క‌రోనా కంట్రోల్ లో మార్గ‌ద‌ర్శి కేర‌ళ

  0

  కేర‌ళ అంటేనే ఫారిన్ రిట‌ర్న్స్ ఎక్కువ‌గా ఉంటారు. అటు గ‌ల్ఫ్ తో పాటుగా వివిధ దేశాల్లో మ‌ళ‌యాళీలు ఎక్కువ‌గా క‌నిపిస్తుంటారు. అలాంటి కేర‌ళ‌లోనే తొలిసారిగా క‌రోనా కేసు న‌మోద‌య్యింది. దేశంలో తొలికేసు కావ‌డంతో అంతా క‌ల‌వ‌ర‌ప‌డ్డారు. కానీ కేర‌ళ ప్ర‌భుత్వం మాత్రం చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించింది. స‌మ‌ర్థ‌వంతంగా క‌రోనా నియంత్రించింది. ఇప్ప‌టికే దేశంలో మ‌హారాష్ట్ర త‌ర్వ‌త అత్య‌ధిక క‌రోనా కేసులు ఆ రాష్ట్రంలోనే న‌మోద‌వుతున్నాయి. అయినా నియంత్ర‌ణ విష‌యంలో స‌ర్కారు చొర‌వ ఫ‌లితాన్నిస్తోంది.

  కేవ‌లం ప్ర‌చారంతో స‌రిపెట్ట‌కుండా కేర‌ళ‌లో విజ‌య‌న్ స‌ర్కారు ఏకంగా 20వేల కోట్ల తో క‌రోనా ప్యాకేజ్ ప్ర‌క‌టించింది. అందులో ప్ర‌జ‌లంద‌రికీ ఉచితంగా రేష‌న్ పంపిణీ, రెండు నెల‌ల ముందుగానే సంక్షేమ పెన్ష‌న్లు అంద‌జేత‌, 2వేల కోట్ల‌తో రుణ‌లు పంపిణీ వంటి ప‌లు చ‌ర్య‌లున్నాయి. వాటితో పాటుగా సుభిక్ష స్కీమ్ ని విస్త‌రించి రూ.20కే లంచ్ ఎక్కువ మందికి అందించే ఏర్పాట్లు చేసింది. ఇక క‌రోనా అనుమానితులు రోగుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేష‌న్ సెంట‌ర్ల‌లో స‌మ‌ర్థ‌వంతంగా ఏర్పాట్లు చేస్తోంది. ఆహారం స‌హా మెరుగైన స‌దుపాయాలు క‌ల్పిస్తోంది.

  ఇప్ప‌టికే కేర‌ళ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు గుర్తింపు వ‌చ్చింది. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రికి క‌రోనా నియంత్ర‌ణ‌లో పాల్గొన్న మ‌హిళా మ‌ణుల జాబితాలో పేరు ద‌క్కింది. ఇక తాజాగా కేర‌ళ ముఖ్య‌మంత్రి తో పాటుగా ఆ రాష్ట్ర ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ నేత ర‌మేష్ చెన్నితాల క‌లిసి సంయుక్తంగా మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ప్ర‌జ‌లు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని ఉమ్మ‌డిగా విజ్ఞ‌ప్తి చేశారు. త‌ద్వారా ఆప‌త్కాలంలో అంద‌రిలో స్థైర్యం నింపే ప‌నికి పూనుకోవ‌డం ప్ర‌శంస‌లందుకుంది. మొత్తంగా కేర‌ళ స‌ర్కారు చేప‌డుతున్న చ‌ర్య‌లు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. వివిధ రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శిగా నిలుస్తున్నాయి.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here