Main Menu

అభ్య‌ర్థులు కావలెను..!

Spread the love

ఎన్నిక‌ల వేడి రాజుకుంటోంది. దాదాపు అన్ని పార్టీల్లోనూ సంద‌డి క‌నిపిస్తోంది. ఆశావాహుల క‌ద‌లిక స్ప‌ష్టంగా ఉంది. దాంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థులెవ‌ర‌నే విష‌యంలో అన్ని చోట్ల చ‌ర్చ‌లు సాగుతున్నాయి. అయితే గోదావ‌రి జిల్లాల్లో అన్ని పార్టీలు అభ్య‌ర్థుల కోసం వేట సాగించాల్సి వ‌స్తోంది. ముఖ్యంగా ఎంపీ సీట్ల విష‌యంలో దాదాపు అన్ని పార్టీల‌దీ ఒక‌టే ప‌రిస్థితి. రెండు జిల్లాల‌కు క‌లిపి 5 స్థానాలుండ‌గా వాటిలో న‌లుగురు టీడీపీ, ఒక బీజేపీ ఎంపీ ప్ర‌స్తుతం ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే ఐదుగురు ఎంపీల‌లో ముగ్గురికి పార్ల‌మెంట్ అంటే మొఖం మొత్తింద‌న ప్ర‌చారం సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మొత్తం పోటీకే దూరంగా ఉండే యోచ‌న‌లో బీజేపీ ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న న‌ర్సాపురం స‌మ‌స్య‌ల ప‌ట్ల పెద్ద‌గా స్పందించ‌డం లేదు. క‌నీసం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో కూడా ఉండ‌డం లేదు. పైగా ఆచంట‌, న‌ర్సాపురం, త‌ణుకు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ నేత‌ల‌తో తీవ్ర విబేధాలున్నాయి. వాటికితోడుగా ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా లెక్క‌లేసుకున్న గోక‌రాజు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి దూరం కావాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. అదే జ‌రిగితే బీజేపీకి న‌ర్సాపురం సీటుకి కొత్త నాయ‌కుడు అర్జెంటుగా అవ‌స‌రం అవుతారు.

ఆయ‌న‌కు తోడుగా టీడీపీ ఎంపీలు తోట న‌ర‌సింహం(కాకినాడ‌), మాగంటి ముర‌ళీమోహ‌న్ (రాజ‌మ‌హేంద్ర‌వ‌రం) కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీ స్థానాల‌కు బ‌దులుగా అసెంబ్లీకి రంగంలో దిగాల‌ని యోచిస్తున్నారు. ఇప్ప‌టికే ముర‌ళీమోహ‌న్ రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాలే చెబుతున్నాయి. దానికి త‌గ్గ‌ట్టుగానే ఆయ‌న ప్ర‌ధానంగా అక్క‌డ కేంద్రీక‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రికి రిటైర్మెంట్ ఇచ్చి త‌న‌కు అవ‌కాశం ఇస్తార‌నే ఆశ‌లో ముర‌ళీమోహ‌న్ ఉన్నారు. అదే జ‌రిగితే టీడీపీ కి అక్క‌డ కొత్త అభ్య‌ర్థి అవ‌స‌రం అవుతారు. ఇప్ప‌టికే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన అల్లూరి విక్ర‌మాదిత్య వంటి ప‌లువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక తోట న‌ర‌సింహం కూడా అసెంబ్లీకి పోటీ చేస్తే అమాత్య హోదా దక్కుతుంద‌ని భావిస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే సొంత నియోజ‌క‌వ‌ర్గం జ‌గ్గంపేట‌పై క‌న్నేశారు. అయితే అక్క‌డ టీడీపీ బెర్త్ ఖాళీ లేక‌పోవ‌డంతో న‌ర‌సింహం పార్టీ మారుతార‌నే చ‌ర్చ కూడా సాగుతోంది. ఏమ‌యినా ఆయ‌న పార్ల‌మెంట్ బ‌రిలో దిగే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు కాబ‌ట్టి, టీడీపీకి కొత్త అభ్య‌ర్థి అవ‌స‌రం. దాంతో వైసీపీ నేత చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్ కోసం టీడీపీ వ‌ర్గాలు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం. ఆయ‌న సై అంటే మూడో ఎన్నిక‌ల్లో మూడో పార్టీని బ‌రిలో దిగిన‌ట్ట‌వుతుంది.

సిట్టింగుల‌లో పండుల ర‌వీంద్ర‌బాబు(అమ‌లాపురం), మాగంటి బాబు(ఏలూరు) మాత్ర‌మే మ‌రోసారి రంగంలో దిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ కి కూడా ఎంపీ అభ్య‌ర్థుల అవ‌స‌రం క‌నిపిస్తోంది. చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్ చేజారితే కాకినాడ‌కు కొత్త నేత అవ‌స‌రం అవుతారు. అమ‌లాపురం నుంచి గ‌డిచిన ఎన్నిక‌ల్లో పోటీ చేసిన పినిపే విశ్వ‌రూప్ అసెంబ్లీ బ‌రిలో ఖాయం అయ్యారు. కాబ‌ట్టి అక్క‌డ కొత్త అభ్య‌ర్థిని వెదకాల్సి ఉంది. ఏలూరు నుంచి పోటీ చేసిన తోట చంద్ర‌శేఖ‌ర్ మ‌ళ్లీ రంగంలో ఉంటారా లేదా అన్న‌ది సందేహ‌మే. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం నుంచి అప్పుడు రంగంలో ఉన్న బొడ్డు వెంక‌ట‌ర‌మ‌ణ ప్ర‌స్తుతం టీడీపీలో చేరిపోయారు. ఇక న‌ర్సాపురం వంకా ర‌వీంద్ర‌నాథ్ స్థానంలో కొత్త‌గా క్షత్రియ సామాజిక‌వ‌ర్గం నేత‌ను రంగంలో దింపే అకాశాలున్నాయి. దాంతో దాదాపుగా వైసీపీ అభ్య‌ర్థులంతా కొత్త వారిని ఖాయం చేసుకోవాల్సి ఉంది. ఇక జ‌న‌సేన కూడా రంగంలో ఉన్న ప‌క్షంలో ఆపార్టీ త‌రుపున కొత్త అభ్య‌ర్థి ఖాయం. దాంతో ఇప్పుడు అంద‌రి దృష్టి గెలుపు గుర్రాల‌పై ప‌డుతోంది.


Related News

ఫిబ్ర‌వ‌రి నాటికి క్లారిటీ వ‌స్తుందంటున్న ప‌వ‌న్

Spread the loveజ‌న‌సేన అధినేత ప‌ర్య‌ట‌న‌లు జోరుగా సాగుతున్నాయి. ఓవైపు ఉత్త‌రాంధ్ర‌, గోదావ‌రి జిల్లాల యాత్ర‌లు ముగించుకుని ప్ర‌స్తుతం రాయ‌ల‌సీమ‌లోRead More

ఆపార్టీలోనే చేర‌తానంటున్న వ‌ట్టి

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత‌ల్లో ఒక‌రిగా పేరున్న వ‌ట్టి వ‌సంత‌కుమార్ కి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో గ‌ట్టిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *