సుప్రీంకోర్ట్ తీర్పు: జ‌గ‌న్ కి కొంత తీపి, కొంత చేదు

0

ఉగాదికి ముందే ప్ర‌భుత్వానికి చేదు , తీపి ఫ‌లితాలు మిశ్ర‌మంగా ఎదుర‌య్యాయి. స్థానిక ఎన్నిక‌ల విష‌యంలో ఎంత ప‌ట్టుద‌ల‌తో ప్ర‌య‌త్నించినా ఫ‌లితం ద‌క్క‌లేదు. వాయిదా విష‌యంలో తాము జోక్యం చేసుకోలేమ‌ని సుప్రీంకోర్ట్ చెప్పేసింది. ఎన్నిక‌ల క‌మిష‌న్ వ్య‌వ‌హార‌ల్లో వేలుపెట్ట‌బోమ‌ని తేల్చేసింది. కానీ అదే స‌మ‌యంలో ఆరు వారాల పాటు వాయిదా ప‌డిన ఎన్నిక‌ల‌కు కోడ్ ఎత్తివేయాల‌ని ఆదేశించింది. ఇది జ‌గ‌న్ కి కొండంత ఉప‌శ‌మ‌నంగా క‌నిపిస్తోంది ముఖ్యంగా ఇళ్ల‌ప‌ట్టాల పంపిణీ వంటివి వేగంగా చేప‌ట్టేందుకు తోడ్ప‌డ‌బోతున్నాయి. ప్ర‌జ‌ల్లో అంతో ఇంతో వ్య‌తిరేక‌త ఉంద‌ని విప‌క్షాలు భావిస్తున్న త‌రుణంలో అలాంటి వాటిని చ‌ల్లార్చేందుకు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

దాంతో సుప్రీంకోర్టులో ఏపీ ప్ర‌భుత్వం వేసిన పిటీష‌న్ విష‌యంలో వెలువ‌డిన తీర్పు జ‌గ‌న్ కొంత మోదం, కొంత ఖేదం అన్న‌ట్టుగా ఉంది. తాజాగా వాయిదా ప‌డక‌ముందు ఏక‌గ్రీవం అయిన స్థానాల‌న్నీ యాధావిధిగా కొన‌సాగుతాయ‌ని ఇప్ప‌టికే ఎస్ ఈ సీ తెలిపింది. దానికి తోడుగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోయే మిగిలిన స్థానాల్లో ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసే స్థాయిలో ప్ర‌భుత్వానికి త‌గిన స‌మ‌యం దొరికింది. చాలాకాలంగా ప్ర‌య‌త్నిస్తున్న ఇళ్ల ప‌ట్టాల పంపిణీ ద్వారా ప్ర‌జ‌లు సుదీర్ఘ‌కాలంగా పెట్టుకున్న క‌ల‌ను నెర‌వేర్చే నేత‌గా జ‌గ‌న్ నిలిచేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. అదే జ‌రిగితే ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వానికి సానుకూల‌త పెర‌గ‌డం ఖాయం. అదే స‌మ‌యంలో ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగిన‌ప్ప‌టికీ పెద్ద స‌మ‌స్య లేకుండా జ‌గ‌న్ జ‌నం మ‌న‌సులు గెలుచుకోవ‌డానికి త‌గ్గ‌ట్టుగా ఈ ప‌రిణామం తోడ్ప‌డుతుంది. తద్వారా స్థానిక ఎన్నిక‌ల్లో పాగా వేయాల‌నే అధికార పార్టీ ప్ర‌య‌త్నాల‌కు ఉత‌మిచ్చిన‌ట్ట‌య్యింది.

దాంతో పాటుగా ఎన్నిక‌లు వాయిదా వేసే స‌య‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించాలంటూ చేసిన కామెంట్ తో స‌ర్కారు వాద‌న‌ను బ‌ల‌ప‌రిచిన‌ట్ట‌య్యింది. ఎన్నిక‌లు త‌క్ష‌ణం జ‌ర‌పాల‌నే అంశంలో జ‌గ‌న్ కి ఎదురుదెబ్బ తగిలిన‌ప్ప‌టికీ ఎస్ ఈ సీ తీరు మీద సుప్రీం వేసిన మొట్టికాయ‌లు ప్ర‌భుత్వానికి ఊర‌ట‌నిస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here