.


Related News

హ‌ర్ష‌కుమార్ కి అలా… స‌బ్బం హ‌రికి ఇలా!

Spread the loveతెలుగుదేశం పార్టీ అధినేత అనూహ్య నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఏకంగా కాళ్లు మొక్కిన నేత‌ల‌ను కూడా క‌నిక‌రించ‌లేదు. జ‌గ‌న్Read More

మ‌ళ్లీ గోదారోడే..!

Spread the loveగోదారోళ్లంటే అనురాగాల‌కు, అప్యాయ‌త‌ల‌కు పేరు అని చెబుతారు. ఆతిథ్యానికి పెట్టింది పేరుగా క‌నిపిస్తారు. హాస్యానికి, వ్యంగ్యానికి కేరాఫ్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *