Main Menu

కాకినాడ ఎన్నిక‌లు: ఎవ‌రి బ‌లం ఎంత‌?

tdp
Spread the love

కాకినాడ కార్పోరేష‌న్ ఎన్నిక‌లు అనివార్యంగా ముందుకొచ్చాయి. నంద్యాల హీటు కాల్పుల వ్యాఖ్య‌ల వ‌ర‌కూ వ‌చ్చేసిన నేప‌థ్యంలో కాకినాడ కాక మ‌రింత రాజుకోవ‌డం ఖాయం. అయితే స్థానిక ఎన్నిక‌లు కాబ‌ట్టి ప‌రిస్థితులు, ప‌రిణామాలు వేరుగా ఉంటాయి. ఫ‌లితాలు కూడా భిన్నంగా ఉండ‌వ‌చ్చు. అయితే కాకినాడ ఎన్నిక‌ల వ్య‌వ‌హారంలో పూర్తిస్థాయి స్ప‌ష్ట‌త లేన‌ప్ప‌టికీ షెడ్యూల్ స్వ‌ల్పంగా మారినా పోరు మాత్రం త‌ప్ప‌దు. కాబ‌ట్టే అన్ని పార్టీలు స‌మాయ‌త్త‌మ‌వుతున్నాయి. అయితే ఇక్క‌డ కూడా పోటీ ప్ర‌ధాన పార్టీలు టీడీపీ, వైసీపీ మ‌ధ్యే ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఇక బీజేపీ ఉనికి ఏపాటిది..జ‌న‌సేన ఏం చేస్తుంది…వామ‌ప‌క్షం ఎక్క‌డుంటుంద‌న్న‌ది తేలాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో కాకినాడ మునిసిప‌ల్ కార్పోరేషన్ ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి క‌లిసొచ్చే అంశాలేంట‌న్న‌ది ఓ మారు ప‌రిశీలిద్దాం..

తెలుగుదేశం: అధికార‌పార్టీ. యంత్రాంగం చేతిలో ఉంది. తోడ్పాటు ఉంటుంది. అదే స‌మ‌యంలో న‌గ‌రంలో బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది. సామాజికంగా మ‌త్స్య‌కారులు, ఇత‌ర బీసీలు టీడీపీకి అండ‌గా ఉన్నారు. మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైశ్య‌, కాపు సామాజిక‌వ‌ర్గాలు కూడా తోడు కావ‌డంతో విజ‌యం సాధించారు. ఆర్థికంగా ద‌న్ను ఉన్న నేత‌లున్నారు. ఇటీవ‌ల హౌసింగ్ స్కీమ్ స‌హా ప‌లు ప‌థ‌కాలు ప్ర‌క‌టించ‌డం క‌లిసొస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. స్మార్ట్ సిటీ అంటూ సాగిన ప్ర‌చారం కూడా ఓ వ‌ర్గాన్ని ఆక‌ట్టుకుంది. ఉద్యోగ వ‌ర్గాల్లో సానుకూల‌త క‌నిపిస్తోంది. మ‌ధ్య‌త‌ర‌గ‌తి కొంత క‌లిసి రావ‌చ్చు. కానీ అదే స‌మ‌యంలో మూడున్న‌రేళ్ల‌లో చెప్పుకోద‌గ్గ అభివృద్ధి లేద‌ని అంతా అంగీక‌రిస్తున్నారు. సీఎం వ‌చ్చి శంకుస్థాప‌న చేసిన ప థ‌కాల‌కు కూడా ముంద‌డుగు ప‌డ‌క‌పోవ‌డంతో అసంతృప్తి క‌నిపిస్తోంది. పేరుకి స్మార్ట్ సిటీ అయినా అభివృద్ది లేద‌నే అభిప్రాయం ఉంది. కాపుల్లో ఇటీవ‌ల టీడీపీ ప‌ట్ల పెరిగిన అసంతృప్తి కొంత ప్ర‌భావం చూపుతుంది. వైశ్య సామాజిక‌వ‌ర్గంలో కూడా చీలిక వ‌చ్చింది. కార్మికులు, ఇత‌ర దిగువ వ‌ర్గాల్లో టీడీపీ బ‌ల‌హీనంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఎస్సీల‌లో టీడీపీకి ప‌ట్టు లేదు. ఇళ్ల ప‌థ‌కంలో అన‌ర్హుల‌కు క‌ట్ట‌బెట్టార‌ని, ఎమ్మెల్యే, ఆయ‌న సోద‌రుడు అవినీతికి పాల్ప‌డుతున్నార‌నే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇవ‌న్నీ పాల‌క‌పార్టీకి ఇబ్బందిక‌రంగా ప‌రిణ‌మిస్తాయి.

వైసీపీ: ఇటీవ‌ల పార్టీలో చేరిన మాజీ మంత్రి ముత్తా గోపాల‌కృష్ణ వ‌ర్గం వైసీపీకి అండ‌గా ఉంది. వైశ్యులు కొంత మేర‌కు క‌లిసి వ‌స్తారు. కాపుల్లో చంద్ర‌బాబు తీరు మీద క‌నిపిస్తున్న ఆగ్ర‌హం కొంత క‌లిసి రావ‌చ్చు. ఎస్సీలు వైసీపీకి సానుకూలంగానే ఉన్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌, అభివృద్ధి జాడ‌లేక‌పోవ‌డం వంటి అనేక అంశాలు విప‌క్ష పార్టీకి అస్త్రాల‌వుతున్నాయి. అధికార‌పార్టీలో అసంతృప్తులు కూడా క‌లిసి రావ‌చ్చు. కానీ వైసీపీలో కూడా అటు ద్వారంపూడి, ఇటు ముత్తా వ‌ర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. పోటీపోటీగా సాగుతున్నాయి. అదే పెద్ద బ‌ల‌హీన‌త‌. అవ‌కాశాల‌ను సొమ్ము చేసుకోలేని ప‌రిస్థితి ఉంది. ఇక న‌గ‌ర ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల మీద క‌నీసం ఒక్క కార్య‌క్ర‌మం కూడా చేప‌ట్ట‌క‌పోవ‌డంతో క్యాడ‌ర్ లో కూడా నిర్లిప్త‌త క‌నిపిస్తోంది. కీల‌క‌స‌మ‌స్య‌ల‌ను కూడా వైసీపీ విస్మ‌రించింది. అది ఆ పార్టీకి బ‌ల‌హీన‌త‌గా మారేలా ఉంది.

కాంగ్రెస్: బ‌ల‌మైన నాయ‌కులు కొంద‌రున్నారు. మార్గ‌ద‌ర్శ‌నం చేయ‌డానికి మాజీ కేంద్ర‌మంత్రి ప‌ళ్లంరాజు వంటి వారున్నారు. కానీ క్యాడ‌ర్ లేదు. క‌లిసొచ్చే అంశాలు కూడా లేవు. అన్ని డివిజ‌న్ల‌లో పోటీ అని చెబుతున్నా అది కూడా అనుమాన‌మే. బోణీ కొట్టాలంటే తీవ్రంగానే శ్ర‌మించాలి.

బీజేపీ: టీడీపీ కూట‌మిలో కొన‌సాగుతామంటోంది. కానీ పొత్తు పొడ‌వ‌డ‌మే పెద్ద స‌మ‌స్య‌గా క‌నిపిస్తోంది. క‌లిసి సాగే అవ‌కాశాలు కూడా స్వ‌ల్ప‌మే. ఆర్థికంగా స్థిర‌ప‌డిన నేత‌లుండ‌డం, కొన్ని ఆధిప‌త్య కులాల అండ‌దండ‌లుండ‌డంతో బోణీ కొట్ట‌గ‌ల‌మ‌న్న ధీమా క‌నిపిస్తోంది. అది జ‌రిగాలంటే చాలా శ్ర‌మించాల్సి ఉంటుంది.

వామ‌ప‌క్షాలు: గ‌త కార్పోరేష‌న్ లో సీపీఎం కి ఒక స‌భ్యుడున్నారు. ఈసారి నిల‌బెట్టుకోవ‌డం అంత సులువు కాదు. మిగిలిన పార్టీలు నామ‌మాత్ర‌మే.

జ‌న‌సేన: ఏం చేస్తుంద‌న్న‌ది చూడాలి. పార్టీకి యువ‌త ఉన్నారు. నాయ‌క‌త్వం లేక‌పోయినా న‌డిపిస్తున్నారు. ఎన్నిక‌ల్లో అధినేత ఆదేశాల కోసం చూస్తున్నారు. పోటీ చేసే అవ‌కాశం లేదంటున్నారు. టీడీపీతో క‌లిసి సాగితే యువ‌త ఓట్లు కొంత అధికార పార్టీకి తోడ్ప‌డ‌వ‌చ్చు.

ఇవ‌న్నీ ఓ లెక్క‌. అభ్య‌ర్థుల ఎంపిక మ‌రో లెక్క‌. ఆ డివిజ‌న్ లో ఎలాంటి అభ్య‌ర్థిని రంగంలో దింపార‌న్న దానిపైనే స‌గం ఫ‌లితాలు ఆధార‌ప‌డి ఉంటాయి. వ్య‌క్తుల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. ఆర్థిక ద‌న్ను కూడా తోడ్ప‌డుతుంది. కాబ‌ట్టి పార్టీల లెక్క‌లు కొంత‌మేర‌కే ప‌నిచేస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు.


Related News

tdp

టీడీపీకి షాకిచ్చిన కాపు కార్పోరేష‌న్ డైరెక్ట‌ర్

Spread the loveగ‌డిచిన ఎన్నిక‌ల్లో తిరుగులేని ఆధిప‌త్యం చాటుకున్న టీడీపీకి ఇప్పుడు క‌ష్టాలు త‌ప్పేలా లేవు. వ‌రుస‌గా ప‌శ్చిమ గోదావ‌రిRead More

gorantla buchayya

అయ్యో..బుచ్చ‌య్య‌కి హ్యాండిస్తున్న‌ట్టేనా!

Spread the loveతెలుగుదేశం పార్టీలో ఆయ‌న సీనియ‌ర్ నాయ‌కుడు. స్వ‌యంగా ఆయ‌న చెప్పుకున్న మాట‌ల ప్ర‌కారం చెప్పాలంటే టీడీపీలో చంద్ర‌బాబుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *