బీజేపీలో జ‌న‌సేన విలీన‌మా?..పొత్తా?

0

బీజేపీ , జ‌న‌సేన మ‌ధ్య మ‌ళ్లీ బంధం చిగురించింది. స్వ‌యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ప్ర‌క‌ట‌న చేశారు. తాను ఎన్న‌డూ బీజేపీని వీడ‌లేద‌న్నారు. ఈ దేశానికి అమిత్ షా లాంటి నాయ‌కుడు కావాల‌ని ఆయ‌న ప‌దే ప‌దే చెబుతూ వ‌స్తున్న త‌రుణంలో మ‌ళ్లీ బీజేపీకి ద‌గ్గ‌ర‌యిన‌ట్టు సంకేతాలు ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే త‌న పార్టీని బీజేపీలో విలీనం చేయ‌మ‌ని గ‌తంలో అమిత్ షా అడిగిన‌ట్టు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. అయితే అప్ప‌ట్లో తాను అంగీక‌రించ‌లేద‌ని ప‌వ‌న్ చెప్పుకునే వారు. కానీ ఇప్పుడు బీజేపీతో బంధం గురించి బాహాటంగా వెల్ల‌డించ‌డం, అమిత్ షా నాయ‌క‌త్వం అవ‌స‌రం అని చెబుతుండ‌డం గ‌మ‌నిస్తే జ‌న‌సేన కూడా ప్ర‌జారాజ్యం బాట‌లో ప‌య‌నిస్తుంద‌నే అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి.

గ‌తంలో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించి , ఆత‌ర్వాత ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా బ‌రిలో దిగి బోల్తా ప‌డ్డారు. స్వ‌యంగా చిరంజీవి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన పాల‌కొల్లులో కూడా ప‌రాజ‌యం పాల‌యిన త‌ర్వాత పార్టీని న‌డ‌ప‌లేక చేతులెత్తేశారు. చివ‌ర‌కు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశించారు. కేంద్రంలో మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. ఏపీలో త‌న పార్టీకి చెందిన గంటా, సి రామ‌చంద్ర‌య్య‌ల‌ను కిర‌ణ్ క్యాబినెట్ లో అమాత్యుల‌ను చేయ‌గ‌లిగారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన కూడా అదే రీతిలో ఎన్నిక‌ల్లో మ‌రింత దారుణంగా దెబ్బ‌తింది. ఏకంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా గెల‌వ‌లేని ప‌రిస్థితి. రెండూ చోట్లా పార్టీ అద్య‌క్షుడే ఓట‌మి పాల‌యిన‌ప్ప‌టికీ చివ‌ర‌కు రాజోలులో రాపాక వ‌ర ప్ర‌సాద్ గ‌ట్టెక్క‌డంతో బోణీ కొట్ట‌గ‌లిగింది.

ఎన్నిక‌ల అనంత‌రం ప‌వ‌న్ ఢిల్లీ కూడా వెళ్లి బీజేపీ నేత‌ల‌తో భేటీ కోసం ప్ర‌య‌త్నించారు. కానీ ఆయ‌న ఆశ నెర‌వేర‌లేద‌నే ప్ర‌చారం ఉంది. అదే స‌మ‌యంలో బీజేపీలో జ‌న‌సేన‌ను విలీనం చేసేందుకు సిద్ధ‌మ‌యితే బీజేపీ అధిష్టానం సానుకూలంగా స్పందించ‌వ‌చ్చ‌ని ప‌వ‌న్ కి సంకేతాలు పంపించిన‌ట్టు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే త‌న పార్టీని ఆయ‌న సంసిద్ధం చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ప‌దే ప‌దే మ‌తం, కులం వంటి అంశాలు ప్ర‌స్తావిస్తున్నారు. త‌ద్వారా బీజేపీ పెద్ద‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే యోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. హిందూ ధ‌ర్మం గురించి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ని సంతృప్తి ప‌ర‌చ‌డానికి ప‌వ‌న్ ఎత్తులు వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

బీజేపీతో ప‌వ‌న్ స్నేహం మ‌ళ్లీ చిగురుస్తున్న వేళ ఏపీ బీజేపీకి ఓ క్రౌడ్ ఫుల్ల‌ర్ కూడా అవ‌స‌రం. దానికి త‌గ్గ‌ట్టుగా హ‌స్తిన క‌మ‌ల‌నాధులు ప‌వ‌న్ కి ఎర వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌తో క‌మ‌లంలో గ్లాసు ని క‌లిపేస్తారా లేక మ‌ళ్లీ 2014 నాటి ప‌రిస్థితి పున‌రావృతం అవుతుందా అన్న‌దే ప్ర‌స్తుతానికి ప్ర‌శ్నార్థ‌కం. ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న ప‌ట్ల బీజేపీ నేత‌ల స్పంద‌న‌ను గ‌మ‌నిస్తుంటే విలీనం ఆలోచ‌న వారిలో బ‌లంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఏమ‌వుతుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రం. ఏపీ రాజ‌కీయాల్లో కొత్త మ‌లుపులు ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here