తానేంటో నిరూపించుకున్న ప్రకాష్ రాజ్

prakash-raj-3
Spread the love

విలక్షణ పాత్రలతో విశేషంగా ఆకట్టుకోవడమే కాదు…వ్యక్తిత్వం విషయంలోనూ తానేంటో నిరూపించున్నాడు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్. తాజాగా బెంగళూరులో జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య తర్వాత పలువురు స్పందించారు. ప్రజాస్వామ్యం మీద దాడిగా అభివర్ణించారు. దేశమంతా నివ్వెరపోయిన ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో నిరసనలు కూడా వెల్లువెత్తాయి. కానీ ప్రధానమంత్రి మోడీ మాత్రం మౌనం వీడలేదు. అంత దారుణాన్ని కనీసం ఖండించిన దాఖలాలు లేవు.

ఈ విషయంపై ప్రకాష్ రాజ్ స్పందించిన తీరు అందరినీ ఆకర్షించింది. పలువురి ప్రశంసలందుకుంది. నటుడిగానే కాకుండా విశేష సాహిత్యకారుడిగా ప్రతిభావంతుడైన ప్రకాష్ రాజ్ మోడీ మీద నేరుగా విమర్శలు చేయడమే కాకుండా ఇలాంటి దురాఘతాల్ని స్పందించకుండా మౌనం వహించడం అంటే వాటిని పరోక్షంగా సమర్థిస్తున్నట్టేనని చెప్పుకొచ్చారు. తాను నటుడినని చెప్పుకున్న ప్రకాష్ రాజ్ , మోడీని మాత్రం మహానటుడంటూ నేరుగా విమర్శించడం చర్చనీయాంశం అవుతోంది.

వాస్తవానికి ప్రకాష్ రాజ్ తెర మీదే కాకుండా తెర వెనుక కూడా అదే రీతిలో వ్యవహరిస్తారు. సామాన్యులతో కలిసిపోతారు. గతంలో గ్రామాల దత్తత సందర్బంగా తెలంగాణాలో ఆయన దత్తత తీసుకున్న గ్రామంలో కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పలు కార్యక్రమాలు చేపట్టిన అనుభవం ప్రకాష్ రాజ్ ది. అంతేగాకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి తరుపున ప్రభుత్వాన్ని కూడా విన్నవించి గ్రామాభివ్రుద్ధికి తోడ్పడ్డారు.

అలాంటి ప్రకాష్ రాజ్ ఇప్పుడు కీలక సమయంలో స్వరం వినిపించి సంచలనంగా మారారు. గతంలో గిరీష్ కర్నాడ్ వంటి వారు కూడా ఇదే రీతిలో వ్యవహరించినప్పటికీ ప్రకాష్ రాజ్ ధోరణి మరింత నేరుగా ఉంది. ఆయన మరో అడుగు ముందుకేసి తన అవార్డులు కూడా వెనక్కి ఇచ్చేయడానికి సిద్ధమంటూ ప్రకటించడం విశేషం. ఇదిప్పుడు దేశవ్యాప్త చర్చనీయాంశం అయ్యింది. ప్రగతిశీల కళాకారుడిగా ఓ మహిళా జర్నలిస్టు హత్య విషయంలో ప్రకాష్ రాజ్ స్పందించిన తీరు పలువురి ప్రశంసలందుకుంటోంది. చాలామంది సినీ నటుల్లా తన మానాన తాను ఊరుకోకుండా ఓ కీలక అంశాన్ని నిలదీసి, ప్రశ్నించిన ఆయన తీరు అభినందనలందుకుంటోంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *