తెలుగు న్యూస్ చానెల్: చేతులెత్తేసిన చైర్మ‌న్

0

తెలుగు మీడియాలో అన‌తికాలంలో కొంత గుర్తింపు సాధించిన చానెల్ చిక్కుల్లో ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఏకంగా చైర్మ‌న్ త‌న బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నారు. సంస్థను బాగు చేసే అవ‌కాశం క‌నిపించ‌క‌పోవ‌డంతో తాను బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాన‌ని ఆయ‌న బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేశారు. దాంతో ఏపీ 24*7 చానెల్ భ‌విత‌వ్యం గంద‌ర‌గోళంగా మారుతున్న‌ట్టు భావిస్తున్నారు.

విజ‌య‌వాడ కేంద్రంగా తొలి శాటిలైట్ చానెల్ గా నాలుగేళ్ల క్రితం ఈ చానెల్ ఆవిర్భ‌వించింది. అప్ప‌టికే మాటీవీని విజ‌య‌వంతంగా న‌డిపిన ముర‌ళీకృష్ణం రాజు చైర్మ‌న్ గా ఈ సంస్థ‌ను ప్రారంభించారు. వివిధ వ్యాపార రంగాల్లో రాణిస్తున్న కొంద‌రు క‌లిసి స్థాపించిన చానెల్ లో భిన్న దృక్ప‌థాలు క‌లిగిన వారు డైరెక్ట‌ర్లుగా ఉన్నారు. దాంతో వ్య‌వ‌హారం స‌జావుగా సాగ‌డానికి ఛాన్స్ లేకుండా పోయిన‌ట్టు తాజాగా చైర్మ‌న్ లేఖ‌లో పేర్కొన్న అంశాల‌ను బ‌ట్టి తెలుస్తుంది.

ఈ చానెల్ లో వెంక‌ట‌కృష్ణ తీరు మీద ప‌లు విమ‌ర్శ‌లున్నాయి. సీఈవోగా ఆయ‌న ఏక‌ప‌క్ష ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించిన కార‌ణంగా చివ‌ర‌కు చానెల్ అటు ఆర్థికంగానూ, ఇటు రేటింగ్స్ ప‌రంగానూ దిగ‌జారిపోయిన‌ట్టు ఓ వ‌ర్గం వాద‌న. చివ‌ర‌కు సిబ్బందికి ఐదు నెల‌లుగా వేత‌నాలు లేకుండా పోయాయి. అదే స‌మ‌యంలో ప‌లు వివాదాల‌తో చివ‌ర‌కు పోలీస్ స్టేష‌న్ల‌కు పంచాయితీలు చేర‌డంతో వ్య‌వ‌హారం చేతులు దాటిపోయింద‌ని చైర్మ‌న్ ముర‌ళీకృష్ణం రాజు వాపోతున్నారు.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో చానెల్ నిర్వ‌హ‌ణ త‌న వ‌ల్ల‌కాద‌ని ఆయ‌న పేర్కొన‌డంతో భ‌విష్య‌త్తులో ఈ న్యూస్ చానెల్ ప్ర‌స్థానం ఎలా అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఎవ‌రు సార‌ధ్యం వ‌హిస్తారు..ఎలాంటి మార్పులు తీసుకొస్తార‌న్న‌ది సందేహంగా మారుతోంది. దాంతో సిబ్బందిలో కొంత గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here