రోజాని టార్గెట్ చేసిన వైసీపీ సోష‌ల్ మీడియా

0

ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాకి షాక్ త‌ప్పేలా లేదు. సొంత పార్టీ శ్రేణులే ఇప్పుడు సెగ‌పెడుతున్నాయి. విప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఊరుకున్న నేత‌లు ఇప్పుడు రెండోసారి న‌గ‌రి నుంచి గెల‌వ‌డ‌మే కాకుండా ఏపీఐఐసీ చైర్ ప‌ర్స‌న్ హోదాలో ఉండ‌డంతో ఆమె మీద గురిపెడుతున్నారు. టీవీ షోల‌లో రోజా తీరు మీద చాలాకాలంగా బిన్నాభిప్రాయాలున్న‌ప్ప‌టికీ వైసీపీ నేత‌లు మాత్రం పెద్ద‌గా విమ‌ర్శ‌లు చేయ‌లేదు. పైగా టీవీ షోలో వెకిలి న‌వ్వుల రోజా అంటూ టీడీపీ చేసిన విమ‌ర్శ‌ల‌కు వైసీపీ కార్య‌క‌ర్త‌లు గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా అదే కొన‌సాగిస్తామంటే స‌రికాద‌ని చెబుతున్నారు.

వాస్త‌వానికి రోజా మంత్రి ప‌ద‌విని ఆశించారు. అదే ద‌క్కితే ఆమె టీవీ షోల‌కు గుడ్ బై చెప్పే ఆలోచ‌న కూడా చేశారు. కానీ జ‌గ‌న్ మాత్రం రోజా క‌న్నా జూనియ‌ర్ల‌యినా మ‌హిళా నేత‌ల‌కు క్యాబినెట్ లో చోటు క‌ల్పించి రోజాని ఏపీఐఐసీకి ప‌రిమితం చేశారు. దాంతో ఆమె త‌న ప‌ద‌వితో పాటుగా టీవీ షోల‌ను కూడా కొన‌సాగిస్తోంది. ముఖ్య‌గా జ‌బ‌ర్ధ‌స్త్ షోలో నాగ‌బాబు మారినా రోజా మాత్రం కొన‌సాగుతున్నారు.

ఈ విష‌యంలో వైసీపీ అధిష్టానం అసంతృప్తిగా ఉన్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే ప‌లుమార్లు చెప్పిన‌ప్ప‌టికీ గ్లామ‌ర్ రంగాన్ని వ‌దిలిపెట్ట‌డానికి రోజా సుముఖంగా లేక‌పోవ‌డంతో వైసీపీ నేత‌లు ఆమెను సోష‌ల్ మీడియా సాక్షిగా ఎండ‌గ‌ట్టే ప‌థ‌కానికి రూప‌క‌ల్నన చేసిన‌ట్టు కొంద‌రు సందేహిస్తున్నారు. వెండితెర మీద నుంచి బుల్లితెర‌పైకి వ‌చ్చి అక్క‌డ కూడా త‌న బ్రాండ్ నిరూపించుకున్న రోజా రాజ‌కీయంగా కూడా వైసీపీకి ఎంతో సేవ చేశారు. విప‌క్షంలో ఉండ‌గా రాష్ట్ర‌మంతా తిరిగి పార్టీ వాణీ వినిపించారు.

ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వైసీపీకి త‌గిన మ‌హిళా నేత క‌నిపించ‌క‌పోవ‌డంతో కొంత క‌ల‌వ‌రం మొద‌ల‌య్యింది. తాజాగా అమ‌రావ‌తిలో భువ‌నేశ్వ‌రి ప‌ర్య‌ట‌న‌పై వైసీపీ నుంచి గ‌ట్టి కౌంట‌ర్ మిస్స‌య్యింది. డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి ప్రెస్ మీట్ పెద్ద‌గా ప్ర‌భావితం చేయ‌లేక‌పోయింది. మిగిలిన ఇద్ద‌రు మ‌హిళా మంత్రులు కూడా అదే తీరు. ఇక మ‌హిళా నేత‌ల్లో వైసీపీ వాద‌న బ‌లంగా వినిపించే వాసిరెడ్డి ప‌ద్మ ప్ర‌స్తుతం మ‌హిళా క‌మిష‌న్ ప‌ద‌విలో ఉండ‌డంతో ఆమెకు కూడా ప‌రిమితులు ఏర్పడ్డాయి. ఈ ప‌రిణామాల‌తో రోజా స్పందిస్తార‌ని ఆశించిన‌ప్ప‌టికీ ఆమె షూటింగ్ ల‌తో స‌రిపెట్టుకోవ‌డం వైసీపీ నేత‌ల‌కు రుచించ‌డం లేదు. దాంతో ఆమె టీవీ జీవితం మీద గురిపెట్టి ఇప్పుడు సోష‌ల్ మీడియా పోస్టింగుల‌తో దాడి ప్రారంభించారు. వాటిపై రోజా ఎలా స్పందిస్తార‌న్న‌దే ఇప్పుడు ఆస‌క్తిక‌రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here