జ‌ర్న‌లిస్టుల‌కు జ‌గ‌న్ మొండిచేయి..!?

0

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం సంక్షేమ కార్య‌క్ర‌మాల విష‌యంలో న‌వ‌శ‌కం ప్రారంభించింది. కానీ పాత్రికేయులంటే మాత్రం ప‌ట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తోంది. చివ‌ర‌కు ఏటా ప్ర‌భుత్వం నుంచి కేటాయించే అక్రిడిటేష‌న్ కార్డుల జారీలో కూడా అల‌స‌త్వం సాగుతోంది. అట్ట‌హాసంగా ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తులు సేక‌రించి, కొత్త కార్డుల జారీకి అంతా సిద్ధం అయిన త‌ర్వాత చివ‌రి నిమిషంలో విర‌మించుకుంటున్న తీరు విస్మ‌య‌క‌రంగా మారుతోంది.

ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఏడు నెల‌లు దాటుతోంది. కానీ జ‌ర్న‌లిస్టుల‌కు సంబంధించిన ఎటువంటి కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టింది లేదు. పైగా ప్ర‌తీ ఏటా ఇవ్వాల్సిన అక్రిడిటేష‌న్ కార్డుల‌ను కూడా రెన్యువ‌ల్ చేసుకుంటూ పోతోంది. ఇక ఎట్ట‌కేల‌కు 2020లో అయినా కొత్త కార్డులు వ‌స్తాయ‌ని ఆశిస్తే ఇప్పుడు ఆ ఆశ‌లు కూడా గ‌ల్లంత‌వుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. పైసా ఖ‌ర్చు లేని అక్రిడిటేష‌న్ కార్డులు కూడా ఇవ్వ‌కుండా జాప్యం చేస్తున్న ప్ర‌భుత్వ తీరుతో జ‌ర్న‌లిస్టులు ర‌గ‌లిపోతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ ని బ‌లంగా స‌మ‌ర్థించిన వారు కూడా ఈ ప‌రిణామాల‌తో సైలెంట్ అయిపోతున్నారు.

ఇటీవ‌ల కొత్త కార్డుల జారీ కోసం ప్ర‌భుత్వం నూత‌న నిబంధ‌న‌ల‌ను రూపొందించింది. జీఎస్టీ స‌హా అనేక ప‌త్రాల‌ను కోరింది. ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించింది. అర్హులంద‌రికీ కార్డులు ఇస్తామ‌ని మంత్రి పేర్ని నాని స‌హా అధికారులు కూడా ప్ర‌క‌టించారు. కానీ అర్థాంత‌రంగా ఈ ప్ర‌క్రియ‌కు బ్రేకులు ప‌డ‌డ‌మే ఇప్పుడు ఆశ్చ‌ర్యంగా మారింది. చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌త్రిక‌ల విలేక‌రుల నుంచి ఎన్ని అభ్యంత‌రాలు వ‌చ్చినా ప‌ట్టించుకోని యంత్రాంగం ఇప్పుడు అనూహ్యంగా మ‌ళ్లీ పాత‌కార్డులే పొడిగిస్తామ‌ని చెప్ప‌డం వెనుక మ‌త‌ల‌బు అంతుబ‌ట్ట‌కుండా ఉంది. అయితే ప్ర‌స్తుతం ప్ర‌భుత్వంలో స‌ల‌హాదారుడిగా ఉన్న ఓ మాజీ జ‌ర్న‌లిస్ట్ నేత వ్య‌వ‌హార‌మే అందుకు కార‌ణ‌మ‌నే అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణా ప్రాంతానికి చెందిన ఆ జ‌ర్న‌లిస్ట్ నాయ‌కుడు జ‌గ‌న్ కి స‌న్న‌హితుడ‌నే కార‌ణంతో ఏపీలో ప‌ద‌వి ద‌క్కింది. కానీ ఆయ‌న వ్య‌వ‌హారం ఇప్పుడు ఏపీలోని సుమారు 35వేల మంది జ‌ర్న‌లిస్టుల‌కు పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది.

ఏపీలో ఉగాదికి ఇళ్లు, ఇళ్ల‌స్థ‌లాల పంపిణీ ఉంది. అక్రిడిటేష‌న్ క‌లిగిన జ‌ర్న‌లిస్టులంద‌రికీ న్యాయం జ‌రుగుతుంద‌నే ఆశాభావం స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతోంది. ముఖ్యంగా ద‌శాబ్దంన్న‌ర కాలంగా ఎదురుచూస్తున్న వారికి ఇక ఇప్ప‌టిక‌యినా మోక్షం క‌లుగుతుంద‌నే అంచ‌నాలున్నాయి. వ‌రుస‌గా ప్ర‌భుత్వాల‌న్నీ ఊరించ‌డ‌మే త‌ప్ప ఎటువంటి ప్ర‌యోజ‌నం నెర‌వేర్చ‌క‌పోవ‌డంతో జ‌గ‌న్ స‌ర్కారుతో త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌నే అభిప్రాయంతో అనేక మంది సాధార‌ణ జ‌ర్న‌లిస్టులున్నారు. కానీ ఇప్పుడు కొత్త కార్డుల జారీ విర‌మించుకుంటే ఇళ్ల వ్య‌వ‌హారంలో త‌మ‌కు ప్ర‌యోజ‌నం ద‌క్కే అవ‌కాశం లేద‌నే ఆందోళ‌న వారంద‌రిలో వ్య‌క్తం అవుతోంది. ఇలాంటి ప‌రిస్థితికి కార‌ణం రాష్ట్ర అక్రిడిటేష‌న్ క‌మిటీలో త‌న అనునాయుల‌ను నింపేందుకు స‌ద‌రు మీడియా స‌ల‌హాదారుడు చేసిన య‌త్న‌మే కార‌ణ‌మ‌న్న‌ది ప‌లువురి వాద‌న‌. ఆయ‌న తీరు మూలంగా ప‌రిస్థితి మొద‌టికొచ్చేలా క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ జోక్యం చేసుకుని జ‌ర్న‌లిస్టుల అక్రిడిటేష‌న్ కార్డుల విష‌యం చ‌క్క‌దిద్ద‌క‌పోతే పాత్రికేయుల్లో కూడా అస‌హ‌నం పెరిగే ప్ర‌మాదం పొంచి ఉంటుద‌న‌డంలో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here