‘మ‌హా’ టీవీ మ‌ళ్లీ మారింది..!

0

తెలుగు టీవీ చానెళ్ల‌లో మ‌హాటీవీ ప్ర‌స్థానం ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. తొలుత ఐ వెంక‌ట్రావు సార‌ధ్యంలో తెర‌మీద‌కు వ‌చ్చిన ఈ చానెల్ లో ప్ర‌స్తుతం టీవీ9లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌జనీకాంత్ స‌హా అనేక మంది ప‌నిచేశారు. అయినా చానెల్ మాత్రం పెద్ద‌గా ప్ర‌జాద‌ర‌ణ పొంద‌లేక‌పోయింది. దాంతో ఒక్కొక్క‌రు ప‌క్క‌కు త‌ప్పుకోగా చివ‌ర‌కు ఐ వెంక‌ట్రావు కూడా త‌న చానెల్ లో కీల‌క వాటాల‌ను సుజ‌నాచౌద‌రికి అప్ప‌గించారు. ఆ త‌ర్వాత ఆయ‌న కూడా మ‌రో జ‌ర్న‌లిస్ట్ మారెళ్ల వంశీకృష్ణ‌కు అప్ప‌గించారు.

అదే స‌మ‌యంలో మ‌హాటీవీ త‌న రంగులు కూడా మార్చుకుంటూ సాగింది. లోగో డిజైన్ల‌లో మార్పులు దానికి ద‌ర్ప‌ణం ప‌ట్టాయి. ఇక తాజాగా టీడీపీకి అనుకూలంగా సాగిన ఈ చానెల్ ఇక పై కాషాయం పులుముకోబోతోంది. ఏపీలో బీజేపీ ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా ఈ చానెల్ స్వ‌రం వినిపించ‌బోతోంది.

వంశీ ఆధ్వ‌ర్యంలో గ‌డిచిన రెండేళ్లుగా న‌డుస్తున్న చానెల్ కి ఆశించిన కీర్తి ద‌క్క‌లేదు. అదే స‌మ‌యంలో ఇటీవ‌ల టీడీపీని వీడి బీజేపీలో చేరిన సుజ‌నాచౌద‌రి సొంతంగా తాను కూడా ఓ చానెల్ న‌డిపే నిర్ణ‌యానికి వ‌చ్చారు. దాంతో మ‌ళ్లీ మ‌హాటీవీ యాజ‌మాన్యం మారాల్సి వ‌చ్చింది. అందుకు అనుగుణంగా ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ కి ఈ చానెల్ నిర్వ‌హ‌ణ అప్ప‌గించారు. ప్ర‌స్తుతం ప‌ర‌కాల మిత్ర‌వ‌ర్గం ఈ చానెల్ లో కీల‌క బాధ్య‌త‌లు స్వీక‌రించారు. డి శ్రీనివాస్ అసోసియేట్ ఎడిట‌ర్ గా ముఖ్య భూమిక పోషించ‌బోతున్నారు.

సుజ‌నా చౌద‌రి ఏపీ రాజ‌కీయాల్లో కీల‌కంగా మారాల‌ని భావిస్తున్న వేళ మ‌హాటీవీ ఆయ‌న‌కు ఏమేర‌కు ఉప‌యోగ‌ప‌డుతుందో చూడాలి. అదే స‌మ‌యంలో మ‌హాటీవీని ఇన్నాళ్లుగా న‌డుపుతున్న వంశీ విష‌యం ఏదిశ‌లో ఉంటుందో కూడా ప్ర‌స్తుతానికి ప్ర‌శ్నార్థ‌క‌మే. కొత్త టీమ్ రాక‌తో పాత వాళ్ల‌లో చాలామందికి చెక్ ప‌డుతుంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. చివ‌ర‌కు మ‌హా భ‌విత‌వ్యం ఎటు దారితీస్తుందో అన్న‌ది ఆస‌క్తిదాయ‌క‌మే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here