Main Menu

పాగా కోసం పావులు క‌దుపుతున్న లెఫ్ట్

Spread the love

వామ‌ప‌క్షాలు ఊపు కోసం ప్ర‌య‌త్నిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ ఉనికిని చాటుకోవ‌డంతో పాటుగా రాజ‌కీయ ప్ర‌త్యామ్నాయం పేరుతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌స్తుత అసెంబ్లీలో చోటు లేకుండా పోయిన క‌మ్యూనిస్టులు వ‌చ్చే అసెంబ్లీలో ఏదో విధంగా పాగా వేయాల‌ని చూస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా విస్తృతంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే జ‌న‌సేన‌తో క‌లిసి పోటీ చేసేందుకు స‌మాత్త‌మ‌వుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డిపోరు కోసం చ‌ర్చ‌లు సాగిస్తున్నాయి. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే వ‌చ్చే అసెంబ్లీలో కామ్రేడ్లు క‌నిపించ‌డానికి ప‌రిస్థితుల‌ను సానుకూలంగా మ‌లుచుకునే య‌త్నాలు చేస్తున్నాయి.

గ‌డిచిన ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్టులు ఘోర ప‌రాజ‌యం మూట‌గట్టుకున్నారు. అయిన‌ప్ప‌టికీ గ‌డిచిన కొన్నేళ్లుగా రాష్ట్ర‌వ్యాప్తంగా విస్తృతంగా పోరాటాలు చేస్తున్నారు. తుందుర్రు ఆక్వా, దివీస్ కాలుష్యం, వంశ‌ధార నిర్వాసితులు, పోల‌వ‌రం నిర్వాసితుల‌తో పాటు రాయ‌ల‌సీమ‌లోని ప‌లు స‌మ‌స్య‌ల‌పై క‌దిలారు. క‌మ్యూనిస్టుల ప్ర‌భావంతో ప‌లు అంశాల్లో ప్ర‌భుత్వం కూడా వెన‌క‌డుగు వేయాల్సి వ‌చ్చింది. దివీస్ వంటి ప‌రిశ్ర‌మ‌ల‌ను ఉప‌సంహ‌రించుకోవాల్సి వ‌చ్చింది. అయితే చాలాకాలంగా బ‌ల‌హీనంగా క‌నిపిస్తున్న ఓట్ల రాజ‌కీయాల‌ను ఈసారి అధిగ‌మించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే త‌మ పోరాటాల్లో క‌లిసి వ‌స్తున్న వారిని ఓట్ల రూపంగా మ‌లుచుకోవాల‌ని , త‌ద్వారా ఓ మార్పు సాధించాల‌న్న ప‌ట్టుద‌ల ఈసారి వామ‌ప‌క్ష నేత‌ల్లో క‌నిపిస్తోంది.

జ‌న‌సేన కార‌ణంగా కొత్త ఇమేజ్ సంపాదించ‌వ‌చ్చని, యువ‌త‌ను ఆక‌ర్షించాల‌ని క‌మ్యూనిస్టు నేత‌లు ఆలోచిస్తున్నారు. ఇటీవ‌ల బ‌స్సు యాత్ర‌ల పేరుతో రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టించారు. ఇప్ప‌టికే సీపీఎం మ‌ధు వంటి వారిని త‌న రాజ‌కీయ గురువులుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి పోరాటం ద్వారా ఫ‌లితం సాధించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఏమేర‌కు ఫ‌లిస్తాయ‌న్నది ఆస‌క్తిగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే సీపీఎం, సీపీఐ నేత‌లు ప‌లు చోట్ల నియోజ‌క‌వ‌ర్గాల‌ను గుర్తించి, ఆయా స్థానాల్లో కేంద్రీక‌రించాల‌ని నిర్ణ‌యించారు. దానికి త‌గ్గ‌ట్టుగా శ్రేణులంద‌రినీ ఆయా ప్రాంతాల‌కు త‌ర‌లించి ఖ‌చ్చితంగా ఫ‌లితాలు సాధిస్తామ‌న్న ఆశాభావంతో ఉన్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌జాగ‌ర్జ‌న పేరుతో విజ‌య‌వాడ‌లో భారీ స‌భ‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. తద్వారా మిగిలిన రాజ‌కీయ పార్టీల‌కు ధీటుగా జ‌న‌సమీక‌ర‌ణ చేయాల‌ని స‌న్నాహాలు చేశాయి. విజ‌య‌వాడ స‌భ వామ‌ప‌క్షాల‌కు ఊపునిచ్చే దిశలో ఉంటుంద‌న్న ఆశాభావం క‌మ్యూనిస్టు వ‌ర్గాల్లో క‌నిపిస్తోంది.






Related News

ఆర్కే ప్ర‌త్య‌ర్థి అత‌డే..!

Spread the loveవ‌చ్చే ఎన్నిక‌ల‌కు త‌గ్గ‌ట్టుగా అన్ని పార్టీలు కార్యాచ‌ర‌ణ‌కు పూనుకున్నారు. వ‌చ్చే మార్చిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌న్న ఈసీRead More

జ‌న‌సేనాని..ఓ సారి వెన‌క్కి చూసుకో..!

Spread the loveరాజ‌కీయ మార్పు కోసం అంటూ ముంద‌డుగు వేసిన జ‌న‌సేనానికి అనేక ప్ర‌త్యేక‌త‌లున్నాయి. ఏపీలో స‌మీక‌ర‌ణ కోసం ఏరీతినRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *