ప‌వ‌న్ ని రైతులు పిలుస్తున్నారు…!

pawan(62)
Spread the love

అండ‌గా ఉంటాన‌న్నారు. అధికారం రెచ్చిపోతే అడ్డుకుంటాన‌న్నారు. రైతుల కోసం పోరాడ‌తామ‌న్నారు. తాను ఎవ‌రికీ బానిస‌ను కాద‌ని కూడా చెప్పుకొచ్చారు. కానీ రెండేళ్లు గ‌డుస్తున్నా ఆయ‌న మ‌ళ్లీ మొఖం చూపించ‌లేదు. పాల‌క‌ప‌క్షం రెచ్చిపోతున్నా , భూసేక‌ర‌ణ భూతం విరుచుకుప‌డుతున్నా ఆయ‌న పెద‌వి విప్ప‌లేదు. దాంతో ఏపీ రాజ‌ధాని రైతులు ప‌వ‌న్ క‌ల్యాణ్ కి లేఖాస్త్రం సంధించారు. పెన‌మాక వ‌చ్చి ఆయ‌న చెప్పిన మాట‌లు ఆచ‌ర‌ణ‌లో చూపించాల‌ని కోరుతున్నారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో భూసేకరణ చేస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసిన నేపథ్యంలో జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌ వచ్చి దీన్ని నిలువరించాలని పెనుమాక రైతులు పవన్‌కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. ఫ్యాక్స్ ద్వారా త‌మ వినతిని జ‌న‌సేనానికి చేర‌వేశారు. గతంలో బలవంతంగా ప్రభుత్వం భూమి తీసుకుంటే రైతుల తరపున నిలబడతానని హామీనిచ్చిన మేరకు పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు రంగంలోకి రావాలని వారు కోరారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తేనే తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం నేడు మాట తప్పి భూసేకరణకు నోటిఫికేషన్‌ ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు. మొత్తం ప్రభుత్వ భూములు, సమీకరించిన 50 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం కేవలం 900 ఎకరాల్లోనే చేస్తున్నారని తెలిపారు. మిగతా భూమి అంతా విదేశీ కంపెనీలకు, కార్పోరేట్‌ కంపెనీలకు అమ్ముకుంటున్నారని విమర్శిం చారు. భూసేకరణ చేయొద్దని ముఖ్యమంత్రికి సూచించాలని కోరారు. భూసేకరణ నోటిఫికేషన్‌ ఉపసంహరించుకునే వరకూ, రాజధాని పరిధి నుండి ఉండవల్లి, పెనుమాకలను తప్పించేవరకూ రైతులకు అండగా ఉండాలని వారు ఆ లేఖలో పవన్‌ కోరారు.

ఉద్దానం విష‌యంలో ఫుల్ బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌ధాని రైతుల గోడు ఏమేర‌కు ప‌ట్టించుకుంటారో చూడాలి. అదే స‌మ‌యంలో తుందుర్రులో కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ డిమాండ్ల‌కు భిన్నంగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ముందుకు పోతోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన వైఖ‌రి చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *