బీజేపీకి షాకిచ్చిన ఆర్ఎస్ఎస్

pn-04
Spread the love

మోడీ తీరు పట్ల కొంత అసంత్రుప్తితో ఉన్నట్టు కనిపిస్తున్న ఆర్ఎస్ఎస్ నేతలు అనూహ్యంగా స్పందించారు. ముఖ్యంగా మోడీ సహచరుడు అమిత్ షా తనయుడి వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ స్పందన విశేషంగా మారింది. ముఖ్యంగా ది వైర్ న్యూస్ పోర్టల్ వెలుగులోకి తెచ్చిన జే షా అవినీతి బండారం పై దర్యాప్తు జరపాలని ఆర్ఎస్ఎస్ కోరడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. బీజేపీకి సైద్ధాంతికంగానే సకలం తానే అయ్యి నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ అమిత్ షా అవినీతి ఆరోపణల మీద మాత్రం ఆపార్టీ వైఖరికి భిన్నంగా స్పందించింది. జే షా కంపెనీల మీద దర్యాప్తు జరపాలని విపక్షాలన్నీ పట్టుబడుతుంటే అవసరం లేదని చెబుతున్న బీజేపీ ప్రభుత్వం కథనం రాసిన వారిని వేధిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. పరువు నష్టం కేసు దాఖలు చేసి వెబ్ సైట్ తో పాటు కథనం రాసిన రోహిణీ సింగ్ మీద కూడా సోషల్ మీడియాలో బీజేపీ ట్రోల్స్ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి.

అదే సమయంలో ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి అందుకు భిన్నంగా స్పందించారు. భోపాల్‌లో జరుగుతున్న ఆరెస్సెస్‌ సదస్సులో పాల్గొన్న సంస్థ ప్రతినిధి దత్తాత్రేయ హోసబాలే మాట్లాడుతూ ‘ఎవరిపైనా అవినీతి ఆరోపణలు వచ్చినా దర్యాప్తు జరిపి తీరాల్సిందే. అయితే, అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా ఆధారాలు ఉండాలి’ అని ఆయన అన్నారు. జూనియర్‌ షాపై కేసు నమోదుచేసే అవకాశముందా? అన్న విలేకరుల ప్రశ్నకు.. ‘అది ఆరోపణలు చేసినవారిపై ఆధారపడి ఉంటుంది. ఆరోపణలను రుజువు చేసే బాధ్యత వారిదే’ అని ఆయన పేర్కొన్నారు.

దాంతో బీజేపీ వాదనను ఆర్ఎస్ఎస్ తోసిపుచ్చినట్టయ్యింది. విచారణ జరపాలని, ఆరోపనలు చేసిన వాళ్లు ఆధారలివ్వాలని అడగడం ద్వారా జేషా వ్యవహారం కొత్త మలుపు తిరగడం ఖాయంగా మారుతోంది. అయితే ఆర్ఎస్ఎస్ వాదనను మోడీ ఖాతరు చేసే అవకాశం లేదు. తన అనుంగుడు కోసం ఎంత వరకూ అయినా వెళ్లడానికి మోడీ సిద్ధంగా ఉన్న తరుణంలో విచారణ కు అంగీకరించే అవకాశం లేదని చెబుతున్నారు. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ ఒకమాట, బీజేపీ మరో మాట మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టే పనిలో ఉన్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇదంతా వ్యూహాత్మకమని చెబుతున్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *